తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తన విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించుకుని స్వదేశానికి తిరిగొచ్చారు. అమెరికా నుంచి విమానంలో బయలుదేరిన రేవంత్ రెడ్డి సోమారం తెల్లవారుజామున  శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. పలువురు కాంగ్రెస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. సుమారు రెండు వారాల పాటు సాగిన ఈ పర్యటనలో ఆయన స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సదస్సులో పాల్గొనడంతో పాటు, అమెరికాలోని ప్రతిష్టాత్మక హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రత్యేక లీడర్ షిప్ కోర్సును పూర్తి చేశారు. నేడు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై మున్సిపల్ ఎన్నికలు, తాజా రాజకీయ పరిణామాలు, కేంద్ర బడ్జెట్ సహా పలు అంశాలపై చర్చించనున్నారని తెలుస్తోంది.

హార్వర్డ్‌లో లీడర్‌షిప్ కోర్సు.. అరుదైన రికార్డుఈ పర్యటనలో ప్రధాన ఆకర్షణ రేవంత్ రెడ్డి హార్వర్డ్ కెన్నెడీ స్కూల్‌లో నిర్వహించిన "లీడర్‌షిప్ ఇన్ ది 21st సెంచరీ: కేయోస్, కాన్‌ఫ్లిక్ట్ అండ్ కరేజ్" అనే ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేయడం. జనవరి 25 నుండి 30 వరకు జరిగిన ఈ కోర్సులో ప్రపంచవ్యాప్తంగా 20 దేశాలకు చెందిన 62 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. అక్కడ మైనస్ 20 డిగ్రీల చలిలో కూడా సీఎం ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సాధారణ విద్యార్థిలా తరగతులకు హాజరయ్యారు. ముఖ్యమత్రి పదవిలో ఉండి హార్వర్డ్ నుంచి ఈ లీడర్‌షిప్ సర్టిఫికేట్ పొందిన తొలి భారతీయ సీఎంగా రేవంత్ రెడ్డి రికార్డు సృష్టించారు.

రాష్ట్రానికి పెట్టుబడులు, అభివృద్ధిపై దృష్టిస్విట్జర్లాండ్ లోని దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో 'తెలంగాణ రైజింగ్' నినాదంతో తన టీతో కలిసి భారీ పెట్టుబడులను ఆకర్షించారు సీఎం రేవంత్ రెడ్డి. పలు సంస్థలప్రతినిధులతో సమావేశమై పెట్టుబడులపై కీలక చర్చలు జరిపారు. కొన్ని కంపెనీలతో ఒప్పందాలపై సంతకాలు చేసుకున్నారు. అనంతరం స్విట్జర్లాండ్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి అమెరికాకు వెళ్లారు. వారం రోజుల హార్వర్డ్ లీడర్ షిప్ కోర్సు పూర్తిచేశారు. కోర్సు ద్వారా నేర్చుకున్న నాయకత్వ మెళకువలను రాష్ట్ర పాలనలో అమలు చేయనున్నారు. విదేశీ పర్యటన ముగిసిన వెంటనే ఆయన రాష్ట్రంలోని మున్సిపల్ ఎన్నికల ప్రచారం కేంద్ర బడ్జెట్ అనంతర పరిణామాలపై సమీక్ష నిర్వహించనున్నారు.