ఏపీ తీర ప్రాంతం వెంబడి అసని తుపాను ప్రభావం చూపుతోంది. తీవ్ర తుపాను నుంచి తుపానుగా బలహీన పడిన అసని.. దిశను మార్చుకుని నరసాపురం, కాకినాడ, విశాఖకు సమాంతరంగా సముద్రంలో కదులుతోంది. దీని ప్రభావం ఉత్తర కోస్తాలోని విశాఖపట్నం, గోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే అంచనాలు వేశారు. అయితే, ఈ తుపాను ప్రభావం జనజీవనంపై పడుతోంది.
తాజాగా దక్షిణ మధ్య రైల్వే కూడా 37 రైళ్లను రద్దు చేసింది. మరికొన్నింటిని రీ షెడ్యూల్ చేసింది. సికింద్రాబాద్ నుంచి మొదలై ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలకు వెళ్లే కొన్ని రైళ్ల రద్దు అయ్యాయి. భీమవరం - విజయవాడ, విజయవాడ - మచిలీపట్నం, నర్సాపూర్ - నిడదవోలు, విజయవాడ - నర్సాపూర్, విజయవాడ నర్సాపూర్, మచిలీపట్నం - గుడివాడ, నిడదవోలు - భీమవరం జంక్షన్, గుంటూర్ - నర్సాపూర్, భీమవరం జంక్షన్ - మచిలీపట్నం, గుడివాడ - మచిలీపట్నం, కాకినాడ పోర్ట్ - విజయవాడ మార్గాల్లో వెళ్లే డెము, మెము సర్వీసులు రద్దు అయ్యాయి.