Telangana Weather:తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం ప్రకృతి ప్రకోపంతో అల్లకల్లోలంగా మారింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలు రాష్ట్రంలో జనజీవనాన్ని పూర్తిగా స్తంభింపజేశాయి. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లో మూసీ నది మహోగ్రరూపం దాల్చడంతో నగరవాసులు వణికిపోతున్నారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా, రాష్ట్రవ్యాప్తంగా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్‌ను ప్రకటించింది. రాబోయే రెండు రోజులు మరింత ప్రమాదకరమైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.  

Continues below advertisement

హైదరాబాద్‌లో మూసీ బీభత్సం: ఎంజీబీఎస్ బస్‌స్టాండ్‌లోకి వరద

మూసీ నది ఉధృతి శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తారస్థాయికి చేరింది. 45ఏళ్లలో ఎన్నడూ చూడని విధంగా వరద ప్రవాహం పెరగడంతో నగరంలోని కీలక ప్రాంతాలు నీట మునిగాయి. చాదర్‌ఘాట్‌లోని లోలెవల్ వంతెన పైనుంచి ఏకంగా ఆరు అడుగుల మేర వరద నీరు పారింది. ఇక మూసారాంబాగ్‌లో వంతెనపై నుంచి 10 అడుగుల ఎత్తులో వరద ప్రవహించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

ఈ వరద బీభత్సం కారణంగా ఎంజీబీఎస్ (మహాత్మాగాంధీ బస్‌స్టాండ్)లోకి నీరు చేరింది. ఎంజీబీఎస్‌లోకి వెళ్లే రెండు బ్రిడ్జిలు పూర్తిగా నీట మునిగాయి. ఊహించని రీతిలో ఒక్కసారిగా పెరిగిన ఈ వరద తీవ్రతతో ప్రయాణికులు బస్‌స్టాండ్‌లోనే చిక్కుకుపోయారు. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో వారు బయటికి రాలేక లోపలే ఉండిపోయారు. సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే అధికారులను అప్రమత్తం చేసి, చిక్కుకుపోయిన ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీసుకురావాలని ఆదేశించారు. మున్సిపల్ హైడ్రా డీఆర్ఎఫ్ (DRF) బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని, ఒక్కొక్కరిని చేతులు పట్టుకొని బయటికి తీసుకురావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.

Continues below advertisement

ఈ వరద ఉధృతికి ప్రధాన కారణం.. ఉస్మాన్ సాగర్ (గండిపేట) గేట్లను ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా ఎత్తడమేనని తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా వరద పోటెత్తి అల్లకల్లోలం సృష్టించింది. నార్సింగి - మంచిరేవుల మధ్య ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) సర్వీస్ రోడ్డులో కూడా వరద ఉధృతి పెరగడంతో నలుగురు వ్యక్తులు ఆటో ట్రాలీలో చిక్కుకుపోయారు. మార్గంలో వెళ్లకూడదని బారికేడ్లు ఏర్పాటు చేసినా, డ్రైవర్ పట్టించుకోకుండా రోడ్డు దాటేందుకు ప్రయత్నించడంతో ఈ ప్రమాదం జరిగింది. అక్కడ ఉన్న పోలీసులు, హైడ్రా డీఆర్ఎఫ్ బృందాలు తక్షణమే స్పందించి, ఆ నలుగురిని సురక్షితంగా కాపాడి ఒడ్డుకు చేర్చారు. చిక్కుకుపోయిన ఆటో ట్రాలీకి తాడు కట్టి, డీఆర్ఎఫ్ వాహనంతో బయటికి లాగారు.

రాష్ట్రమంతటా రెడ్ అలర్ట్: వాయుగుండం ప్రభావం

తెలంగాణపై తీవ్ర అల్పపీడనం ప్రభావం కొనసాగుతోంది. పశ్చిమ దిశలో కదులుతున్న ఈ తీవ్ర అల్పపీడనం మరింత బలపడి, వాయవ్య, దాని సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇది దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరం సమీపంలో తీరాన్ని దాటవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ వాయుగుండం ప్రభావంతో శని, ఆదివారాల్లో రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రమంతటా రెడ్ అలర్ట్ ప్రకటించారు. సెప్టెంబర్ 27 నుంచి 29వ తేదీ వరకు పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉంది.

భారీ వర్షాలు ఎక్కడ?

శనివారం (సెప్టెంబర్ 27న) వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి సహా మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

సెప్టెంబర్ 28న నిర్మల్, నిజామాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్‌ కర్నూల్ తదితర జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అన్ని జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.

ఈ నెల 30, అక్టోబర్ 1 తేదీల్లో కూడా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో  కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని డాక్టర్ లీలారాణి వెల్లడించారు.

