KTR sensational comments on Revanth Reddy: సెటిల్మెంట్‌లకు కేంద్రంగా ముఖ్యమంత్రి ఇల్లు - రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
KTR sensational comments on Revanth Reddy: తెలంగాణలో అక్రమాలు రాజ్యామేలుతున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. సీఎం నివాసంలోనే సెటిల్మెంట్‌లు జరుగుతున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు.

KTR sensational comments on Revanth Reddy: కాంగ్రెస్ పార్టీ పాలన అవినీతి కంపు రాష్ట్రవ్యాప్తంగా కొడుతుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ ముఖ్యమంత్రి నివాసం కేంద్రంగాని దందాలు సాగుతున్నాయని మండిపడ్డారు. "తెలంగాణను మేము అగ్రికల్చర్‌లో అగ్రస్థానంలో నిలిపాము. కాంగ్రెస్ పార్టీ మాత్రం రాష్ట్రంలో గన్ కల్చర్ తీసుకువచ్చింది. రాజకీయ జీవితంలో ఇంతటి బలహీన ముఖ్యమంత్రిని చూడలేదు. ఒక మంత్రి ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులను ముఖ్యమంత్రి పంపడం, నిందితుని స్వయంగా మంత్రి తన కారులో తీసుకొని మాయమైపోవడం ఎప్పుడూ చూడలేదు. స్వయంగా ముఖ్యమంత్రి అనుచరుడు, ఆప్తుడు రోహిన్ రెడ్డి ఇదంతా చేశారని మంత్రి కుమార్తె ఆరోపించారు. సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి మౌనంగా ఉన్నరు. రేవంత్ రెడ్డికి సిగ్గు ఉంటే కనీసం ఈ అంశంపై స్పందించాలి. అని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.
రేవంత్ రెడ్డి లాంటి బలహీన ముఖ్యమంత్రిని ప్రపంచంలో ఎప్పుడూ చూడలేదని కేటీఆర్ అన్నారు. స్వయంగా ఆరోపణలు చేసిన మంత్రిని ఎందుకు తప్పించలేదని ప్రశ్నించలేదు. మంత్రులను ముట్టుకోలేని బలహీన ముఖ్యమంత్రివి కాదా అని నిలదీశారు. పాలనపై పట్టు నిరూపించుకోవాలని సవాల్ చేశారు. తన పరిపాలనపైన మంత్రులపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పట్టు లేదని తేలిపోయిందన్నారు. "దావూద్ ఇబ్రహీం లాంటి ముఖ్యమంత్రిని తరిమేసుకుంటేనే తెలంగాణ పట్టిన శని పోతుంది. కాంగ్రెస్ అవినీతికి ప్రభుత్వ అధికారులు కూడా భయపడుతున్నారు. వీరి వాటాల పంచాయతీలో మాకు భాగస్వామ్యం వద్దు, మాకు సంబంధం లేదు అంటూ అధికారులు పారిపోతున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను తప్పుడు పనులు చేయమని వేధించడం వల్లనే వారు వీఆర్‌ఎస్ తీసుకుంటున్నారు." అని అన్నారు.
కాంగ్రెస్ దండుపాళ్యం ముఠాకు భయపడి మంచి అధికారులు కూడా పారిపోయేలా చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రులు దండుపాళ్యం ముఠా రాష్ట్రాన్ని నడిపిస్తోందని అన్నారు. తను చెప్పిన పని చేయలేదని చెప్పి… రిజ్వీ విఆర్‌ఎస్ తీసుకుంటే కూడా, ఆయన రాజీనామా ఆమోదించవద్దని జూపల్లి కృష్ణారావు కోరారు అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలకు, అక్రమాలకు గనుక భాగస్వాములైతే, గతంలో అధికారులు వత్తాసు పలికితే గతంలో మాదిరి జైలుకు వెళ్లవలసి వస్తుందని గుర్తు చేశారు. గతంలో మాదిరి అధికారులకు శిక్ష కూడా పడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. మంత్రుల అవినీతి వాటాల పంచాయతీలకు దూరంగా ఉండాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు.
