మునుగోడులో 101 నామినేషన్లు వేయాలనుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచిరెడ్డి రాజేందర్ రెడ్డి తెలిపారు. లారీ యజమానుల సమస్యల పైన సానుకూలంగా స్పందించిన ప్రభుత్వానికి, మంత్రులకు రాష్ట్ర కార్యవర్గం కృతజ్ఞత తెలిపింది.
మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన లారీ ఓనర్స్ అసోసియేషన్... లారీ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రస్తావించారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు రవీందర్, రవీంద్రనాయక్ ఆధ్వర్యంలో లారీ యాజమాన్యాల సంఘాల అసోసియేషన్ ముఖ్య నాయకులు, ప్రతినిధులు మంత్రిని కలిశారు. లారీ యజమానులు ఎదుర్కొంటున్నా పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. సరుకు రవాణాలో ఉన్న ఇబ్బందులు, వాటి పరిష్కారంలో ప్రభుత్వ సహకారం కావాలని విజ్ఞప్తి చేశారు.
సమస్యల పరిష్కారానికి కేటీఆర్ సానుకూలంగా స్పందించినట్టు లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల మధ్య కామన్ పర్మిట్, ఓవర్ లోడ్ జరిమానాలు, గ్రీన్ టాక్స్ విషయంలో త్వరగా సానుకూలంగా నిర్ణయం వచ్చేలా చూడాలని కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌తో మాట్లాడిన మంత్రి సమస్య పరిష్కరించాలని చెప్పినట్టు వివరించారు. మిగతా సమస్యలపై కూడా సాధ్యమైనంత తక్కువ సమయంలో సానుకూల నిర్ణయం వచ్చేలా ప్రయత్నం చేయాలని సూచించింది అసోసియేషన్.
ప్రభుత్వం, రాజకీయ పార్టీల దృష్టిని ఆకర్షించాలని తాము ఉపఎన్నికల్లో భారీగా పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని వివరించారు అసోసియేషన్ అధ్యక్షుడు. ఆ అవసరం లేకుండానే నేరుగా ప్రభుత్వంలోని మంత్రులతో సమావేశం ఏర్పాటు చేసి తమ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని ఇచ్చిన హామీ మేరకు నిర్ణయాన్ని వెనక్కు తిసుకుంటున్నట్లు తెలిపారు. తమ సమస్యలపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు. కెసిఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వాన్ని బలపరిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.