Telangana News: ఎస్సీ, ఎస్టీ యువతకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం! పదివేల మందికి ఈవీల పంపిణీకి సిద్ధం!
తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ యువత స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం భారీ కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ-కామర్స్, లాజిస్ట్రిక్స్, రంగాల్లో రాణించేందుకు ఈవీలు పంచేందుకు సిద్ధమైంది.

Telangana News: తెలంగాణలో నిరుద్యోగ సమస్యను అధిగమించడంతోపాటు, మారుతున్న మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ యువతను సిద్ధం చేయడమే ఈ పథకాల ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా ఈ కామర్స్, లాజిస్టిక్ రంగాల్లో పెరుగుతున్న డిమాండ్‌ను అందిపుచ్చుకోవడానికి ఎలక్ట్రిక్ వాహనాలు కీలకమని ప్రభుత్వం భావిస్తోంది. తక్కువ నిర్వహణ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉండటంతో ఈ రంగంవైపు యువతను మళ్లించేందుకు భారీ సబ్సిడీలను ప్రకటించింది.
ఎస్సీ కార్పొరేషన్‌లో ఎంపిక ఎలా ఉంటుంది?
ఎస్సీ కార్పొరేషన్ పైలట్ ప్రాజెక్టు కింద ఈ-కామర్స్, లాజిస్టిక్, పశుసంపద, సోలార్ రంగాల్లో ఉపాధి కల్పనకు శ్రీకారం చుట్టింది. మొత్తం 5, 016 మంది యువతకు టూ వీలర్ ఈవీలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం ఇప్పటికే 29, 798 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో వాహనం విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుంది. రవాణా, ప్రజారవాణా అవసరాల కోసం 2,500 త్రీ వీలర్ ఈవీ యూనిట్లను మంజూరు చేయనుంది. ఒక్కో యూనిట్ ధర 3 లక్షల వరకు ఉంటుంది. దీని కోసం రికార్డు స్థాయిలో35, 725 దరఖాస్తులు అందాయి. దరఖాస్తుల స్వీకరణ ముగియడంతో వచ్చే వారం నుంచి జిల్లా స్థాయిలో అర్హులైన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభకానుంది. ఈ నెలాఖరులోగా వాహన సరఫరా సంస్థలను కూడా ఖరారు చేస్తారు.
సాగునీటి వసతికి సోలార్ బాట
ఎస్సీలకు కేటాయించిన భూములు విద్యుత్ సౌకర్యం లేక బీడుగా మారుతున్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం, ఇందిర గిరిజల వికాసం తరహాలో సరికొత్త పథకాన్ని తెచ్చింది. సుమారు ఐదు వందల మందికి సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను అందించనున్నారు. వీటి యూనిట్ వ్యయం రూ. 3 లక్షల నుంచి 7 లక్షల వరకు ఉంటుంది. దీని వల్ల బోరుబావులకు విద్యుుత్ సౌకర్యం కల్పించి, సాగునీటి వసతి కల్పించడం సులభతరమవుతుంది.
భారీ సబ్సిడీ ఇస్తున్న ప్రభుత్వం
యువతపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు ప్రభుత్వం 60 శాతం నుంచి 90 శాతం వరకు సబ్సిడీని అందిస్తోంది. లక్ష లోపు యూనిట్ 90 శాతం సబ్సిడీ వస్తోంది. లక్ష నుంచి రెండు లక్షల యూనిట్‌లకు 80 శాతం సబ్సిడీ ఇస్తారు. రెండు నుంచి నాలుగు లక్ష ఉన్న యూనిట్లు 70 శాతం సబ్సిడీ ఇస్తున్నారు. నాలుగు లక్షలపైగా కలిగిన యూనిట్లకు 60 శాతం సబ్సిడీ ఇస్తారు.
గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ
గిరిజన సంక్షేమ శాఖ ట్రైకార్ ఆధ్వర్యంలో మే 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు ప్రారంభంకానున్నాయి. ఐటీడీఏ పరిధిలో, మైదానం ప్రాంతాల్లోని పదివేల ఐదు వందల మంది గిరిజన యువతకు శిక్షణ ఇవ్వనున్నారు. దీని కోసం ప్రభుత్వం 40 కోట్ల కేటాయించింది. కేంద్రంలోని ప్రధాన మంత్రి కౌశల వికాస్ యోజన తరహాలో ఈ శిక్షణ కొనసాగుతుంది. భద్రాచలం, ఏటూరునాగారం, ఉట్నూరు ఐటీడీఏల పరిధిలో ఒక్కొక్క చోట 2,700 మందికి, ఇతర మైదాన ప్రాంతాల్లో 2,400 మందికి ఈ శిక్షణ లభించనుంది.
కేవలం నగదు బదిలీకే పరిమితం కాకుండా, యువతను పారిశ్రామికవేత్తలుగా మార్చే దిశగా ఈ ప్రాజెక్టులు రూపొందాయి. పెరుగుతున్న పెట్రోల్ ధరల వేళ ఈవీల వినియోగం ఆర్థికంగా లాభసాటి కావడమే కాకుండా, పర్యావరణహితంగా కూడా ఉంటుంది. మే నెల నుంచి ఈ పథకాలు పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే, వేలాది మంది ఎస్సీ, ఎస్టీ కుటుంబాల్లో వెలుగులు నింపుతాయని ప్రభుత్వం భావిస్తుంది.
ట్రెండింగ్ వార్తలు





















