అత్యంత దారుణంగా ప్రేమించిన అప్సరను చంపేసిన సరూర్‌నగర్ పూజారి సాయికృష్ణ పోలీసులను కూడా భయపెట్టాడు. అరెస్టు చేసిన తర్వాత శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో హంగామా చేశాడని తెలుస్తోంది. ఆవేశంలో ఈ పని చేశానని చెప్పుకుంటూ బోరున విలపించినట్టు కూడా కథనాలు వినిపిస్తున్నాయి. 


అప్సర మిస్ అయిన తర్వాత కేసు నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తులో భాగంగా సాయికృష్ణను పిలిచి విచారించారు. సీసీటీవీ ఫుటేజ్, సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతడే హంతకుడిగా నిర్దారించుకున్నారు. ఈ క్రమంలోనే పోలీస్‌ స్టేషన్‌కు పిలిచి శంషాబాద్ పోలీసులు ఆధారాలు ముందు ఉంచి ప్రశ్నించారు. ఎవిడెన్స్‌తో దొరికిపోయిన తర్వాత చేసేది లేక నేరాన్ని అంగీకరించాడు. 


మరింత లోతుగా ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఇంతలో న్యూస్ బయటకు రావడం ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు. విషయం బయటకు తెలిసిపోయిందని పరువు పోతుందని భావించిన సాయికృష్ణ శంషాబాద్ పోలీస్ స్టేషన్‌లోనే హంగామా చేశాడట. తాను ఆవేశంలో చంపేశానని ఈ విషయం తెలిస్తే ఫ్యామిలీ ఏమైపోతుందని గ్రహించి తాను సూసైడ్‌ చేసుకుంటానని బెదిరించాడు. తనకు బతకాలని లేదని పదే పదే చెప్తూ వచ్చాడు. తనను జైల్లో పెట్టినా ఏదో టైంలో సూసైడ్ చేసుకుంటాని తన మొహాన్ని కుటుంబానికి చూపించలేనంటూ బోరున ఏడ్చినట్టు పోలీసులు చెబుతున్నారు. 


ఏడుస్తూనే హత్యకు దారి తీసిన పరిస్థితులు చెప్పినట్టు పోలీసుల నుంచి అందుతున్న సమాచారం. తను అప్సర తీవ్రంగా వేధించిందని చెప్పుకొచ్చాడట. రెండో పెళ్లైనా చేసుకోకుంటే పరువు తీస్తానంటూ హెచ్చరించిందని వివరించాడట. అంతే కాకుండా ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో కూడా పెడతానని తెలిసిన వారందరికీ షేర్ చేస్తానంటూ కూడా బ్లాక్ మెయిల్ చేసిందని చెప్పాడట. 


ఆ ఏరియాలో మంచి పేరు ఉన్న తన సంగతి ప్రజలకు తెలిస్తే పరువు పోతుందని సాయికృష్ణ అనుకున్నాడట. అందుకే ఆమెను హత్య చేసినట్టు చెప్పుకొచ్చాడు. 


అప్సర గర్భానికి తనను బ్లేమ్ చేసిందని... దాన్ని పేరుతో మరింత ఒత్తిడి చేసినట్టు సాయికృష్ణ చెప్పాడు. వేరే వాళ్లతో కూడా ఆమె సన్నిహితంగా ఉండేదని అన్నాడు. అందుకే ఆ గర్భానికి తనకు సంబంధం లేదని వాపోయాడు. పెళ్లి ఒత్తిడి తీవ్రమయ్యాక చంపేసినట్టు వివరించాడు. 


సాయికృష్ణ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో పోలీసులలో కంగారు మొదలైంది. ఏదైనా జరిగితే ప్రాబ్లమ్ అవుతుందని రాత్రికిరాత్రే జడ్జి ముందుకు సాయికృష్ణను తీసుకెళ్లారు. దీంతో సాయికృష్ణను 14 రోజుల రిమాండ్‌కు తరలిస్తూ జడ్జి ఆదేశాలు ఇచ్చారు. అనంతరం అతన్ని చర్లపల్లి జైలుకు తరలించారు. 


సరూర్‌నగర్‌లో ఉంటున్న సాయికృష్ణ... అదే ప్రాంతంలో అద్దెకు ఉంటున్న అప్సర అనే అమ్మాయితో వివేహాతర సంబంధం పెట్టుకున్నాడు. బంగారు మైసమ్మ ఆలయంలో పూజారిగా ఉంటూ రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న సాయికృష్ణతో అప్సరకు గుడిలో పరిచయం ఏర్పడింది. తరచూ అప్సర ఇంటికి వెళ్లి వాళ్ల అమ్మను అక్క అంటూ పిలుస్తూ చనువుగా ఉండేవాడు. 


ఇది వరకు పెళ్లై ఓ పాపకు తండ్రి అయిన సాయికృష్ణతో అప్సర చాలా ప్రదేశాలకు వెళ్లేది. గోశాలలు, గుడులకు వెళ్లేవాళ్లు. ఈ తిరుగుళ్లు కారణంగా అప్సర ఓసారి గర్భవతి కూడా అయినట్టు తెలిసిన వారు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకోవాలని సాయికృష్ణపై అప్సర ఒత్తిడి తీసుకొచ్చిందని సమాచారం.