Telangana MLAs Case: ఎమ్మెల్యేల ఫిరాయింపులకు వార్షికోత్సవం పూర్తయిందా ? వాటిని దాటి ముందుకెళ్లలేం: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
MLA Disqualification Case | తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతా పిటిషన్ల విచారణలో సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ గవాయి ప్రతివాదులకు చురకలు అంటించారు.

Defected MLAs Case In Telangana | న్యూఢిల్లీ: తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణలో భాగంగా ప్రతివాదులపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కౌంటర్ దాఖలు చేయడానికి ఇంకా ఎంత టైం ఇవ్వాలి, ఇంకా ఎన్ని రోజులు గడువు ఇవ్వాలంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం పూర్తయిందా అని జడ్జి జస్టిస్ గవాయి చురకలు అంటించారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు పిటిషన్ (MLA Disqualification Case) తదుపరి విచారణను సుప్రీం ధర్మాసంన ఏప్రిల్ 2కు వాయిదా వేసింది. ఆ విచారణలో ప్రతివాదుల వాదనలు వినే అవకాశం ఉంది.
టిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తరఫున లాయర్ సుందరం వాదనలు వినిపించారు. టిఆర్ఎస్ నుంచి గెలిచి అధికారం ఉందని కాంగ్రెస్ పార్టీలో చేరారని స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని... ఒక ఎమ్మెల్యే అయితే కాంగ్రెస్ టికెట్ మీద లోకసభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారని బీఆర్ఎస్ నేత పిటిషన్ పై వాదనలు వినిపించారు.
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఏం నిర్ణయం తీసుకుంటారు, ఫిర్యాదులపై 4 వారాల్లో షెడ్యూల్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కానీ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు కూడా ఇవ్వలేదు. ధర్మాసనం జోక్యం చేసుకున్నాక నామమాత్రంగా నోటీసులిచ్చారు. మూడు వారాల్లో రిప్లై ఇవ్వాలని ఫిబ్రవరి 13వ తేదీన స్పీకర్ నోటీసులు జారీ చేశారు. నెల రోజులు గడిచినా ఎలాంటి చర్యలు తీసుకోవలేదు. మేం చేసిన ఫిర్యాదుకు ఏడాది గడుస్తున్నా స్పీకర్ షెడ్యూల్ చేయలేదు. యధేచ్ఛగా ఫిరాయింపులు జరుగుతున్నా, ఫిర్యాదులు అందుకున్న స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదని’ కౌశిక్ రెడ్డి పిటిషన్ పై సీనియర్ లాయర్ సుందరం వాదనలు వినిపించారు.
పలానా సమయంలో తేల్చాలని తీర్పులు చెప్పలేమన్న ధర్మాసనం
ఫిర్యాదు వచ్చి ఎన్ని రోజులు అవుతుందని ధర్మాసనం ప్రశ్నించింది. కాలయాపన చేసే విధానాలు మానుకోవాలని, ఎమ్మెల్యేల పదవీకాలం పూర్తయ్యేవరకు కాలయాపన చేస్తారా అంటూ సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ప్రతివాదులను ప్రశ్నించింది. ఇలాంటి కేసుల్లో రాజ్యాంగ ధర్మాసనాలు కొన్ని తీర్పులు ఇచ్చాయని, ఫిర్యాదులపై పలానా సమయంలో తేల్చాలని తీర్పులు చెప్పలేమని జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం పేర్కొంది. ఉన్నత ధర్మాసనాల తీర్పులను తిరిగి రాయలేమని, వాటిని కాదని ఈ అంశంలో ఎలా ముందుకు వెళ్లగలమని వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్‌లో తెలంగాణ ప్రభుత్వం, స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి, పార్టీ మారిన ఎమ్మెల్యేలు ప్రతివాదులుగా ఉన్నారు.
పార్టీ మారలేదంటున్న ఎమ్మెల్యేలు..
మరోవైపు ఎమ్మెల్యేలకు గూడెం మహిపాల్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులకు, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ లకు సైతం సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవల నోటీసులు జారీ చేసింది. అయితే తాము పార్టీ మారదలేదని, కొందరు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని కొందరు ఫిరాయింపు ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చుకున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన నోటీసుల గడువు ముగిసినా స్పందించకపోవడంతో స్పీకర్ మార్చి 25లోపు వివరణ ఇవ్వాలని సూచించింది. కానీ ఎమ్మెల్యేలపై ఏం చర్యలు తీసుకున్నారు, పిటిషన్లపై స్పీకర్ వైఖరిపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.