తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలిరోజు సభలు వాయిదా పడ్డ అనంతరం బీఏసీ (Business Advisory Committee) సమావేశం జరిగింది. శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అధ్యక్షతన ఈ బీఏసీ సమావేశం జరగ్గా.. అధికార పార్టీ నుంచి డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు, కొంత మంది మంత్రులు హాజరయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మజ్లిస్‌ తరఫున ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ పాల్గొన్నారు. బీజేపీ నుంచి ఎవరిని ఆహ్వానించలేదు.


అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, ఎన్నిరోజులు నిర్వహించాలి అనే అంశంపై వివిధ పార్టీలు తమ అభిప్రాయాలను వెల్లడించాయి. అయితే, మూడు రోజుల పాటే నిర్వహిస్తామని ఈ భేటీలో ప్రభుత్వం వెల్లడించింది. అయితే, కాంగ్రెస్ ఇందుకు ఒప్పుకోలేదు. 20 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్‌ కోరింది. ఈ సమావేశాల్లో సుమారు 10 బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం.


బీజేపీని పిలవకపోవడంపై ఈటల అసహనం
అసెంబ్లీలో జరిగిన బీఏసీ సమావేశానికి బీజేపీని ఆహ్వానించకపోవటం ఏంటని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన గతంలో ఒక సభ్యుడు ఉన్న లోక్ సత్తా పార్టీని కూడా బీఏసీకి పిలిచేవారని గుర్తు చేశారు. సమైక్య పాలకులకు ఉన్న సోయి.. తెలంగాణ ప్రభుత్వానికి లేదని అన్నారు. ప్రస్తుతం బీజేపీలో ముగ్గురు సభ్యులు ఉన్నారని అన్నారు. 


మూడు రోజులే జరపడం సిగ్గుచేటు - ఈటల
మూడు రోజులు మాత్రమే అసెంబ్లీని జరపడం సిగ్గుచేటని ఈటల రాజేందర్ అన్నారు. ఆరు నెలలకు ఒకసారి సభ జరగాలి కాబట్టి నామమాత్రంగా పెడుతున్నారని, అసలు ప్రభుత్వానికి ప్రజా సమస్యలు చర్చించాలన్న సోయి లేదని ఈటల అన్నారు.


అసెంబ్లీ ముట్టడికి యత్నం
అసెంబ్లీ ముట్టడికి యూత్ కాంగ్రెస్ నేతలు యత్నించారు. యూత్ కాంగ్రెస్ నేతల్ని అసెంబ్లీ ఎదుట పోలీసులు అడ్డుకున్నారు. హామీల ప్రకారం.. నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్వాలని.. ఉద్యోగాల భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి యూత్ కాంగ్రెస్ నేతలు పిలుపు ఇచ్చారు. అసెంబ్లీ వైపు దూసుకొస్తున్న యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డితో, నగర అధ్యక్షుడు మోటా రోహిత్  పాటు ఇతర నేతలను పోలీసులు అడ్డుకున్నారు.