CM Revanth Reddy: హార్వర్డ్ వర్సిటీ నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అరుదైన ఆహ్వానం
హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ తొలిసారిగా నిర్వహిస్తున్న ఏఐ పాలసీ సింపోజియంలో ప్రసంగించాలని భారత్ నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక్కరికి ఆహ్వానం లభించింది.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అమెరికాలోని హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ అరుదైన ఆహ్వానం అందింది. హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ తొలిసారిగా నిర్వహిస్తున్న ఏఐ పాలసీ సింపోజియంలో ప్రసంగించాలని నిర్వాహకులు రేవంత్ రెడ్డికి ఆహ్వాన లేఖను పంపించారు. ఈ ఏడాది మార్చి 27న హార్వర్డ్ స్కూల్ క్యాంపస్‌లోనే ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. భారత్ నుంచి తెలంగాణ సీఎం రేవంత్ ఒక్కరే ఈ సింపోజియం ఆహ్వానం అందుకోవటం విశేషం.
ఈ సింపోజియంలో “AI as Infrastructure & Compute Power: Impact on Livability & Workforce” అనే ప్యానెల్‌లో ప్రసంగించాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ సెషన్‌లో డేటా సెంటర్లు (Data Centers), ఎనర్జీ సిస్టమ్స్, కంప్యూట్ కారిడార్స్ ప్రభావంపై ప్రధానంగా చర్చ జరగనుంది.

ఏఐ ఎకోసిస్టమ్ అభివృద్ధి, ఏఐ సిటీ అభివృద్ధి లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఎర్త్, విద్యుత్, నైపుణ్యాలు, నియంత్రణతో పాటు పెట్టుబడుల భాగస్వామ్యం వంటి అంశాలపై ప్రసంగించాలని సీఎం రేవంత్ రెడ్డిని హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ ప్రత్యేకంగా ఆహ్వానించింది.
ఇటీవల అమెరికా పర్యటనలో నిర్వాహకులు సీఎం రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా కలిసి సింపోజియంపై చర్చించారు. ప్రభుత్వం, ఇండస్ట్రీస్, అకాడమిక్ రంగాల ప్రముఖులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, ఏఐ పాలన, జియోపాలిటిక్స్, నాలెడ్జ్ ఎకానమీ, ఎనేబ్లింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంశాలపై చర్చించేందుకు ఈ సింపోజియం నిర్వహిస్తున్నట్లు హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ ప్రతినిధులు వివరించారు.
ఇటీవల అమెరికాలో పర్యటించిన రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల అమెరికా పర్యటనలో భాగంగా హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ సందర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వారం రోజుల లీడర్ షిప్ కోర్సు పూర్తి చేశారు. అక్కడ నిర్వహించిన ఒక ప్రత్యేక సెషన్‌లో పాల్గొన్న ఆయన, ప్రజా క్షేత్రంలో ఎదురయ్యే సవాళ్లు, క్షేత్రస్థాయి రాజకీయాలు, నిర్ణయాధికారంలో ఉండాల్సిన చొరవ వంటి అంశాలపై చర్చించారు. ముఖ్యంగా సంక్లిష్ట పరిస్థితుల్లో ఒక నాయకుడు అనుసరించాల్సిన వ్యూహాలు, పాలనలో టెక్నాలజీని జోడించడం వంటి అంశాలపై హార్వర్డ్ ప్రతినిధులతో తన అనుభవాలను రేవంత్ రెడ్డి పంచుకున్నారు.
ఈ పర్యటన కేవలం విద్యాసంబంధిత చర్చలకే పరిమితం కాకుండా, తెలంగాణను గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా మార్చే దిశగా సాగింది. న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో వంటి నగరాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రపంచ దిగ్గజ సంస్థలైన గూగుల్, అమెజాన్, పెప్సికో, ఇతర టెక్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, హైదరాబాద్ సమీపంలో నిర్మించబోయే ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ ప్రాజెక్టుల కోసం అంతర్జాతీయ సహకారాన్ని కోరారు.
