రికార్డు స్థాయిలో వర్షపాతం, నదుల ఉధృతి

నైరుతి రుతుపవనాల సీజన్‌లో ఈ ఏడాది తెలంగాణలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. సాధారణంగా సీజన్ మొత్తంలో 72.33 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, శుక్రవారం నాటికి 95.06 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇది సాధారణం కంటే 31% అధిక వర్షపాతం. మూడు రోజుల్లో నైరుతి సీజన్ ముగియనున్నప్పటికీ, ఈ అదనపు వర్షం రాష్ట్రవ్యాప్తంగా నదులు, వాగులు, వంకలను పొంగేలా చేసింది.  

మెదక్, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, నాగర్‌కర్నూల్, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా, మరో 17 జిల్లాల్లో అధికంగా, 10 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. గోదావరి, కృష్ణా, మూసీ నదుల ఉధృతి పెరుగుతోంది. భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాలుస్తోంది. శుక్రవారం మధ్యాహ్నానికి గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శుక్రవారం రాత్రి 8 గంటలకు అది 45.10 అడుగుల వద్ద ప్రవహిస్తోంది.

మేడిగడ్డ బరాజ్‌కు 8.35 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది. బరాజ్ మొత్తం 85 గేట్లు ఎత్తి వరద మొత్తాన్ని దిగువకు వదులుతున్నారు. కాళేశ్వరం త్రివేణీ సంగమం వద్ద నీటిమట్టం 11.410 మీటర్ల ఎత్తులో పుష్కర ఘాట్‌ను తాకుతూ ప్రవహిస్తోంది.

భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో అనేక చోట్ల పంట నష్టం జరిగింది, రాకపోకలు స్తంభించాయి. సంగారెడ్డి జిల్లాలోని పుల్కల్‌లో శుక్రవారం అత్యధికంగా 14.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముంబై హైవేపై ముత్తంగి నుంచి సంగారెడ్డి వరకు రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పుల్కల్, వట్‌పల్లి, మునిపల్లి, రాయికోడ్ మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. నల్లగొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) మండలంలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక్కడ పత్తి, వరి పంటలు నీట మునిగాయి.

ములుగు జిల్లాలోనూ భారీ వర్షాల వల్ల బాడువా ప్రాంతంలో మిర్చి పంట నీట మునిగింది. టేకులగూడెం సమీపంలో 163 నంబర్ జాతీయ రహదారిని గోదావరి వరద ముంచెత్తడంతో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా శుక్రవారం మొత్తం ఏకధాటిగా వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో 5.68 సెంటీమీటర్లు, పెద్దకొత్తపల్లిలో 5.63 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఉమ్మడి జిల్లాలో దాదాపు 500 ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న, వరి పంటలు దెబ్బతిన్నాయి. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కురిసిన భారీ వర్షానికి మూసీ, ఈసీ, కాగ్నా నదులు ఉప్పొంగాయి. కోట్‌పల్లి, జుంటుపల్లి ప్రాజెక్టులు కూడా అలుగుపారాయి. 

భారీ వర్షాలు కేవలం ఆస్తి నష్టాన్ని, ట్రాఫిక్ ఇబ్బందులనే కాక, ప్రాణ నష్టాన్ని కూడా కలిగించాయి. శుక్రవారం రాష్ట్రంలో వేర్వేరు చోట్ల ముగ్గురు మృతి చెందారు. అత్యంత హృదయ విదారక ఘటన కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగింది. కెరమెరి మండలం జనకాపూర్ గ్రామానికి చెందిన పవార్ బిక్కునాయక్ (78)కు ఛాతీలో నొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, అనార్‌పల్లి వాగు ఉప్పొంగడంతో వాహనంలో తరలించేందుకు వీలు కాలేదు. దీంతో ఆయన మార్గమధ్యంలోనే మృతి చెందారు. వాగుపై వంతెన ఉంటే తమ ప్రాణాలు దక్కేవని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా, కరంజీవాడ గ్రామానికి చెందిన మండాడి కోసు (60) కూడా వాగు ప్రవాహం కారణంగా ఆస్పత్రికి వెళ్లలేక ఇంట్లోనే ఉండిపోయి, ఈ నెల 21న మృతి చెందాడు.

రాష్ట్రం అతలాకుతలమవుతున్న ఈ తరుణంలో, ప్రభుత్వం తక్షణమే సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, ముఖ్యంగా వంతెనలు లేని ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాయుగుండం ప్రభావంతో మరో రెండు రోజులు అత్యంత కీలకమైనందున, ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రాకుండా జాగ్రత్త పడాలని విపత్తు నిర్వహణ బృందాలు హెచ్చరిస్తున్నాయి.