Telangana CM KCR Review on JPS Regularization : తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చాక భూముల సర్వే, రెవెన్యూ శాఖ ప్రక్షాళనలో భాగంగా సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో ఒకటి ధరణి పోర్టల్ తీసుకురావడం, మరో అంశం ఏంటంటే.. వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేశారు. తమ ఉద్యోగాలు ఏమవుతాయోనని ఉద్యోగులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ వారికి గుడ్ న్యూస్ చెప్పారు. నీటి పారుదల, ఇతర శాఖల్లో వీఆర్ఏలను సర్దుబాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు.
వీఆర్ఏల సర్దుబాటు, క్రమబద్ధీకరణపై సీఎం కేసీఆర్ మంగళవారం నాడు ప్రగతిభవన్‌లో అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యార్హతలు, సామర్థ్యాల మేరకు వీఆర్ఏ లను నీటి పారుదల, ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. పలు శాఖల అధికారులు వీఆర్ఏలతో చర్చించి అభిప్రాయాలు సేకరించాలని సీఎం కేసీఆర్ సూచించారు. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఉపసంఘంలో మంత్రులు జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్ సభ్యులుగా ఉంటారు. ఈ మంత్రుల ఉపసంఘం బుధవారం (జులై 12) నుంచే వీఆర్ఏలతో చర్చలు జరపనుంది
ఉప సంఘం సూచనల ప్రకారం అధికారులు వీఆర్ఏలతో చర్చలు జరిపి వారి అభిప్రాయాలు సేకరించనున్నారు. ఆయా శాఖల్లో వీఆర్ఏల సేవలు ఉపయోగించుకోవాలని సీఎస్ శాంతికుమారిని సీఎస్ కేసీఆర్ ఆదేశించారు. మంత్రివర్గ ఉపసంఘం తుది నివేదిక సమర్పించిన తరువాత మరోసారి సమీక్షించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. వారం రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తి కావాలని అధికారులకు, ఉపసంఘాన్ని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సచివాలయంలో గుడి, మసీదు, చర్చిల నిర్మాణాలు పూర్తయ్యా. త్వరలోనే ఈ ప్రార్థనా స్థలాల ప్రారంభ తేదీలపై కూడా అధికారులతో కేసీఆర్చర్చించినట్లు తెలుస్తోంది.
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్దీకరణపై చర్చలు..
జూనియర్ పంచాయతీ కార్యదర్శులు (జేపీఎస్)లు తమను పర్మినెంట్ చేయాలని గతంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనిపై జేపీఎస్ లు సైతం కొన్ని నెలల కిందట 16 రోజుల పాటు సమ్మె చేపట్టారు. జేపీఎస్‌ల సమ్మెతో దిగివచ్చిన కేసీఆర్ ప్రభుత్వం వారిని రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించింది. ఇందుకు సంబంధించి విధివిధానాలు రూపొందించాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శిని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
జేపీఎస్‌ల పని తీరుపై జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్‌తో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్, ఎస్పీ లేదా డీసీపీలు కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు. రాష్ట్ర స్థాయిలో కార్యదర్శి, లేదా శాఖాధిపతి స్థాయి అధికారి జిల్లా కమిటీకి పరిశీలకుడిగా వ్యవహరిస్తారు. జేపీఎస్‌ల పని తీరుపై జిల్లా కమిటీ పంపిన ప్రతిపాదనల్ని రాష్ట్ర స్థాయి కమిటీ పరిశీలిస్తుంది. రాష్ట్ర కమిటీ సీఎస్ శాంతికుమారికి నివేదిస్తారు. అన్ని పూర్తయ్యాక జేపీఎస్ ల రెగ్యులరైజేషన్ పై రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనుంది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial