BRS against Revanth Reddy | హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పిన మోసం చేసిన రేవంత్ రెడ్డిని, రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసిన రాహుల్ గాంధీని ఎన్నిసార్లు ఉరి తీయాలి అని ప్రశ్నించారు. నదీ జలాల విషయంలో దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసిన ద్రోహాన్ని ఎండగడుతూ, వాస్తవాలను ప్రజల ముందు ఉంచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో లక్షల ఎకరాల భూములకు కొత్త సాగునీరు అందించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందని, నీళ్లు ఇవ్వకుండా లక్షల ఎకరాలు ఎండిపోయేలా చేస్తున్న కాంగ్రెస్ నేతలకు జలాల అంశం, ప్రాజెక్టులపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహంసభానాయకుడి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి 'వినాశకాలే విపరీత బుద్ధి' అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. అధికార మదంతో విర్రవీగుతూ, తెలంగాణ కోసం ప్రాణాలను పణంగా పెట్టిన కేసీఆర్ వంటి గొప్ప నాయకుడిని రాబందు అని విమర్శించడం ఆయన అల్పబుద్ధికి నిదర్శనమని విమర్శించారు. కరువు నేలల్లో జీవకళ తెచ్చిన కేసీఆర్ గురించి అనరాని మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజల హృదయాలు రగిలిపోతాయని హెచ్చరించారు.
కాంగ్రెస్ వైఫల్యాలు - ఉరిశిక్షల ప్రస్తావనతెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులను ఉరి తీయాలని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఘాటుగా సమాధానమిచ్చారు. మాట తప్పినందుకు ఉరి తీయాల్సి వస్తే, అశోక్ నగర్ అడ్డా మీద 2 లక్షల ఉద్యోగాల హామీని విస్మరించినందుకు రాహుల్ గాంధీని, రుణమాఫీ పేరుతో రైతులను వంచించినందుకు కాంగ్రెస్ నాయకత్వాన్ని, బీసీ రిజర్వేషన్లపై అబద్ధాలు చెప్పినందుకు రేవంత్ రెడ్డిని ప్రజలు ఎక్కడ ఉరి తీయాలో ఆలోచించుకోవాలి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో 'అట్టర్ ప్లాప్' అయ్యిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
ప్రాజెక్టులపై రేవంత్ అజ్ఞానం అంటూ విమర్శలుముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇరిగేషన్ పట్ల కనీస అవగాహన లేదని కేటీఆర్ విమర్శించారు. బేసిన్లకు, ఐఐటీలకు, ట్రిబ్యునళ్లకు మధ్య ఉన్న తేడాలు కూడా తెలియని వ్యక్తి జలాల గురించి చర్చించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సమైక్యవాదుల సంచులు మోసిన చరిత్ర రేవంత్ రెడ్డిదని, అటువంటి అల్పుడి చేతిలో తెలంగాణ విలవిలలాడుతుండటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గత 65 ఏళ్ల కాంగ్రెస్ పాలనలోనే తెలంగాణకు అత్యంత ద్రోహం జరిగిందని, దానికి కాంగ్రెస్ పార్టీయే పరిపూర్ణ బాధ్యత వహించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చెప్పినవి అబద్ధాలే.. ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతల పథకం (RLIS) పనులు తన ఒత్తిడి వల్లే ఆగిపోయాయన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఇవి కేవలం రాజకీయ లబ్ధి కోసం చేసిన అసంబద్ధ వ్యాఖ్యలని, తెలంగాణ సీఎం మాటల్లో నిజం లేదంటూ కొట్టిపారేసింది.
జగన్ ప్రభుత్వ హయాంలో అనుమతులు లేకుండా పనులు చేపట్టడం వల్లే 2020లో ఎన్‌జీటీ (NGT), కేంద్రం ఈ ప్రాజెక్టును నిలిపివేశాయని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. 2024లో కూటమి ప్రభుత్వం రాకముందే కేంద్రం ఆ పనులను నిలిపివేసిందని, ఇందులో రేవంత్ రెడ్డికి ఎలాంటి పాత్ర లేదని ఏపీ సర్కార్ వివరించింది. నీటి హక్కుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, వాస్తవాలను వక్రీకరించవద్దని ఏపీ ప్రభుత్వం హితవు పలికింది.