RS Praveen Kumar: భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ నాయకత్వంలో పనిచేసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. తనను అక్కున చేర్చుకున్న ప్రతి ఒక్కరికీ పాదాభివందనాలు అంటూ మాట్లాడారు. ఈరోజు (మార్చి 18) తాను కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో జాయిన్ అవుతున్నానని అన్నారు. తెలంగాణ వాదం, బహుజనవాదం రెండు ఒక్కటే అని.. తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం అయిన తెలంగాణ తెలంగాణ భవన్ లో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి నివాళులు ఆర్ ఎస్ ప్రవీణ్ నివాళులు అర్పించారు. అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు.
సీఎం రేవంత్ రెడ్డి నాకు టీఎస్‌పీఎస్సీ ఆఫర్ ఇచ్చిన మాట వాస్తవమే.. నేను తిరస్కరించాను.. ఎవరైనా ఎక్కడైనా పని చేసుకునే స్వేచ్ఛ ఉంది. తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పుకోవాలని రేవంత్ రెడ్డి నన్ను హెచ్చరిస్తున్నారు. నాకు నా రాజకీయ నిర్ణయం తీసుకునే స్వేచ్చ లేదా? నేనూ పాలమూరు బిడ్డనే.. నడిగడ్డ గాలి పీల్చి పెరిగాను. రేవంత్ రెడ్డి ఇలాంటి హెచ్చరికలు మానుకోవాలి. నాయకులను బెదిరించి కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారు. స్వార్థపరులే కాంగ్రెస్ లో చేరుతున్నారు. తెలంగాణ వాదం, బహుజన వాదం గోదావరి ప్రాణహితల్లాగా, కృష్ణా తుంగభద్రల్లాగా కలిసిపోతాయి’’ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.