Supreme Court : తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బీసీ రిజర్వేషన్ అంశంపై సుప్రీంకోర్టులో కూడా రేవంత్ సర్కారుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకొచ్చిన జీవోలను నిలిపేసింది హైకోర్టు. దీనిపై సుప్రీంకోర్టు తలుపుతట్టింది తెలంగాణ ప్రభుత్వం. అక్కడ కూడా వారికి అనుకూలమైన తీర్పు రాలేదు. స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు ఎస్‌ఎల్పీని కొట్టేసింది. 

Continues below advertisement

రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్లపై వాదనలు పూర్తిగా విన్న సుప్రీంకోర్టు... హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేసేందుకు నిరాకరించింది.  మెరిట్ ఆధారంగా తదుపరి తెలంగాణ హైకోర్టులో కేసుల విచారణ కొనసాగుతుందని సుప్రీం పేర్కొంది. సుప్రీంకోర్టు కూడా పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లొచ్చని వివరించింది. దీంతో కోర్టులు చెప్పినట్లుగా 50 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడిందని న్యాయనిపుణులు  చెబుతున్నారు. 

సుప్రీంకోర్టులో హోరాహోరీ వాదనలు 

సుప్రీంకోర్టులోని జస్టిస్ విక్రమ్ నాథ్-జస్టిస్ సందీప్ మెహతా  బెంచ్ ముందు ప్రభుత్వం తరఫున సింఘ్వీ వాదనలు వినిపించారు. ఇందిరా సాహ్ని తీర్పులోని ఒక పేరాను చూపిస్తూ సుప్రీంకోర్టు ఎక్కడా 50%కి మించిన రిజర్వేషన్లు అనవసరం అని చెప్పలేదని వాదించారు. దీనికి కౌంటర్‌గా వాదనలు వినిపించిన సీనియర్ అడ్వొకేట్ గోపాల్ ఎస్ వాదిస్తూ... "సర్కార్ జారీ చేసిన జీఓ ద్వారా రిజర్వేషన్లు 42%కి పెరిగాయి, మొత్తంగా 60%కి మించి వెళ్ళాయి. కృష్ణమూర్తి తీర్పులో 50% హద్దు క్లియర్‌గా ఉంది. ఇందిరా సాహ్ని తీర్పు సామాజికంగా వెనుకబడిన తరగతుల (అంటే SC/ST/OBC) సందర్భంలో ఉంది. అక్కడ ఇది సద్వినియోగం అవుతుంది." అని అ్నారు. 

Continues below advertisement

కృష్ణమూర్తి తీర్పులో పేర్కొన్న అంశాలను కోర్టుకు వివరించారు. "స్థానిక సంస్థల పరిధిలో SC/ST/OBC లకు 50% రిజర్వేషన్లకు మించి ఇవ్వకూడదు. మినహాయింపు కేవలం షెడ్యూల్డ్ ఏరియాల పరంగా మాత్రమే STల ప్రయోజనాలను కాపాడేందుకు మాత్రమే ఉండాలి." అని తెలిపినట్టు వెల్లడించారు. "ఇప్పుడీ ప్రభుత్వం OBCల కోసమే రిజర్వేషన్ పెంచిందని, దీంతో మొత్తం రిజర్వేషన్ 67%కి చేరింది." అని కోర్టులో వాదించారు. 

దీనిపై జస్టిస్ నాథ్ మాట్లాడుతూ... "ఒకవేళ OBCల రిజర్వేషన్ పెంచితే, అదే సమయంలో SC, STల రిజర్వేషన్లను తగ్గించాలి కదా?" అని అనుమానం వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన ప్రతివాదుల తరఫున న్యాయవాది గోపాల్ "అదే చెప్పాలని చూస్తున్నా. మహారాష్ట్ర కేసులో కూడా ఇది అనుమతించలేదని చెప్పారు. ఇప్పుడు తాత్కాలిక స్థాయిలో ఇందిరా సాహ్ని తీర్పుకి మినహాయింపునివ్వాలని చూస్తున్నారు. ఆర్డినెన్స్ 30.03.2025న జారీ అయింది. అసెంబ్లీ సమావేశమైన తరువాత అది రెండు వారాల్లోనే లాప్స్‌ అయింది. ఆ తరువాత జారీ చేసిన G.O. ఏ అధికారం ఆధారంగా జారీ చేసారో చెప్పడం లేదు." అని అన్నారు. మరో న్యాయవాది జోక్యం చేసుకొని "ఆర్డినెన్స్ కానీ, బిల్లు కానీ ఎక్కడా నోటిఫై కాలేదు." అని గుర్తు చేశారు. 

దీనిపై సంఘ్వీ మాట్లాడుతూ... "ఇక్కడ చర్చ ఆర్డినెన్స్ మీద కాదు, ప్రభుత్వం తీసుకున్న చర్య మీదే ఉంది. అసలు ప్రశ్న: 50% రిజర్వేషన్‌కు ఇది ఏకగ్రీవమైన, తప్పనిసరి పరిమితి" అని చెప్పారు. దీంతో సంఘ్వీ కామెంట్స్‌కు జస్టిస్ నాథ్ స్పందిస్తూ... "కృష్ణమూర్తి తీర్పు స్పష్టంగా చెప్పింది — మినహాయింపు కేవలం షెడ్యూల్డ్ ట్రైబ్స్‌కే వర్తిస్తుంది." అని అన్నారు. సింఘ్వీ సమాధానంగా "ఇక్కడి హైకోర్టు ఉత్తర్వు ప్రధానంగా వికాస్ కిషన్రావ్ గావలి తీర్పుపై ఆధారపడి ఉంది." అని వెల్లడించారు. దీనిపై జస్టిస్ నాథ్ మరోసారి రియాక్ట్ అయ్యారు. "ఆర్డినెన్స్, బిల్లు జారీ చేసిన తరువాత... అవి ఇంకా ఫైనల్ కాలేదు... అప్పుడు ఎందుకు ఒక సాధారణ G.O. జారీ చేయాల్సి వచ్చింది?" అని ప్రశ్నించారు. "ఆర్డినెన్స్ లాప్ అయిందన్న ఆర్గుమెంటు వారికి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు... ఆర్డినెన్స్ జూలైలో జారీ అయింది." అని సంఘ్వీ సమాధానం చెప్పారు. 

జస్టిస్ మెహతా కలుగుజేసుకొని "కృష్ణమూర్తి తీర్పులో చెప్పిన రేషియోను మీరు పరిగణలోకి తీసుకున్నారు? గావలి తీర్పు కూడా 50% మించి అనుమతించదని చెబుతుంది." కదా అని అన్నారు. సింఘ్వీ వాదిస్తూ.. "‘వై నాట్?’ అనే ప్రశ్న మీద హైకోర్టు తాత్కాలిక స్టే ఇవ్వొచ్చా? మొత్తం 36 పేజీల ఉత్తర్వుల్లో సరైన కారణం ఏదీ లేదు. ఎలాంటి pleadings లేకుండా ఇచ్చారు. గావలి తీర్పు ట్రిపుల్ టెస్ట్ ఆధారంగా ఉంది. అంటే ఎమ్పిరికల్ డేటా అవసరం. అయితే 50% అనేది ఒక కమిట్‌మెంట్‌, inflexible rule అవుతుందా?" అని ప్రశ్నించారు. 

ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషన్  కొట్టివేస్తున్నట్టు తీర్పు వెల్లడించింది. హైకోర్టు ఈ కేసును తన న్యాయ ప్రామాణికతల ఆధారంగా తేల్చుకోవచ్చని సూచన చేశారు.