Telangana New CM: తెలంగాణలో అధికారం కైవశం చేసుకున్న కాంగ్రెస్‌కు సీఎం అభ్యర్థిని ఖరారు చేయడం పెద్ద పరీక్షగా మారుతోంది. అన్ని రాష్ట్రాల మాదిరిగానే ఇక్కడ కూడా సీఎం కుర్చీ కోసం నేతలు వరుస కట్టారు. పార్టీ విజయంలో తామంతా భాగస్వాములమని చెబుతూ తాకమూ ఆ అర్హత ఉందని అంటున్నారు.
రేవంత్ రెడ్డిని సీఎంగా చేసేందుకు ఓ వర్గం ప్రయత్నిస్తోందని దీన్ని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. ఇలా వ్యతిరేకించే వాళ్లు నేరుగా రేవంత్ పేరు చెప్పకపోయినా తాము ఎందుకు అర్హులం కామో చెప్పాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా వాదిస్తున్న వారిలో సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహా, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి బ్రదర్శ్ ఉన్నట్టు తెలుస్తోంది.
విడివిడిగా అందరితో సమావేశమైన కాంగ్రెస్ దూతలు వారి వారి అభిప్రాయాలను రికార్డు చేసుకున్నారు. అన్నింటినీ ఢిల్లీ అధినాయకత్వానికి నివేదిస్తామని చెబుతున్నారు. వాళ్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి అంటున్నారు. సీఎంగా ఎవరిని నియమించినా ఫర్వాలేదని... రేవంత్ రెడ్డిని మాత్రం చేయొద్దని డిమాండ్ గట్టిగా వినిపిస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రేవంత్ రెడ్డికి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఆయన ఫాలో అయ్యే ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటిస్తున్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది.
పదవులపై సోషల్ మీడియాలో, కాంగ్రెస్ గ్రూపుల్లో జరుగుతున్న ప్రచారంపై కొందరు సీనియర్లు అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఎలాంటి అధికారిక సమావేశాలు లేకుండాన కొందరికి కొన్ని పదువులు కన్ఫామ్ అయినట్టు ప్రచారం జరగడం ఏంటని ప్రశ్నించారని తెలుస్తోంది. శ్రీధర్ బాబుకు స్పీకర్ పదవి ఇచ్చారని జరుగుతున్న ప్రచారంపై ఆయన మండిపడ్డారట. తాను ఎలాంటి పదవి అయినా లేకుండా ఉంటాను కానీ తనకు స్పీకర్ పదవి వద్దని చెప్పినట్టు సమాచారం. ఉపముఖ్యమంత్రి పదవి విషయంలో కూడా వాగ్వాదం జరిగిందని బోగట్టా. ఒకటే డిప్యూటీ సీఎం పదవి ఉండాలని కొందరు ప్రతిపాదించారు. తలో వర్గానికి ఒక్కోటి ఇస్తే దానికి ఉన్న విలువ పడిపోతుందని అన్నట్టు తెలుస్తోంది.