ED Notice to Talasani Sai Kiran Yadav: చికోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తును ముమ్మరం చేసింది. నేపాల్ లో బిగ్ డాడీ పేరుతో నిర్వహించిన క్యాసినోకు వెళ్లారని భావించి ఒక్కొక్కరికి వరుసగా నోటీసులు ఇస్తూ విచారణ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయికిరణ్ యాదవ్ కు ఈడీ నోటీసులు జారీ చేసిందని సోమవారం ప్రచారం జరిగింది. ఈడీ నోటీసుల వ్యవహారంపై తలసాని సాయి కిరణ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈడీ నోటీసులు ఇచ్చారని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. 


ఈడీ నోటీసులు అని చూసి షాకయ్యాను !
తనకు ఈడీ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని సాయి కిరణ్ (Talasani Sai Kiran Yadav ) స్పష్టం చేశారు.  తనకుఈడీ నోటీసులని వార్తలు చూసి షాకయ్యానని ట్వీట్ చేశారు. తాను ఇప్పుడే ఎదుగుతున్న యువ నాయకుడ్ని అని, ఇలాంటి వార్తలను పూర్తిగా ఖండించారు. ఇలాంటి వార్తలు రాసే ముందు మీడియా సంస్థలు నిజానిజాలు తెలుసుకుని వార్తలు రాయాలని కోరారు. యువనేతగా ప్రజలకు సేవ చేయాలని భావిస్తున్నానని, తనపై ఇలాంటి ప్రచారం చేయవద్దని, ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు సాయి కిరణ్. క్యాసినో కేసులో సాయి కిరణ్ బాబాయ్ లకు ఈడీ నోటీసులిచ్చి విచారణ కొనసాగిస్తోంది. నేడు సైతం మంత్రి తలసాని సోదరులు విచారణకు హాజరై ఈడీ అధికారుల ప్రశ్నలకు సమాధానం చెబుతున్నారు.






క్యాసినో కేసులో ఈడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పీఏ హరీశ్​తో పాటు డీసీసీబీ ఛైర్మన్ దేవేందర్ రెడ్డి, వ్యాపారవేత్త బుచ్చిరెడ్డి ఈడీ ఎదుట సోమవారం హాజరయ్యారు. ఇదే కేసుతో సంబంధం ఉందన్న ఆరోపణలతో మరికొందరు వ్యాపారులు, ప్రముఖులకు నోటీసులు ఇచ్చి ఈడీ విచారణ కొనసాగిస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్​రమణ, మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌ రెడ్డి సైతం క్యాసినో కేసులో ఈడీ విచారణకు హాజరయ్యారు. విచారణ జరుగుతుండగానే రమణ అస్వస్థతకు గురికావడంతో ఈడీ ఆఫీసు నుంచి ఆసుపత్రికి వెళ్లడం తెలిసిందే. మంత్రి తలసాని సోదరులు తలసాని మహేశ్, ధర్మేంద్ర యాదవ్ విచారణకు హాజరై ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.