KTR about Kancha Gachibowli Lands Issue | హైదరాబాద్ కంచ గచ్చిబౌలిలోని అటవీ భూమిని పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు ఆదేశించిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR). చీఫ్ వైల్డ్ లైఫ్ సంరక్షుడ్ని హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని మిగిలిన ప్రాంతాలలో పర్యావరణం, దాని సంరక్షణ బాధ్యత చూసుకునేలా సూచించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీం ధర్మాసనం ఆదేశించినట్లు కేటీఆర్ ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. 

కొందరు జైలుకు వెళ్లే అవకాశం ఉందన్న ధర్మాసనం

400 ఎకరాల కంచ గచ్చిబౌలి భూముల అంశంపై సుప్రీంకోర్టు నేడు మరోసారి తెలంగాణ ప్రభుత్వానికి నిరాశే ఎదురైంది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఆ భూములలో ఎలాంటి చర్యలు చేపట్టరాదని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. ఈ విషయంలో తప్పులు జరిగినట్లు గుర్తిస్తే మాత్రం సీఎస్ సహా కొందరు అధికారులు జైలుపాలవుతారని జస్టిస్ బీఆర్ గవాయ్ హెచ్చరించారు. కేంద్ర సాధికార కమిటీ నివేదికపై కౌంటర్ దాఖలు చేసేందుకు నాలుగు వారాలు రాష్ట్ర ప్రభుత్వానికి గడువిచ్చింది.  దీనిపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ స్పందించారు. అటవీ భూములను పరిరక్షించేందుకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను బీఆర్ఎస్ పార్టీ హృదయపూర్వకంగా స్వాగతిస్తుంది. పర్యావరణం నాశనం చేసే తప్పిదాల నుంచి ఎవరూ తప్పించుకోలేరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడైనా జ్ఞానం రావాలని ఆశిస్తున్నాం.

కంచ గచ్చిబౌలి భూములపై తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టుకు పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇకనైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమను మూర్ఖంగా సమర్థించుకోవద్దని, తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలన్న సూచనలను పాటించాలని ఆశిద్దాం. 

హైదరాబాద్‌లో 400 ఎకరాల అటవీ భూమిని రక్షించడానికి అవిశ్రాంతంగా కృషి చేసిన వారికి, కంచ గచ్చిబౌలిలోని వన్యప్రాణులు, మూగజీవాలను కాపాడాలని ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా హైదరాబాద్ విశ్వవిద్యాలయం విద్యార్థులు, అధ్యాపకులకు కేటీఆర్ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ పోస్ట్ చేశారు.

రాష్ట్రంలో నెంబర్ వన్ విలన్ రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి ద్వారా కంచ గచ్చిబౌలి భూమిని ఒక ప్రైవేట్ సంస్థకు తనఖా పెట్టడంలో ఆర్థిక మోసం జరిగే అవకాశం ఉందని కేంద్ర సాధికార కమిటీ సిఫార్సును  సుప్రీంకోర్టు గుర్తించింది. ఆ భూముల విషయంలో భారీ ఆర్థిక మోసం జరిగిందనే BRS పార్టీ వాదనను సుప్రీం తీర్పు ధృవీకరిస్తుంది. రూ. 10,000 కోట్ల కుంభకోణానికి సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. అటవీ భూమిని నాశనం చేయడం, వన్యప్రాణులకు గూడు లేకుండా చేసి రాష్ట్రంలో నంబర్ 1 విలన్ రేవంత్ అయ్యారని కేటీఆర్ ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. #SaveHCUForest, #SupremeCourtOfIndia  అని ట్యాగ్ చేశారు.