Allu Arjun in Chanchalguda Jail | హైదరాబాద్: టాలీవుడ్ నటుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జైలు నుంచి విడుదల కావడంపై సస్పెన్స్ వీడింది. ఆయన శుక్రవారం రాత్రి విడుదల కావడం లేదని కన్ఫామ్ అయింది. శనివారం ఉదయం 6 గంటల తర్వాత ఏక్షణంలోనైనా అల్లు అర్జున్ చంచల్ గూడ జైలు నుంచి విడుదల కానున్నారు. బెయిల్ ఆర్డర్ కాపీ రావడం ఆలస్యం కావడంతో విడుదలలో జాప్యం జరిగిందని జైలు సూపరిటెండెంట్ అధికారికంగా నిర్ధారించారు. దాంతో చంచల్ గూడ జైల్లోని మంజీరా బ్యారక్ లోనే అల్లు అర్జున్ ఉండనున్నారు. ఈరోజు రాత్రికి అల్లు అర్జున్ చంచల్ గూడ జైల్లోనే ఉండనున్నారని పోలీసులు తెలిపారు. అల్లు అర్జున్ రాత్రికి విడుదల అవుతారని పెద్ద ఎత్తున ఫ్యాన్స్ జైలు వద్దకు చేరుకున్నారు.
తెలంగాణ హైకోర్టులో అల్లు అర్జున్‌కు ఊరట
నటుడు అల్లు అర్జున్‌కు తెలంగాణ హైకోర్టులో శుక్రవారం సాయంత్రం ఊరట లభించింది. పుష్ప 2 నటుడికి హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రూ.50 వేలు వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేస్తూ విడుదలకు ఉత్తర్వులు జారీ చేసింది. కానీ పూచీకత్తు బాండ్లు తీసుకుని అల్లు అర్జున్ లాయర్లు చంచల్‌గూడ జైలుకు వచ్చినా ప్రక్రియ పూర్తి కాలేదు. సాయంత్రం నుంచి అల్లు అర్జున్ బెయిల్ ఆర్డర్ పేపర్లు చంచల్ గూడకు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూశారు. మొదట లాయర్లు సమర్పించిన పేపర్లలో కొన్ని తప్పిదాలు దొర్లడంతో వాటిని జైలు అధికారులు తోసిపుచ్చారు. మరోవైపు కోర్టు నుంచి బెయిల్ కాపీ జైలు సూపరింటెండ్ కు చేరడంలో జాప్యం జరిగింది. కానీ పూచీకత్తు సమర్పించే ప్రక్రియ, బెయిల్ ఆర్డర్ పత్రాలు, సంబంధిత కాపీ ఇవ్వడంలో జాప్యం జరగడంతో అల్లు అర్జున్ విడుదల ఆలస్యమైంది. జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల ప్రక్రియ రేపటికి వాయిదా పడటంతో ఫ్యాన్స్ నిరాశకు లోనయ్యారు.
క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లిపోయిన అల్లు అరవింద్
తన కుమారుడు అల్లు అర్జున్‌కు హైకోర్టులో ఊరట లభించడంతో రాత్రిలోగా జైలు నుంచి విడుదల అవుతారని నటుడి తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ భావించారు. కానీ సాయంత్రం నుంచి ఎంత ప్రయత్నించినా, కోర్టు నుంచి బెయిల్ ఆర్డర్ కాపీ జైలుకు అందడంతో జాప్యం జరిగింది. పూచీకత్తు సమర్పించడానికి వచ్చిన లాయర్లు ఇచ్చిన పత్రాలలో తప్పిదాలు ఉన్నాయని జైలు సూపరింటెండ్ సూచించినట్లు సమాచారం. దాంతో మరోసారి పత్రాలు తీసుకువచ్చిన అల్లు అర్జున్ లాయర్లు జైలు అధికారులకు సమర్పించారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ శుక్రవారం రాత్రి జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లేదని గ్రహించిన ఆయన తండ్రి అల్లు అరవింద్ తీవ్ర నిరాశ చెందారు. వెంటనే క్యాబ్ బుక్ చేసుకుని తన నివాసానికి వెళ్లిపోయారు. అల్లు అర్జున్ కోసం సాయంత్రం నుంచి ఎదురుచూసిన ఆయన కుటుంబసభ్యులు ఆవేదన చెందుతున్నారు.
చంచల్ గూడ జైలుకు తరలివస్తున్న బన్నీ ఫ్యాన్స్
నాంపల్లి కోర్టు శుక్రవారం మధ్యాహ్నం అల్లు అర్జున్‌కు రెండు వారాల రిమాండ్ విధించింది. దాంతో ఆయనను పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. సాయంత్రం నుంచి చంచల్ గూడ జైలుకు బన్నీ ఫ్యాన్స్ భారీగా చేరుకుంటున్నారు. రాత్రివేళ అల్లు అర్జున్ విడుదల కానున్నారని భావించి భారీ సంఖ్యలో జైలు వద్దకు తరలి వస్తున్నారు. కానీ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల రేపటికి వాయిదా పడింది. మరోవైపు హైకోర్టులో దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ కు ధర్మాసనం ఓకే చేసింది. మరోవైపు అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను జనవరి 21కి వాయిదా వేసింది.