Telangana CM KCR | హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో నీళ్లు- నిజాలు అంశంపై చర్చలో సీఎం రేవంత్ రెడ్డి కృష్ణా నదీ జలాల పంపిణీ, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. పాలమూరు బిడ్డగా ఈ ప్రాంత కరువు కష్టాలు తనకు తెలుసని పేర్కొంటూ, మాజీ సీఎం కేసీఆర్ చర్చకు రాకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. పదేళ్లు సీఎంగా చేసిన అనుభవంతో సభకు వచ్చి ప్రాజెక్టులపై నిజనిజాలు చర్చిస్తారని భావించగా.. కేసీఆర్ సభకు రాకపోవడం విచారకరం అన్నారు. కృష్ణా జలాల అంశాన్ని తెరపైకి తెచ్చారు, కానీ అసెంబ్లీకి వచ్చి చర్చించాలని చెబితే సమావేశాలకు హాజరురాలేదన్నారు. శాసనసభ అంటే నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపం. ఇక్కడ అబద్ధాలకు, మాటల గారడీలకు చోటు లేదని సీఎం స్పష్టం చేశారు.
కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తున్నారు..40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే కేసీఆర్, గత రెండేళ్లుగా సభకు రాకపోవడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని సీఎంరేవంత్ రెడ్డి మండిపడ్డారు. చర్చకు రమ్మంటే బయట అసభ్య పదజాలంతో విమర్శలు చేయడం కాదని, సభకు వస్తేనే ఎవరి వాదనలో నిజముందో ప్రజలకు తెలుస్తుందని మరోసారి కేసీఆర్ సవాల్ విసిరారు.
కృష్ణా జలాల పంపిణీబచావత్ ట్రిబ్యునల్ నుండి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వరకు కృష్ణా జలాల కేటాయింపులపై సీఎం రేవంత్ రెడ్డి సభలో స్పష్టమైన గణాంకాలను వివరించారు. బచావత్ ట్రిబ్యునల్ (KWDT-1) ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీల వాటా ఉండేది. తదనంతరం 2004లో ఏర్పాటు చేసిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ (KWDT-2) అదనపు నీటి లభ్యతను గుర్తిస్తూ ఉమ్మడి రాష్ట్ర వాటాను 1005 టీఎంసీలకు పెంచింది. రాష్ట్ర విభజన తర్వాత ఈ వాటాను ఏపీ, తెలంగాణ మధ్య పంపిణీ చేసే బాధ్యతను కేంద్రం మళ్లీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కే అప్పగించిందని ఆయన గుర్తు చేశారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు 2009లోనే పునాదులు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కేసీఆర్ ఆలోచన కాదని, దీనికి 2009లోనే పునాదులు పడ్డాయని రేవంత్ రెడ్డి వివరించారు. నాటి మహబూబ్ నగర్ ఎంపీ విఠల్ రావు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి లేఖ రాయడంతోనే ఈ ప్రాజెక్టు ప్రక్రియ మొదలైందని ఆయన గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఎస్ఎల్బీసీ (SLBC), కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ వంటి అనేక ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిందని, కానీ గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని అసంపూర్తిగా వదిలేసిందని విమర్శించారు.
కేసీఆర్ నైతికతపై సీఎం రేవంత్ ప్రశ్నలు పాలమూరు ప్రాజెక్టు కోసం నాడు కాంగ్రెస్ నాయకులు సీమాంధ్ర నేతలతో కొట్లాడుతుంటే, అప్పుడు మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్న కేసీఆర్ ఎందుకు నోరు మెదపలేదు? అని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు. అప్పుడు అడగని వ్యక్తి, ఇప్పుడు ఏ నైతిక హక్కుతో మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా సభలో చర్చలు జరగాలని, రాజకీయ ప్రయోజనాల కోసం సభను వాడుకోవడం తగదని బీఆర్ఎస్ నేతలకు హితవు పలికారు.