Tamilisai About Bonalu: హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు ఉన్నాయి. ఇదివరకే రాష్ట్ర నూతన సచివాలయం ప్రారంభానికి, సమ్మక్క సారక్క జాతర సహా పలు వేడుకలకు గవర్నర్ తమిళిసైని రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించలేదని తెలిసిందే. తాజాగా జరుగుతున్న బోనాల పండుగకు కూడా తనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆహ్వానం అందలేదని గవర్నర్ తమిళిసై తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగ అయిన బోనాలను ఘనంగా నిర్వహిస్తోంది. కానీ పాతబస్తీలోని లాల్‌దర్వాజా బోనాలకు సైతం తనకు ఆహ్వానం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో రాజ్‌భవన్‌లో నల్లపోచమ్మ అమ్మవారి ఆలయంలో బోనాల వేడుకలు నిర్వహించినట్లు చెప్పారు. నల్లపోచమ్మ అమ్మవారికి తమిళిసై బోనం సమర్పించి వడి బియ్యం పోశారు. బోనం సమర్పించడంలో మహిళా సిబ్బంది ఆమెకు సహకరించారు.
రాజ్ భవన్ లో బోనాలు నిర్వహించిన సందర్భంగా తమిళి సై మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని గవర్నర్ తమిళిసై ఆకాంక్షించారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా ప్రజలు వేడుక జరుపుకుటున్నారని అన్నారు. అమ్మవారు రాష్ట్ర ప్రజలని చల్లగా చూడాలని కోరుకున్నట్లు గవర్నర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తనను బోనాలకు ఆహ్వానించకున్నా ఏ సమస్య లేదని, రాజ్ భవన్ కుటుంబసభ్యులతో వేడుక జరుపుకున్నానని చెప్పారు. భారతదేశ ప్రతిష్ట అయిన చంద్రయాన్-3ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో (ISRO) శాస్త్రవేత్తలకు ఆమె అభినందనలు తెలిపారు.
రాజ్ భవన్ లో ఏ బిల్లులు పెండింగ్ లేవు!
తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర గవర్నర్ తమిళిసై మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు కొనసాగుతున్నాయని తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ సర్కార్‌పై గవర్నర్ తమిళిసై అసెంబ్లీ ఆమోదించిన పెండింగ్ బిల్లులను జూలై 15లోగా క్లియర్ చేస్తామని ప్రకటించారని సోమవారం ప్రచారం జరిగింది. మున్సిపల్, ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లులు గత కొంత కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని వీటికి గవర్నర్ ఆమోద ముద్ర వేస్తారని.. ప్రభుత్వం, గవర్నర్ మధ్య విభేదాలు తొలగిపోయాయని కనిపించింది. ఈ వార్తలపై రాజ్ భవన్ ఘాటుగా స్పందించింది.
ఆహ్వానాలు అందడం లేదన్న గవర్నర్ తమిళిసై!
తెలంగాణలో సైతం గవర్నర్ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం అన్నట్లుగా పరిస్థితి నెలకొంది. రాష్ట్ర నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి గవర్నర్ తమిళిసైని ప్రభుత్వం ఆహ్వానించలేదు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు సైతం పిలుపు రాలేదని గవర్నర్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండా ఓ సెషన్ జరిపించింది తెలంగాణ ప్రభుత్వం. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ కొత్త పార్లమెంట్‌ను ప్రారంభించారు. ఆ సమయంలోనూ గవర్నర్ తమిళిసై ఘాటుగా స్పందించారు. ప్రధాని చేతుల మీదుగా కాకుండా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నూతన పార్లమెంట్ ప్రారంభిస్తే బావుండేదని బీఆర్ఎస్ సహా పలు ప్రతిపక్ష పార్టీలు గగ్గోలుపెట్టాయి. ఈ విషయంపై తమిళిసై మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వానికి చురకలు అంటించారు. రాష్ట్రపతిల మాదిరిగానే గవర్నర్లు కూడా రాజకీయేతర వ్యక్తులే కదా అంటూ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమైన వేడుకలు, ప్రారంభోత్సవాలకు తనను ఆహ్వానించకపోవడంపై ఇలా వ్యాఖ్యానించారు. సచివాలయ ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించలేదని గుర్తు చేశారు. తనకు కనీసం ఆహ్వాన పత్రిక కూడా ఇవ్వలేదని తమిళిసై ప్రస్తావించడం తెలిసిందే.