Secunderabad Fire Accident: సికింద్రాబాద్ నల్లగుట్ట దక్కన్ స్పోర్ట్స్ మాల్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగి నాలుగు రోజులు కావస్తున్నా... కనిపించకుండా పోయిన యువకులు ఆచూకీ మాత్రం లభించలేదు. అందుకే పోలీసులు ఇప్పటికీ గాలింపు చర్యలు చేపడుతున్నారు. అగ్ని మాపక శాఖ, డీఆర్ఎఫ్, క్లూస్ టీమ్ సిబ్బంది భవనంలోని అన్ని అంతస్తుల్లో తిరుగుతూ పరిస్థితిని పరిశీలిస్తున్నారు. క్లూస్ టీం నిపుణులు ప్రత్యేక లైట్లు ఉపయోగించి భవనంలోని అన్ని అంతస్తుల్లో అణువణువూ గాలించినప్పటికీ ఎలాంటి ఫలితం కనిపించలేదు. ప్రమాదం జరిగి నాలుగు రోజులు అయినా.. గల్లంతైన గుజరాత్ కు చెందిన వసీం, జునైద్, జహీర్ కోసం జరిపిన గాలింపు చర్యల్లో ఒకరి మృతదేహం అవశేషాలు మాత్రమే లభించాయి. 


భవనంలో దాదాపు 10 వేల టన్నుల వ్యర్థాలు 
అయితే ఈ అవశేషాలు ఎవరివనే విషయం ఇంకా తేలలేదు. మొదటి, రెండో అంతస్తు పైకప్పు కూలిపోయి కిందపడడంతో శిథిలాలతో నిండిపోయింది. ప్రమాదం జరిగిన భవనంలో దాదాపు 10 వేల టన్నుల వ్యర్థాలు అన్నట్టు అధికారులు గుర్తించారు. వాటిని తొలగించడం ఇబ్బందికరంగా మారింది. ఇనుప గ్రిల్స్ పైకప్పులకు ఆనుకొని ఉండడంతో వాటిని తొలగిస్తే పైకప్పుల పరిస్థితి ఏంటని అధికారులు ఆలోచనలో పడ్డారు. ఇందుకోసం ఇంజినీరింగ్ నిపుణుల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. అలాగే మరోవైపు కనిపించకుండా పోయిన యువకుల మృతదేహాలను తమకు అప్పగించాలని వారి బంధువులు కోరుతున్నారు. అవి అప్పగించే వరకు భవనం కూల్చివేత పనులు నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. 


ప్రమాదం జరిగిన భవనం పరిస్థితి ప్రమాదకరంగా ఉందని భవనం పరిసరాలకు ఎవరూ రావొద్దంటూ జీహెచ్ఎంసీ అధికారులు స్థానికంగా నోటీసులు అందించారు. ప్రమాదం జరిగిన భవనాన్ని కూల్చి వేసేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ప్రత్యేక సాంకేతిక ఉపయోగించి చుట్టు పక్కల ఇళ్లకు ఇబ్బంది కల్గకుండా కూల్చి వేయాలని ఇప్పటికే అధికారులు నిర్ణయించారు. 


ప్రమాదానికి షాట్ సర్క్యూట్ కారణం కాదట..!


సికింద్రాబాద్ రాంగోపాల్ పేట డెక్కన్ షోరూమ్ అగ్ని ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనం అయ్యారు. అయితే అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం కాదని విద్యుత్ శాఖ అధికారి శ్రీధర్ తెలిపారు. మంటలు వ్యాపిస్తున్న సమయంలో మీటర్లలో విద్యుత్ సరఫరా ఉందన్నారు. ఒకవేళ షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటే సబ్ స్టేషన్ లో ట్రిప్ అయ్యేదని, కానీ అలా జరగలేదని అన్నారు. గురువారం ఉదయం 11.20 గంటలకు ఫోన్ రాగానే విద్యుత్ సరఫరా నిలిపివేశామన్నారు.


భవనానికి మాత్రం విద్యుత్ సరఫరా నిలిపేశామన్నారు. చుట్టు పక్కల కాలనీలకు సాయంత్రం 6.30 గంటలకు విద్యుత్ సరఫరా పునరుద్దరించామన్నారు. ఒకవేళ షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటే మీటర్లు, వైర్లు పూర్తిగా కాలిపోయేవని తెలిపారు. భవనానికి మొత్తం 6 మీటర్లు ఉన్నాయని శ్రీధర్ తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఏంటనేది దర్యాప్తులో తేలుతుందన్నారు.సికింద్రాబాద్‌లోని మినిస్టర్‌ రోడ్డులో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి అందులో ముగ్గురు గల్లంతు అయ్యారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వారి ఆచూకీ మాత్రం లోపల కనుగొనలేకపోయారు.