స్వాతంత్య్రోద్యమం, తెలంగాణ ఉద్యమంలో పత్రికలు కీలకపాత్ర పోషించాయని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లోని అంబేడ్కర్ యూనివర్శిటీలో జరిగిన మీడియా ఇన్ తెలంగాణ సదస్సుకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్బంగా రాజకీయాలు, ప్రధాని మోదీ తదితర అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. 


వారసత్వం అనేది కేవలం రాజకీయాల్లో ప్రవేశం వరకే  ఉపయోగపడుతుందని.. ప్రతిభ లేకుండా అందులో రాణించలేరని కేటీఆర్ అన్నారు. తామేంటో సొంతంగా నిరూపించకోకపోతే ఏ వారసత్వాన్ని ప్రజలు భరించలేరన్నారు. మొదటి ఎన్నికల్లో తాను చాలా కష్టపడి గెలిచానని.. తర్వాత తన పనితీరుతోనే సిరిసిల్లో మెజారిటీని పెంచుకున్నానని వ్యాఖ్యానించారు. సరిగ్గా పనిచేయకపోతే ప్రజలు ఎవరినీ ఉపేక్షించరని చెప్పారు. 


పత్రికలది కీలకపాత్ర


పలు ఉద్యమాల్లో పత్రికలు ప్రధాన పాత్ర పోషించాయని కేటీఆర్ అన్నారు. ఈ మధ్య ఏది న్యూసో, ఏది వ్యూసో తెలుసుకోవడానికి పేపర్ ను చాలా సార్లు చదవాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు.  షోయబ్ ఉల్లా ఖాన్ తెలంగాణ జర్నలిస్టులకు స్ఫూర్తి అని.. గోల్కొండ పత్రికతో సురవరం పోషంచిన పాత్ర మరువలేనిదన్నారు. పత్రికా యాజమాన్యాల కంటే తెలంగాణ విలేకర్ల పోరాట స్ఫూర్తి ఎక్కువని చెప్పారు. 
 ఉద్యమ రోజుల్లో పత్రికా యాజమాన్యాలు తెలంగాణకు, టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఉండేవని గుర్తుచేశారు. జర్నలిజం ముసుగులో ఇప్పటికీ వ్యక్తిగత దూషణలు, బూతులు తిడుతున్నారని చెప్పారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆయన గురించి రాసిన పత్రికల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదని మంత్రి అన్నారు.


జర్నలిస్టులు టీఆర్ ఎస్ కు అండగా ఉన్నారు


యాజమాన్యాలు ఎలా ఉన్న టీఆర్‌ఎస్‌కు అండగా నిలబడింది తెలంగాణ జర్నలిస్టులేనని కేటీఆర్ అన్నారు.  స్టింగర్ల నుంచి డెస్క్‌ వరకు తమకు సపోర్టుగా నిలబడటంతోనే తెలంగాణ సాధించగలిగామన్నారు. తెలంగాణ జర్నలిస్టులు ఢిల్లీదాక వచ్చి తెలంగాణ కోసం కొట్లాడారని గుర్తుచేశారు. జర్నలిస్టుల ప్రాధాన్యాన్ని సీఎం కేసీఆర్‌ ఏనాడూ తగ్గించలేదని అన్నారు. విలేకర్ల సంక్షేమం కోసం నిధులు కేటాయించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. 19 వేల అక్రిడేషన్‌ కార్డులున్న జర్నలిస్టులు మన రాష్ట్రంలో ఉన్నారన్నారు.


చదవకపోతే అలా.. చదివితే ఇలా


పత్రికలు చదవకుంటే ఏమీ తెలియదు.. చదివితే ఏది నిజమో తెలియదన్నట్లుగా ప్రస్తుత పరిస్థితి ఉందని కేటీఆర్ అన్నారు. భారత ప్రధాని చేసిన ఒత్తిడి వల్ల అదానీకి రూ.6 వేల కోట్ల ప్రాజెక్టు ఇచ్చామని శ్రీలంక చెప్పిందన్నారు. అదానీకి ఇచ్చిన ప్రాజెక్టుపై ఏ ఒక్క మీడియా అయినా అక్కడికి వెళ్లి నిజానిజాలు నిగ్గుతేల్చిందా అని ప్రశ్నించారు. మోదీ మన్‌ కీ బాత్‌ మనం వినాల్సిందే కానీ ఆయన మన మన్‌ కీ బాత్‌ ఎప్పుడైనా విన్నారా అని ఆగ్రహంవ్యక్తంచేశారు. 


పాజిటివ్ కంటే నెగెటివ్ వ్యాప్తి ఎక్కువ


9 బిలియన్‌ డోసుల కరోనా వ్యాక్సిన్లను హైదరాబాద్‌ ఉత్పత్తి చేసిందని, దాని  గురించి మన మీడియా ఎందుకు హైలెట్‌ చేయలేదని వాపోయారు. జో బైడెన్‌ ప్రయాణించే హెలికాప్టర్‌ క్యాబిన్‌ కూడా హైదరాబాద్‌లోనే తయారయిందన్నారు. మిషన్‌ కాకతీయ వల్ల చెరువు కట్టలు బలంగా ఉండి తెగడంలేదన్నారు. చెరువు కట్టలు తెగితే వార్తకానీ.. బలంగా ఉంటే వార్త కాదా అని ప్రశ్నించారు. భూగర్భ జలాలు లేకుంటే వార్త కానీ, భూగర్భ జలాలు పెరిగితే ప్రచురణార్హం కాదా అని అన్నారు. ప్రస్తుతం
ఏ మీడియాలో అయినా పాజిటివ్‌ కంటే నెగెటివే ఎక్కువ వ్యాప్తి చెందుతున్నారు.