తెలంగాణలో మరోసారి గవర్నర్, గవర్నమెంట్ మధ్య లొల్లి షురూ అయ్యేట్టు కనిపిస్తోంది. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో కీలకమైన బిల్లులు ఆమోదించుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న టైంలో కొన్నింటికి గవర్నర్ నుంచి ఆమోదం లభించకపోవడంతో వివాదానికి కారణవుతోంది. అలాంటి బిల్లుల్లో ఆర్టీసీ విలీనం బిల్లు ఒకటి ఉంది.
టెక్నికల్‌గా ఇది ఆర్థిక బిల్లు అయినందున ముందు గవర్నర్ పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఇప్పుడు ఈ బిల్లు అనుమతి కోసం గవర్నర్ తమిళిసై వద్దకు పంపించి ప్రభుత్వం. ఈ సమావేశాల్లో కచ్చితంగా ఆర్టీసీ విలీనం బిల్లును ఆమోదించుకోవాలని భావిస్తోంది ప్రభుత్వం.
శాసన సభ వర్షాకాల సమావేశాలను మూడు రోజుల్లో ముగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే ఇప్పటికే రెండు రోజులు సమావేశాలు పూర్తయ్యాయి. ఇంకొక రోజు మాత్రమే మిగిలి ఉంది. అయితే ఇంత వరకు గవర్నర్ నుంచి ఆర్టీసీ విలీనం బిల్లుపై ఎలాంటి కదలిక లేదు.
దీనిపై బీఆర్‌ఎస్ ప్రభుత్వ పెద్దలు ఆగ్రహంతో ఉన్నారు. చాలా మంది పేదలకు న్యాయం చేద్దామని చూస్తుంటే రాజ్‌భవన్ నుంచి సానుకూల స్పందన రాలేదంటున్నారు. మొదటి నుంచి గవర్నర్ ఇదే తీరున వ్యవహరిస్తున్నారని విమర్శలు చేస్తున్నారు.