Telangana News | హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ (KCR) రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను సీఎం రేవంత్ స్మరించుకున్నారు. అమరుల ఆశయ సాధన కోసం అందరం తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో పునర్ అంకితమవుదామని ఆయన పిలుపునిచ్చారు. 11 ఏళ్లు పూర్తి చేసుకుని 12వ వసంతంలోకి అడుగుపెడుతున్నాం. తెలంగాణ రైజింగ్ పేరుతో అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని తమ ప్రభుత్వం సంకల్పించుకుందన్నారు. #TelanganaFormationDay అమరుల ఆశయాలకు… ప్రజల ఆకాంక్షలకు… పేదల సంక్షేమానికి, రైతుల సాగు స్వప్నాలకు, ఆడబిడ్డల ఆర్థిక స్వావలంబనకు, యువత బంగారు భవితకు… తెలంగాణ రైజింగ్ విజన్ కు పునరంకితమవుదాం అని పిలుపునిచ్చారు.
తెలంగాణ గమ్యాన్ని ముద్దాడిన ఒకే ఒక్కడు కేసీఆర్
తెలంగాణ ప్రజలకు కేసీఆర్ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్దాల స్వరాష్ట్ర పోరాటాలను గమ్యానికి చేర్చిన తెలంగాణ అస్థిత్వం బీఆర్‌ఎస్ పార్టీ అని.. పట్టుదలతో, నిబద్ధతతో ప్రయాణం చేసి గమ్యాన్ని ముద్దాడిన ఒకే ఒక్కడు కేసీఆర్ అని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నో పోరాటాలు చేసినా.. శాంతియుతంగా పార్లమెంటరీ పంథాలో కొట్లాడి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాం, ఉమ్మడి రాష్ట్ర పాలనలో ఆగమైన తెలంగాణను స్వయం పాలనలో అభివృద్ధి చేసుకున్నామని మాజీ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. సకల జనుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేశాం, అన్ని రంగాల్లో ప్రగతిని సాధిస్తూ, కొత్త రాష్ట్రం తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలుపుకున్నామని కేసీఆర్ అన్నారు.
అదే స్పూర్థిని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచించారు. అన్ని వర్గాల ప్రజల జీవన విధానం మరింత గుణాత్మకంగా సాగేలా పాలన కొనసాగాలని ఆకాంక్షించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ రాష్ట్ర ప్రజల్లో విశ్వాసం నింపాలని ఆకాంక్షించారు. తెలంగాణ మరింత ప్రగతిని సాధిస్తూ, పాడి పంటలతో వర్థిల్లాలని, రైతులు, సకలజనుల జీవితాలు సుఖ సంతోషాలతో నిండాలని మాజీ సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.