HCU Land Dispute: కంచి గచ్చిబౌలి భూమిలో ఉన్న అటవీ ప్రాంతాన్ని చదును చేసే పనులు ఏప్రిల్ 3వ తేదీ వరకు నిలిపివేయాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కంచిగచ్చిబౌలి భూముల విషయంలో హెదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు, వారితోపాటు వట ఫౌండేషన్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాజ్యంపై ఇవాళ(బుధవారం, 2 ఏప్రిల్‌ 2025) తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. కంచి గచ్చిబౌలి భూములను జాతీయ ఉద్యాన వనంగా ప్రకటించాలని ఈ వాజ్యంలో వట ఫౌండేషన్, హెచ్ సీయూ విద్యార్థులు వాజ్యంలో పేర్కొన్నారు. దీనిపై వాజ్యదారుల వాదనలను, అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వాదనలను విన్న న్యాయస్థానం ఏప్రిల్ 3వ తేదీ వరకు పనులు నిలిపివేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది జూన్‌లో జీవో నెంబర్ 54 జారీ చేసింది. దీని ప్రకారం 400 ఎకరాల ప్రభుత్వ భూమిని టీ.జీ. ఐ. సీ. సీ కి అప్పగిస్తున్నట్లు జీవో నెంబర్ 54లో తెలంగాణ సర్కార్ పేర్కొంది. దీంతో ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం భారీ యంత్రాలతో చదును చేస్తోంది.

వట ఫౌండేషన్, హెచ్ సీయూ తరపున న్యాయవాది వాదనలు ఇలా..వట ఫౌండేషన్, హెచ్. సీ. యూ తరపున న్యాయవాది ఎల్. రవి శంకర్ హైకోర్టులో తన వాదనలు వినిపించారు. 1.  జీవో 54 ప్రకారం 400 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి అయినా అందులో ఉన్న చెట్లను, అటవీ ప్రాంతాన్ని చదును చేయాలంటే గతంలో ఇచ్చిన సుప్రింకోర్టు తీర్పులకు లోబడే ప్రభుత్వాలు పని చేయాలి.2. సుప్రింకోర్టు తీర్పు ప్రకారం అటవీ ప్రాంతాన్ని చదును చేసి వేరే పనులకు వాడాలంటే అందుకు నిపుణుల కమిటీ వేసి ఆ కమిటీ ఇచ్చిన సిఫారసు మేరకు ప్రభుత్వాలు పని చేయాలి.3. అటవీ ప్రాంతంతోపాటు అక్కడ వన్య ప్రాణులు ఉంటే నిపుణుల కమిటీ నెల రోజుల పాటు ఆ ప్రాంతంలో పర్యటించి వన్య ప్రాణుల సమచారం అంతా క్రోడీకరించాలి. వాటిపై ఉండే ప్రభావాన్ని అంచనా వేసి చెప్పాలి.4. ప్రస్తుతం తెలంగాణ సర్కార్ చదును చేస్తున్న ప్రాంతంలో 3 సరస్సులు ఉన్నాయి. పెద్ద పెద్ద రాక్స్ ఉన్నాయి.  అరుదైన జీవ జాలం ఉంది. వాటిని కాపాడాల్సిన అవసరం ఉంది. దీనిపై ఎలాంటి అధ్యయం జరకుండా సుప్రింకోర్టు గైడ్ లైన్స్ పాటించకుండా పనులు చేపట్టారు.

తెలంగాణ సర్కార్ తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు ఇలా...1. గచ్చిబౌలి భూముల్లో అటవీ ప్రాంతం లేదు. ప్రభుత్వం అటవీ ప్రాంతంగా ఈ స్థలాన్నినోటి ఫై చేయలేదు. ఈ భూమి నిజాం కాలం నుంచి బీడు భూమిగా రికార్డుల్లో ఉంది. ఇది పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించిన భూమి మాత్రమే.2. 2004లో ఈ భూమిని ప్రభుత్వం ఐఎంజీ అకాడమీకి అప్పగించడం జరిగింది. ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న ప్రకారం ఐ.ఎంజీ ఈ భూములను ఉపయోగించకపోవడంతో అప్పటి సర్కార్ ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఇది పారిశ్రామిక అవసరాల కోసమే తప్ప అటవీ ప్రాంతం కాదు.3. పిటిషనర్ల వాదనలను పరిగణలోకి తీసుకుంటే హైదరాబాద్‌లో చాలా ప్రాంతాల్లో వన్యప్రాణులు ఉన్నాయి. అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడని పరిస్థితి ఉంటుంది.

 హైకోర్టు ప్రశ్నలు, ఆదేశాలు ఇవే...

ఇరు వర్గాల వాదనలను విన్న న్యాయస్థానం ఈ 400 ఎకరాల భూమి పారిశ్రామిక అవసరాల కోసమే అని ప్రభుత్వ రికార్డుల్లో ఉందా అని ఏజీని ప్రశ్నించింది. అందుకు ఏజీ, గతం నుంచీ సర్వే నెంబర్‌లోని భూములను ఆయా అవసరాల కోసం ప్రభుత్వాలు కేటాయిస్తూ వస్తున్నాయని చెప్పారు. ఇరు వర్గాల వాదనలను విన్న హైకోర్టు ఏప్రిల్ 3 వరకు ఎలాంటి పనులు చేయవద్దని ప్రభుత్వాన్ని ఆదేశిస్తునే తదుపరి విచారణను ఏప్రిల్ 3వ తేదీకి వాయిదా వేసింది.