WE ITTC News: గతంలో వంటింటికి పరిమితమైన మహిళలు ఇవాళ సక్సెస్‌ఫుల్‌ ఆంట్రప్రెన్యూర్లుగా మారుతున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఒక్క పారిశ్రామికంగానే కాదు.. అన్ని రంగాల్లో అతివలు తమ ప్రతిభ చూపుతున్నారని సంతోషం వ్యక్తంచేశారు. ప్రభుత్వ సహకారంతో మహిళలు పారిశ్రామికవేత్తలుగా తయారవడం ఆనందంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. బంజారాహిల్స్‌లోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మహిళా పారిశ్రామికవేత్తల అంతర్జాతీయ వాణిజ్య సాంకేతిక కేంద్రానికి ( WE ITTC) ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ విమెన్ ఆంట్రప్రెన్యూర్స్‌ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ సెంటరును పటాన్ చెరులో ఏర్పాటు చేయబోతున్నారు. 


మహిళా ఆంట్రప్రెన్యూర్ల కోసం ప్రత్యేక ఇండస్ట్రియల్ పార్కులు


మహిళా పారిశ్రామికవేత్తలను తెలంగాణ ప్రభుత్వం మొదట్నుంచీ ప్రోత్సహిస్తోందని కేటీఆర్ గుర్తుచేశారు. గతంలో ఆంట్రప్రెన్యూర్షిప్గా కెరీర్ ప్రారంభించాలంటే చాలా కష్టంగా ఉండేది.. కానీ ఇప్పుడు చాలా సులువు అని అభిప్రాయపడ్డారు. మహిళలు అన్ని విషయాలను అవగాహన చేసుకుని ఏదైనా సాధించగలుగుతారని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం గాజులరామారంలో ఒక ఇండస్ట్రియల్ పార్కు, తూప్రాన్‌లో మరో పార్కును ఏర్పాటు చేసిందని తెలిపారు. వాటిని మహిళా పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహిళా సంఘాలు చాలా బలంగా పనిచేస్తున్నాయన్నారు మంత్రి కేటీఆర్.


తెలంగాణ ముఖచిత్రాన్ని మార్చిన ఐదు విప్లవాలు


తెలంగాణలో ఐదు రకాల విప్లవాలు ఆవిష్కరించబడ్డాయన్నారు మంత్రి కేటీఆర్. మాంసం ఉత్పత్తిలో పింక్ రెవల్యూషన్, వరి పండించడంలో గ్రీన్ రెవల్యూషన్, పాల సేకరణలో వైట్ రెవల్యూషన్, ఆయిల్ పామ్ సాగులో యెల్లో రెవల్యూషన్, చేపల పెంపకంలో బ్లూ రెవల్యూషన్.. .ఇలా ఐదు రంగాల్లో విజయం సాధించామని కేటీఆర్ చెప్పుకొచ్చారు.  దేశంలోనే అత్యధికంగా వరి పండించే రాష్ట్రంగా తెలంగాణ అగ్రభాగాన నిలబడిందన్నారు. తెలంగాణలో 46వేల చెరువులు పునరుద్ధరించామని తెలిపారు. చేపల పెంపకం పెద్దఎత్తున చేపట్టామని, రాష్ట్రం నుంచి మాంసం ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్నామని పేర్కొన్నారు. డెయిరీ రంగంలో కూడా తెలంగాణ అద్భుతంగా ముందుకు వెళుతోందన్నారు. విజయ డెయిరీ ద్వారా రైతుల నుంచి పాల సేకరణ చేస్తున్నామని.. మిల్క్ ప్రొక్యూర్‌మెంట్ ఒక్కటే కాకుండా పాల ఉత్పత్తులన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఎగుమతి చేస్తోందని అన్నారు. 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు శ్రీకారం చుట్టామని తెలిపారు. విదేశాల నుంచి నూనె దిగమతి చేసుకునే దుస్థితి తప్పాలని ఆయన అభిప్రాయపడ్డారు. అదిలాబాద్ జిల్లాలో యాపిల్ కూడా పండిస్తున్నామని, అందుకు గర్వంగా ఉందని అన్నారు. అంతరిక్షంలోకి వెళ్లే రాకెట్లు తయారు చేయడంలో మహిళలు ఆరితేరాలి! అంతరిక్షంలో వెళ్లే వ్యోమగాముల్లో మహిళలకు స్థానం ఉండాలి! ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లలను మహిళలు నడపాలి అని ఆకాంక్షించారు. అన్ని రంగాల్లో మహిళలు ఉన్నతకు స్థానంలోకి రావాలని కేటీఆర్ కోరుకున్నారు. పెద్దగా ఆలోచించండి.. ఉన్నత స్థానానికి ఎదగండని విష్ చేశారు.


WE ITTC ఏం చేస్తుంది?


మహిళా పారిశ్రామికవేత్తల అంతర్జాతీయ వాణిజ్య సాంకేతిక కేంద్రం (WE ITTC) విమెన్ ఆంట్రప్రెన్యూర్లకు ఉమ్మడి వేదికగా పనిచేస్తుంది. ఈ వేదిక ద్వారా ఎక్కడి నుంచైనా వ్యాపారం చేసుకోవచ్చు. ఇదొక విశ్వసనీయ సంఘంగా పనిచేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద మార్కెట్లలోకి ప్రవేశించే వారికి ఇదొక ప్లాట్‌ఫారంగా ఉపయోగపడుతుంది. స్కిల్స్ పెంచుకోవడానికి, వ్యాపారంలో ఎదగడానికి ఇదొక చక్కటి వేదిక. ఫ్యూచర్ ఆంట్రప్రెన్యూర్ల కోసం ఇక్కడ శిక్షణ అందిస్తారు. వెబ్‌నార్స్‌, సెమినార్స్ నిర్వహిస్తారు. తరచూ వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి..