Revanth Reddy attends Ande Sri funeral | ఘట్‌కేసర్: ప్రముఖ కవి, రాష్ట్ర గేయ రచయిత అందెశ్రీ అంత్యక్రియలు ఘట్‌కేసర్‌లో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పూర్తయ్యాయి. ఈ అంతిమ సంస్కారాలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అంత్యక్రియల్లో పాల్గొని సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా కవి అందెశ్రీ పాడెను మోశారు. అందెశ్రీ పట్ల తనకున్న గౌరవాన్ని, ప్రేమను చాటుకున్నారు. అందెశ్రీ కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితులు, ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో అంత్యక్రియల్లో పాల్గొని కడసారి వీడ్కోలు పలికారు.

Continues below advertisement


అంతకుముందు లాలాపేట్‌ నుంచి తార్నాక, ఉప్పల్‌ మీదుగా ఘట్‌కేసర్‌లోని ఎన్‌ఎఫ్‌సీ నగర్‌ వరకు అందెశ్రీ అంతిమయాత్ర కొనసాగింది. అనంతరం పోలీసు లాంఛనాలతో ప్రభుత్వం అధికారికంగా అందెశ్రీ అంత్యక్రియలు నిర్వహించి ప్రజాకవిని సాగనంపింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తదితరులు అశ్రు నయనాలతో అందెశ్రీకి వీడ్కోలు పలికారు. 





అందెశ్రీ కుటుంబానికి అండగా నిలిచిన తెలంగాణ ప్రభుత్వం


ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘అందెశ్రీ రాసిన ప్రతిపాట ప్రజా జీవితంలోంచి పుట్టుకొచ్చింది. అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తాం. అందెశ్రీ స్మృతీవనం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర సాధనలో అందెశ్రీ పాత్ర మరువలేనిది. రక్తాన్ని చెమటగా, పాటగా మార్చి ప్రజలకు అందించారు. అందెశ్రీతో నాది సోదర అనుబంధం. ఆయన లేకపోవడం నాకు వ్యక్తిగతంగా లోటు. అందెశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతాం. కిషన్ రెడ్డి, బండి సంజయ్ దీనిపై సహకరించాలి’ అన్నారు.



నివాసంలో కుప్పకూలిపోయిన అందెశ్రీ
 సోమవారం ఉదయం అందెశ్రీ తన ఇంట్లో తీవ్ర అస్వస్థతకు గురై కన్నుమూశారు. అయితే వాష్ రూం వద్ద కుప్పకూలిపోయినట్లు గుర్తించిన కుటుంబసభ్యులు అందెశ్రీని గాంధీ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే ఆయన మృతిచెందారని తెలిపారు. అందెశ్రీ చనిపోయి అదివరకే 5 నుంచి 6 గంటలు అయి ఉండొచ్చునని గాంధీ డాక్టర్ ఒకరు తెలిపారు. అందెశ్రీ మృతిపట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, కేసీఆర్, కేటీఆర్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. సాహితీ ప్రపంచంలో ఆయన లేని లోటు పూడ్చలేనిదన్నారు. తెలంగాణ ఉద్యమంలో, స్ఫూర్తిని రగిలించడంలో ఆయన పాత్ర మరిచిపోలేమన్నారు.