SLBC Tunnel: శ్రీశైలం ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సొరంగంలో చిక్కుకున్న వారి జాడ గుర్తించే పనిలో అధికారులు రాత్రి పగలు పని చేస్తున్నారు. పదికి పైగా సంస్థలు అక్కడ వర్క్ చేస్తున్నాయి. 22న దుర్ఘటన జరిగినప్పటి నుంచి నేవీ, ఆర్మీ, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, సింగరేణి, బీఆర్‌వో, ఎన్‌జీఆర్‌ఐ, జీఎస్‌ఐ, ఎల్‌అండ్‌టీ ఇలా చాలా సంస్థలు చర్యలు చేపడుతున్నాయి. 

ఎన్ని సంస్థలు ఎన్ని విధంగాలు బాధితుల చెంతకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ అక్కడ పరిస్థితులు అనుకూలించడం లేదు. టన్నెల్‌లో నిమిషానికి ఐదు వేల లీటర్ల నీళ్లు ఊరుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే అ ప్రాంతంలో భారీగా మట్టీ, రాళ్లు, బురద పేరుకుపోయింది. దీనికి తోడు నీరు ఉబికి వస్తుండటంతో పనులు ముందుకు సాగడం లేదు.  

సొరంగంలో ముందుకు కదిలే దారి కనిపించడం లేదు. మరోవైపు గంటలు గడుస్తున్న కొద్దీ చిక్కున్న వారి క్షేమ సమాచారంపై అనుమానాలు కలుగుతున్నాయి. ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరువలో ఉన్నామని బుధవారం నీటిపారుదల మంత్రి ప్రకటించారు. గురువారం నుంచి చర్యల్లో వేగం పెంచుతున్నట్టు కూడా తెలిపారు.  అందులో భాగంగా బురదలో కూరుకుపోయిన టీబీఎం పరిసరాల వరకు చేరారు. ఊరుతున్న నీటి తోడుతున్నారు. బురదను బయటకు తరలిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు.  

బాధితులను రక్షించేందుకు టీబీఎం కటింగ్‌, నీరు, బురద తొలగింపే అసలు సమస్యగా మారింది. ఇప్పుడు వాటిలో కొన్ని సమస్యలు పరిష్కారమయ్యాయి. ఇలా ఒక్కో అడ్డంకిని తొలగించిన అధికారులు జీరో పాయింట్ వద్దకు చేరుకున్నారు. అయితే మళ్లీ సొరంగం కూలే ప్రమాదం ఉందని అధికారులు చెప్పడంతో వెళ్లిన వాళ్లు పని పూర్తి చేయకుండానే వెనక్కి వచ్చేశారు. వెళ్లినంత వరకు తమకు ఎవరు కనిపించలేదని ర్యాట్‌ మైనింగ్ టీమ్‌ చెబుతోంది. 

 దారి దొరికిందని భావిస్తున్న అధికారులు మరింత దూరం వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అందుకే ఆపరేషన్ గంటల్లోనే పూర్తి అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. 22వ తేదీన ఇద్దరు టీబీఎం మిషన్‌ ఆపరేటర్లు, ఇద్దరు ఇంజినీర్లు, నలుగురు హెల్పర్లు ఈ సొరంగం ప్రమాదంలో ఇరుక్కుపోయారు. మొదట్లో కొన్ని మీటర్లు మాత్రమే ఇబ్బందిగా ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ లోపలికి వెళ్తున్న కొద్దీ సమస్య ఎంత క్లిష్టమో అర్థమవుతోందని అధికారులు నివ్వెరపోతున్నారు.  

సహాయక చర్యల్లో అధికారులు బిజీగా ఉంటే సొరంగాన్ని వేదికగా చేసుకొని పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. సొంత జిల్లాలో ప్రమాదం జరిగితే పట్టించుకోని ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్‌లు, ఎన్నికల ప్రచారాలు చేసుకుంటున్నారని బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. పాలకులు వెళ్లడం  కంటే అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయో చూడాలని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. స్థానిక ఎమ్మెల్యే, నీటిపారుదల మంత్రి అక్కడే ఉండి పనులు పర్యవేక్షిస్తున్నారని అలాంటి టైంలో సీఎం వెళ్లాల్సిన అవసరం ఏముందని నిలదీస్తోంది. 

ఈ విమర్శలు ఇలా సాగుతున్న టైంలోనే బీఆర్‌ఎస్ నేతలు ఎస్‌ఎల్‌బీసీ సొరంగం వద్దకు వెళ్లారు. మాజీ మంత్రి హరీష్‌రావు నేతృత్వంలో బీఆర్‌ఎస్ నేతల బృందం ప్రమాద స్థలాన్ని పరిశీలించి అక్కడ జరుగుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు.