Telangana News: బీఆర్ఎస్ కు భూకేటాయింపుపై హైకోర్టులో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పిల్ దాఖలు చేసింది. కోకాపేటలో ఖరీదైన భూమిని భారత రాష్ట్ర సమితి కార్యాలయం (BRS Office) కోసం కేటాయించారని తెలిపింది. 50 కోట్ల రూపాయల విలువ చేసే 11 ఎకరాల భూమిని కేవలం రూ.3.41 కోట్లకే కేటాయించినట్లు పేర్కొంది. ఐదు రోజుల్లోనే కేటాయింపు ప్రక్రియను పూర్తి చేశారని.. అంతేకాకుండా అందుకు సంబంధించిన డాక్యుమెంట్లన్నింటినీ రహస్యంగా దాచి పెట్టారని స్పష్టం చేశారు. శిక్షణ, ఎక్సలెన్స్ కేంద్రం పేరిట బీఆర్ఎస్ భూమి పొందిందని అన్నారు. బీఆర్ఎస్ కు బంజారాహిల్స్ లో పార్టీ కార్యాలయం ఉన్నప్పటికీ మళ్లీ భూమి కేటాయించారని వివరించారు. భూమి ఉండగా భూకేటాయింపు చేసినందున వెంటనే ఆ జీవోను రద్దు చేయాలని న్యాయస్థానాన్ని కోరింది. కోకాపేటలో నిర్మాణ పనులు జరపకుండా స్టే ఇవ్వాలని తెలిపింది. ఇటీవలే కోకాపేటలో బీఆర్ఎస్ మానవ వనరుల కేంద్రానికి ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ భూమిపూజ చేసిన విషయం తెలిసిందే. పార్టీ నాయకులను కార్యకర్తలకు శిక్షణ ఇచ్చేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ డెవలప్ మెంట్ పేరుతో బీఆర్ఎస్ ఈ కేంద్రాన్ని నిర్మిస్తోంది. 


బీఆర్ఎస్ 11 ఎకరాల భూమి కేటాయింపు


పార్టీ నాయకులకు శిక్షణ, సంబంధిత కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా భవనాన్ని నిర్మించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఇందుకోసం కోకాపేటలోని 239, 240 సర్వే నెంబర్లకు చెందిన 11 ఎకరాల భూమిని బీఆర్ఎస్ కు ఇటీవల మంత్రివర్గ సమావేశంలో కేటాయించారు. వీలైనంత త్వరగా నిర్మాణం చేపట్టాలన్న ఉద్దేశంతో వెంటనే భవన నిర్మాణం కోసం అనుమతులు తీసుకునే ప్రక్రియను చేపట్టారు. బీఆర్ఎస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ కోసం అన్ని రకాల అనుమతులు లభించినట్లు సమాచారం. పార్టీ నేతలు, శ్రేణులకు శిక్షణ ఇవ్వడం, వసతి సౌకర్యం, గ్రంథాలయాలు, సెమినార్ హాల్స్ ఉండేలా ఈ భవనాన్ని నిర్మించనున్నారు. కానీ ఇప్పుడు తాజాగా బీఆర్ఎస్ కేటాయింపును రద్దు చేయాలని హైకోర్టులో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పిల్ దాఖలు చేసింది.