"రాష్ట్రంలో అవినీతి విలయతాండవం చేస్తోంది. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర సచివాలయం దాకా రాష్ట్రంలోని అన్ని శాఖల్లో కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి వేల కోట్లు సంపాదిస్తుంటే, మేము వందల కోట్లయినా సంపాదించవద్దని మంత్రులు పోటీ పడుతున్నారు. గన్నులు పెట్టి బెదిరించడంతో ఇందిరమ్మ రాజ్యంలో వ్యాపారవేత్తలు తమ వ్యాపారాలు చేసుకోలేకపోతున్నారు. తెలంగాణలో నడుస్తున్నది ఒక మాఫియా రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం కాదు. స్వయంగా మంత్రి కూతురు చెప్పింది. రాష్ట్రంలో గనకల్చర్ నడుస్తోంది. పారిశ్రామికవేత్త నెత్తిన గన్ను పెట్టి బెదిరించారు. పోలీసులు వెతుకుతున్న నిందితుడిని అరెస్టు చేయొద్దు అంటూ మంత్రి కుమార్తె ఆపితే... స్వయంగా మంత్రి తన కారులో తీసుకొని వెళ్ళిపోయినా ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు లేవు. రెండు మూడు రోజులపాటు తిట్టుకొని సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి, మంత్రి ఇద్దరు కలిసి శాలువాలు కప్పుకుని స్వీట్లు పంచుకున్నారు. ఏం ఉద్దరించారని ముఖ్యమంత్రికి శాలువా కప్పి పిసిసి ప్రెసిడెంట్ సన్మానం చేశారు. ఇద్దరు మంత్రులు కలిసి ఏం పొడిచారని పిసిసి ప్రెసిడెంట్ స్వీట్లు పంచారు."
ఇద్దరి మధ్యలో ఏం సెటిల్మెంట్ జరిగిందని ఈ కలరింగ్ ఇచ్చారని ప్రశ్నించారు కేటీఆర్. వాటాల పంచాయితీ అవినీతి సొమ్ముల పంపకాలు టెండర్ల రిగ్గింగ్ ఇవన్నీ కూడా కాంగ్రెస్ ఇంటి పంచాయతీ లెక్క మారిపోయాయన్నారు. ముఖ్యమంత్రి ఇల్లు సెటిల్మెంట్‌లకు కేంద్రంగా మారిపోయిందన్నారు. రాష్ట్రంలో మాఫియా రాజ్యమేలుతుంటే, మంత్రులు, ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఇంత అరాచకం కొనసాగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. పరిశ్రమల యజమానులకు తుపాకీలు పెట్టినప్పుడు, వాటాల పంచాయితీలతోనే మంత్రులు బజారుకెక్కినప్పుడు, సీనియర్ అధికారులు పారిపోతుంటే రాష్ట్రంలోని పోలీసు యంత్రాంగం ఏం చేస్తుందని నిలదీశారు.
"తుపాకీ ఇచ్చింది రేవంత్ రెడ్డి, తెచ్చింది రోహిన్ రెడ్డి, అక్కడ ఉన్నాడు అని స్వయంగా మంత్రి కుమార్తె చెప్పింది. కానీ పోలీసులు చెప్తుంది గన్ ఇచ్చింది కొండా మురళి, బెదిరించింది కొండా సురేఖ OSD సుమంత్ అని చెప్తున్నారు. రెండు అంశాల్లో కూడా బెదిరింపులు గన్నుతో జరిగాయనేది వాస్తవం. కానీ ఇప్పటివరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ మొత్తం వ్యవహారంలో రాష్ట్ర డిజిపి ఎందుకు మౌనంగా ఉన్నారు. నాకు పింక్ బుక్కులు లేవు, రెడ్ బుక్కులు లేవు, కేవలం ఖాకీ బుక్ మాత్రమే రాష్ట్రంలో ఉంటుందని గొప్పలకు పోయిన రాష్ట్ర డిజిపి ఏం చేస్తున్నారు. మా కార్యకర్తలను జైల్లో పెట్టిన పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రయోజనం చేకూర్చేలా పనిచేస్తున్నారు. రాష్ట్రంలోని కొంతమంది పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల కన్నా దారుణంగా పనిచేస్తున్నారు. నిజంగా డిజిపికి నిజాయితీగల పేరు ఉంటేనే గనుల బెదిరింపు వ్యవహారంలో చర్యలు తీసుకుని తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. పోలీస్ యంత్రాంగానికి చిత్తశుద్ధి ఉంటే, గన్ తెచ్చింది ఎవరు, గన్ను గురిపెట్టింది ఎవరు అనే విషయాన్ని తేల్చాలి."
