Telangana Politics: భారత రాజ్యాంగాన్ని రాసిన మేధావి, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడిన డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కు తనతో పాటు, పార్టీ శ్రేణులంతా మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నట్లు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల తెలిపారు. అస్పృశ్యత అనే భయంకరమైన వ్యాధిని రూపు మాపడంలో అంబేడ్కర్ ఎంతో కృషి చేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నేటికీ ఎస్సీలకు అన్యాయం జరుగుతూనే ఉందని పేర్కొన్నారు. అంబేడ్కర్ స్ఫూర్తితోనే పని చేస్తున్నామని కేసీఆర్, అధికార పార్టీ చెబుతున్నప్పటికీ.. అది ఎక్కడా కనిపించడం లేదని ఆమె ఎద్దేవా చేశారు. దళిత ముఖ్యమంత్రి నుంచి దళిత బంధు వరకు ఇచ్చిన ఎన్నో హామీలను అమలు చేయకుండా దళితులను ఘోరంగా మోసం చేసిన నాయకుడు సీఎం కేసీఆర్ అని ఆరోపించారు. దివంగత నే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు అంబేడ్కర్ పేరు పెడితే, సీఎం కేసీఆర్ ఆ పేరు తీసేసి కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చి కమీషన్ల కోసం రీడిజైన్ చేశారని అన్నారు.
దళితులకు 3 ఎకరాల భూమి ఎక్కడ ?
దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాల భూమి, దళితబంధు అని చెప్పిన సీఎం కేసీఆర్, ఆ హామీలన్నింటిని తుంగలో తొక్కారని షర్మిల పేర్కొన్నారు. రాష్ట్రంలో 18 నుంచి 20 లక్షల దళిత కుటుంబాలు ఉంటే కనీసం వారిలో 10 శాతం మందికి కూడా దళిత బంధు ఇవ్వలేదని చెప్పారు. ఇలా ప్రతీ ఒక్క విషయంలో దళితులను మోసం చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రం రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 వల్ల వచ్చిందని... రాజ్యాంగాన్ని రాసిన అంబేడ్కర్ కు కేసీఆర్ ఇచ్చిన గౌరవం ఎంత అని ప్రశ్నించారు. అంబేడ్కర్ విగ్రహం పెడతామని విస్మరించారన్నారు. ఒకటి కాదు రెండు కాదు దళితులను తక్కువగా చూడటం కేసీఆర్ నైజం అని వివరించారు. దళితులు కేసీఆర్ కు ఓటు బ్యాంకుగా పనికొస్తారే తప్ప కనీసం పక్కన కూడా పెట్టుకోరని షర్మిల మండిపడ్డారు.
రాజ్యాంగాన్ని మార్చాలి అంటూ కామెంట్లు చేస్తూ రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ని ఘోరంగా అవమానించారన్నారు. రాజ్యాంగాన్ని ఎందుకు మార్చాలి అని కేసీఆర్ ను ప్రశ్నిస్తున్నామన్నారు. మీరు రుణమాఫీ చేయడానికి అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అడ్డొచ్చిందా అంటూ విమర్శించారు. మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇవ్వడానికి రాజ్యాంగం అడ్డొచ్చిందా అని కామెంట్లు చేశారు. కేసీఆర్ ఏ విషయంలో రాజ్యాంగాన్ని మారుస్తానన్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఇచ్చిన హామీల్లో ఒక్కటి నిలబెట్టుకోవడం చేతకాలేదు కానీ రాజ్యాంగాన్ని నిలబెట్టుకోవడానికి వచ్చారన్నారు. రాజ్యాంగం అనేది మన దేశాన్ని నడిపిస్తున్న ఇంధనం అని.. రాజ్యాంగం అన్నది మన దేశానికే మహా గ్రంథం అని తెలిపారు. అలాంటి రాజ్యాంగాన్ని కేసీఆర్ మార్చాలనడం మహా ఘోరం అని షర్మిల ఫైర్ అయ్యారు.
కొట్టి చంపే రాజ్యాంగమే.. కేసీఆర్ రాజ్యాంగం
తెలంగాణలో అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావడం లేదని... తెలంగాణలో కేసీఆర్ రాజ్యాంగం అమలవుతోందన్నారు. కే అంటే కొట్టి, సీ అంటే చంపి, ఆర్ అంటే రాజ్యాంగం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ భారత దేశంలో అంతా అంబేడ్కర్ గారి రాజ్యాగం అమలవుతుంటే తెలంగాణలో మాత్రం కేసీఆర్ రాజ్యాంగం అమలవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేడ్కర్ రాజ్యాంగంలో మనకు హక్కులున్నాయి, స్వేచ్ఛ ఉంది కానీ... , ప్రజల కోసం నిలబడి మాట్లాడే హక్కు ఉంది, కొట్లాడే హక్కు ఉందని తెలిపారు. కానీ కేసీఆర్ రాజ్యాంగంలో ప్రజలకు స్వేచ్ఛ లేదని, ప్రజల కోసం ఎవరైనా పోరాడితే వాళ్లను కాలు బయట పెట్టనివ్వకూడదు అని రాసి ఉందంటూ తీవ్ర విమర్శలు చేశారు.