RS Praveen Comments: "అవును మాది కుటుంబ పాలనే.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలంతా మా కుటుంబ సభ్యులే.. కేసీఆర్ మా ఇంటి పెద్ద" అంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బహుజన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. మొత్తం తెలంగాణ మీ కుటుంబమా? బాగానే చెప్పారు కేటీఆర్ అంటూ ట్విట్టర్ వేదికగా తెలిపారు. మరి అదే నిజమైతే ఆస్తులు, ఫాం హౌసులు, సౌత్ గ్రూప్ లాంటి బినామీలు, 100 కోట్లు, కాంట్రాక్టులు, హెలీకాప్టర్లు, మెడికల్ కాలేజీలు, ఫారిన్ టూర్లు అన్నీ కేవలం మీ కుటుంబీకులకే ఉన్నాయి ఎందుకని ప్రశ్నించారు. మిగతా తెలంగాణ మీ కుటుంబీకులకు ఎందుకు లేవని నిలదీశారు. 






తెలంగాణ అంతా కుటుంబమేనంటూ మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిల మండిపడ్డారు. అంతా కుటుంబమే అయితే ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయంటూ ప్రశ్నించారు. తెలంగాణ మొత్తం నీ కుటుంబమే అయినప్పుడు మీ ఆస్తులు ఎందుకు పెరిగినయ్, ప్రజలు ఎందుకు అప్పుల పాలయ్యారని నిలదీశారు. మీరు గడీలు, ఫాం హౌస్ లు కట్టుకోవచ్చు, విమానాలు కూడా కొనుక్కోవచ్చని విమర్షించారు. స్కాములు, కమీషన్లతో వేల కోట్లు వెనకేసుకోవచ్చంటూ ఫైర్ అయ్యారు. మీ పార్టీ అకౌంట్ లో ఎనిమిది వందల కోట్లు ఉండొచ్చు కానీ ప్రజలు మాత్రం అప్పుల పాలు కావాలా అంటూ తీవ్రంగా మండిపడ్డారు. మరి మీ ఆస్తులను ఎందుకు మీ కుటుంబ సభ్యులకు(ప్రజలకు) పంచివ్వడం లేదని, అధికారాలు ఎందుకు కట్టబెట్టడం లేదని అడిగారు. ఇంట్లో ఇన్ని సమస్యలు ఉంటే.. కుటుంబ పెద్ద మాత్రం అంత ప్రశాంతంగా ఎలా ఉన్నారంటూ నిలదీశారు. మాటలు చెప్పడం కాదు.. చేతల్లో చూపించాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 






గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే క్రమంలో..!


ఫిబ్రవరి నాలుగో తేదీ నాడు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మంత్రి కేటీఆర్ కుటుంబ పాలను గురించి ప్రస్తావించారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన సాగుతుందన్న ప్రతిపక్షాల విమర్శలకు మంత్రి కేటీఆర్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. తమది ముమ్మాటికీ కుటుంబ పాలనే అని.. తెలంగాణలోని నాలుగు కోట్ల మంది ప్రజలు తమ కుటుంబ సభ్యులే అని వివరించారు. అలాగే కేసీఆర్ యే తమ కుటుంబ పెద్ద అని చెప్పుకొచ్చారు. అందుకే కుటుంబ పాలన అంటున్న ప్రతిపక్షాల విమర్శల్ని తాము స్వీకరిస్తామని స్పష్టం చేశారు.