రేపటి నుంచి మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి మోదీ పర్యటించనున్నారు. శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకోనున్న మోదీ... బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొంటారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లను బీజేపీ పూర్తి చేసింది. 


రేపటి నుంచి రెండు రోజుల పాటు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. దీంట్లో పాల్గొనేందుకు నరేంద్ర మోదీ శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుంటారు. రెండు గంటల యాభైఐదు నిమిషాలకు బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా హెచ్‌ఐసీసీ నోవాటెల్‌కు వెళ్లి రెస్టు తీసుకుంటారు. తర్వాత నాలుగు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొంటారు.






జులై 3న ఉదయం పది గంటలకు మళ్లీ జాతీయ కార్యకవర్గ సమావేశాలు ప్రారంభమవుతాయి. అందులో మోదీ పాల్గొంటారు. దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయాలు, తెలుగు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలు చర్చిస్తారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలంటే ఏం చేయాలనే అంశంపై నేతలకు దిశా నిర్దేశం చేస్తారు.






తర్వాత నేరుగా పరేడ్‌ గ్రౌండ్స్‌కు చేరుకొని అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ సభలో బీజేపీ అగ్రనేతలంతా పాల్గొంటారు. అక్కడ బహిరంగ సభలో ప్రసంగించిన తర్వాత రాత్రి మళ్లీ హైదరాబాద్‌లోనే బస చేసి... ఉదయాన్నే ఆంధ్రప్రదేశ్‌లో మోదీ పర్యటన మొదలవుతుంది.  


పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని పెదఅమిరంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరిస్తారు. అల్లూరి శత జయంతి వేడుకలు సందర్భంగా ఈ విగ్రహాన్ని ఏఎస్‌ఆర్ పార్కులో ముఫ్పై అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 


విగ్రహావిష్కరణ అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభకు అన్ని పార్టీలను కేంద్రమంత్రి ఆహ్వానించారు. ప్రధానమంత్రి పర్యటన కోసం అధికార యంత్రాగం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. దిల్లీ నుంచి వచ్చిన స్పెషల్‌ ఫోర్స్‌ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.