TS RTC News: మర్యాదగా మాట్లాడండి! బస్ కండక్టర్లకు ఆర్టీసీ ఎండీ సజ్జనర్ సూచన

ప్రయాణికులతో మర్యాదగా మెలగాలని ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లకు హితబోధ చేశారు టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్. సంస్థకు వాళ్లే బ్రాండ్‌ అంబాసిడర్లు అని అభిప్రాయపడ్డారు.

Continues below advertisement

ఇప్పుడంటే ఏమోగానీ, ఒకప్పుడైతే ఒంటిమీద ఖాకీచొక్కా వేసుకున్న బస్ కండక్టర్ కండాక్డర్‌ సరిగా ఉండేది కాదని జనం బాహాటంగానే విమర్శించేవారు. ఇది మొదట్నుంచీ ఆర్టీసీకి మహాచెడ్డ పేరులా ఉండిపోయింది. రూడ్‌గా మాట్లాడుతారని, ప్రయాణికుల పట్ల సభ్యతగా ఉండరని ఆరోపణలు ఉండేవి. అప్పట్లో ఆర్టీసీ మర్యాద వారోత్సవాల పేరుతో ప్రత్యేకంగా ఓ ప్రోగ్రాం కండక్ట్ చేశారు. అవి ఎంతవరకు సత్ఫలితాలనిచ్చాయో తెలియదు కానీ, ఎవరో ఒకరిద్దరు చేసిన తప్పులకు సంస్థ ఒక పెద్ద అపవాదుని మోయాల్సి వచ్చింది. అలాంటి చెడ్డపేరును తుడిచేయాలనే ఉద్దేశంతోనే ఎండీ సజ్జనార్ మరోసారి మర్యాద అనే కాన్సెప్టుని తెరమీదికి తీసుకొచ్చారు. 

Continues below advertisement

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న డిపోల్లో కండక్టర్లకు TS RTC ఏప్రిల్‌ ఛాలెంజ్‌ ఫర్‌ ట్రైనింగ్‌(టాక్ట్‌) శుక్రవారం ప్రారంభమైంది. హైదరాబాద్‌ బస్‌ భవన్‌ నుంచి వర్చ్‌వల్‌గా ఈ శిక్షణ జరుగుతున్న తీరును సంస్థ ఎండీ వీసీ సజ్జనర్‌ పరిశీలించారు. శిక్షణలో పాల్గొన్న కండక్టర్లతో ముచ్చటించారు. శిక్షణ జరుగుతున్న తీరు, చెబుతున్న విషయాల ఉపయోగం, తదితర అంశాలపై వారిని అడిగి తెలుసుకున్నారు.

బస్సు ఎక్కగానే నవ్వుతూ నమస్తే చెప్పండి!- సజ్జనర్

''మనం ప్రయాణికుల కేంద్రంగానే పని చేయాలి. ప్రయాణికులతో ఎట్టి పరిస్థితుల్లోనూ దురుసుగా ప్రవర్తించొద్దు. బస్సులోకి రాగానే వారిని నమస్తే అంటూ చిరునవ్వుతో పలకరించాలి. కొత్త ప్రయాణికులను మన సంస్థ వైపు మెగ్గుచూపేలా వ్యవహారించాలి. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ రవాణా సదుపాయాలు చాలా ఉన్నాయనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని విధులు నిర్వహించాలి. విధి నిర్వహణలో స్వీయ క్రమశిక్షణను కలిగి ఉండాలి." అని కండక్టర్లకు సంస్థ ఎండీ సజ్జనర్‌ హితవు పలికారు. గత ఏడాదిన్నర కాలంలో సంస్థలో ఎన్నో మార్పులు వచ్చాయని గుర్తుచేశారు. ఇంకా చేయాల్సింది చాలా ఉందని, అందుకే టాక్ట్‌ పేరుతో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తున్నామన్నారు సజ్జనర్

ప్రయాణికులే సంస్థకు ఆధారమనే విషయం మరిచిపోవద్దు- సజ్జనర్

''రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను ప్రజలు బాగా ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం ఆక్యూపెన్సీ రేషియో (ఓఆర్‌) 69గా ఉంది. దానిని 75కి పెంచాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే సంస్థలో ప్రతి ఒక్క సిబ్బందికి టాక్ట్‌ పేరుతో శిక్షణ ఇస్తున్నాం. ఆ లక్ష్యానికి అనుగుణంగా అందరూ పనిచేయాలి." అని సజ్జనర్‌ స్పష్టం చేశారు. ఈ శిక్షణ స్పూర్తితో రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి.. సంస్థ లాభాల బాటలో పయనించేలా పాటుపడాలన్నారు. ఇటీవల రంగారెడ్డి, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ రీజియన్లలోని దాదాపు 6 వేల మంది డ్రైవర్లకు టాక్ట్‌ శిక్షణను ఇచ్చామని తెలిపారు. రాబోయే మూడు నెలల్లో సంస్థలోని సిబ్బంది అందరికీ శిక్షణ ఇస్తామని సజ్జనర్ పేర్కొన్నారు. టాక్ట్‌ పేరుతో త‌మ‌కు అందిస్తోన్న ఈ శిక్షణ ఎంతో ఉపయుక్తంగా ఉంద‌ని కండక్టర్లు సంస్థ ఎండీ సజ్జనర్‌కు చెప్పారు. తమలో ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీసుకురావడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుందని వివరించారు. ప్రయాణికుల మీదనే సంస్థ ఆధారపడి ఉందనే విషయాన్ని తాము మరిచిపోమన్నారు. ఓఆర్‌ను 75కి పెంచేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. 

Continues below advertisement
Sponsored Links by Taboola