ఈ అంశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని విచారణ చేసి ఆయన అభిప్రాయాన్ని రికార్డు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సుమంత్‌ను విచారించి నిజానిజాలు బయటపెట్టాలన్నారు. ఈ మొత్తం గన్నుతో గురిపెట్టిన ఘటనలో కచ్చితంగా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. "ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేశాను అనే మంత్రి కూతురు చెప్పినప్పుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిలిచి పోలీసులు విచారించరా? ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలోని దక్కన్ సిమెంట్ కంపెనీ యజమాని పైన గన్ను గురి పెట్టినప్పుడు కనీసం ఉత్తమ్ కుమార్ రెడ్డిని, రోహిన్ రెడ్డిని, సుమంత్‌ను ఎవర్ని కూడా పోలీసులు విచారించలేదు. పోలీస్ శాఖలో 99 శాతం మంది బాగానే ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు. కానీ ఒక్క శాతం మంది మాత్రం కాంగ్రెస్ కార్యకర్తల్లా పనిచేస్తున్నారు. వారినే మేము ఈరోజు నిందిస్తున్నాము. మంచిరేవులలో భూముల కోసం గన్ను పెట్టి బెదిరిస్తున్నారని మంత్రి కూతురు స్వయంగా చెప్పినప్పుడు ఏం చేస్తున్నారు? మంత్రులు ఎక్కడ సంతకం పెట్టారో సొంత కుటుంబ సభ్యులకు కూడా తెలవకూడదు అన్న నియమాలు ఉన్నాయి. ఇవన్నీ మంత్రి బిడ్డకు తెలపడం, జపాన్‌లో ఉన్న ముఖ్యమంత్రి ఫైలు వెనక్కి తెప్పించుకోవడం ఇదంతా ఆరాచకంగా మారింది. ముఖ్యమంత్రి సోదరుడు 15 ఎకరాలు... కొండా సురేఖ 15 ఎకరాలు తీసుకొని మొత్తం 30 ఎకరాల భూమి పంచాయితీ పెట్టుకున్నారు.నాకు కావాలంటే, నాకు కావాలి అని మంత్రి, రేవంత్ రెడ్డి, కొండా సురేఖ కోట్లాడుతున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా మొత్తం బయటపెట్టుకొని తిరిగి రాష్ట్రానికి ఏం సందేశం ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ? మంత్రులు కాంట్రాక్టులు, కమిషన్ల వ్యవహారాన్ని ఇంటి పంచాయతీగా మార్చారు. పొంగులేటి నా టెండర్లలో తలదూర్చారని మంత్రి కూతురు స్వయంగా చెప్పారు. బెదిరింపులు, టెండర్ల రిగ్గింగు ఇంత బహిరంగంగా దేశ చరిత్రలో ఏనాడు జరగలేదు."
ఇంత దారుణంగా బహిరంగంగా అవినీతి అంశంపైకి వచ్చిన, బెదిరింపులు బయటపడిన బిజెపి నేతలు ఎందుకు స్పందించడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. "తెలంగాణ రాష్ట్రంలో బిజెపి - కాంగ్రెస్ జాయింట్ వెంచర్ పరిపాలన నడుస్తున్నది. బిజెపి ఎంపీలు, కేంద్ర మంత్రులు, అమిత్ షా వంటి వాళ్ళు ఎవరు కూడా మాట్లాడడం లేదు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు కూడా మౌనంగా ఉన్నాయి. అందుకే తెలంగాణ రాష్ట్రాన్ని బిజెపి ఏమాత్రం కాపాడలేదు అని మేము చెప్తున్నాము. కాంగ్రెస్ పరిపాలనలో పరిపాలన లేదు, ప్రజా పాలన లేదు. కేవలం అరాచకాలు, అవినీతి, బెదిరింపులు, కమిషన్లు, టెండర్ల రిగ్గింగ్ అన్నీ నడుస్తున్నాయి. వంద రోజులలో అన్నీ చేస్తాం అని చెప్పి మమ్మల్ని మోసం చేసిర్రు అని కాంగ్రెస్‌ను ప్రజలు తిడుతున్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి, అరాచక పాలనను చూసి అసహ్యించుకుంటున్నారు. చాలా అనుభవజ్ఞుడైన ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నిజాన్ని చెప్పారు.
ఇంత అరాచకం అవినీతితో కూడిన పరిపాలన ఆయన చూసి ఉండరు. కాబట్టి తెలంగాణలో మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కల్ల అనే మాట చెప్పారు . ఆయనకి తెలంగాణ ప్రజల అభిప్రాయాన్ని ఆకాంక్షలను వ్యక్తపరిచినందుకు మా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము.





















