Hyderabad Fly Overs: హైదరాబాద్ లో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఉప్పల్ - నారపల్లి ఫ్లైఓవర్ (Uppal Narapally Fly over) నిర్మాణం రాజకీయ రంగు పులుముకుంది. ఈ ఫ్లైఓవర్ ను ఇంకా ఎన్ని సంవత్సరాలు కడతారని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. 2018, మే 5వ తేదీన ఉప్పల్ - నారపల్లి ఫ్లై ఓవర్ పనులు ప్రారంభమయ్యాయని, ఇప్పటికి ఐదేళ్లు పూర్తైనా కూడా 40 శాతం పనులు కూడా అవ్వలేదని కొంత మంది ఏకంగా పోస్టర్లు అంటించారు. ఆ పోస్టర్లలో ప్రధాని మోదీ ఫోటో ముద్రించి మరీ విమర్శనాత్మకంగా పోస్టర్లను అంటించారు. కాలేదంటూ పోస్టర్లలో తెలిపారు. ఈ ఫ్లై ఓవర్ ఇంకెప్పుడు పూర్తి చేస్తారంటూ పోస్టర్లలో ప్రశ్నించారు.


ఆ ఫ్లై ఓవర్‌కు ఉన్న అన్ని పిల్లర్లపైన వరుసగా పోస్టర్లు అంటించుకుంటూ పోయారు. ఇదే విషయంపై మంత్రి కేటీఆర్ మార్చి 27వ తేదీన ట్విటర్ లో స్పందించారు. ఐదేళ్లలో తాము 35 ఫ్లైఓవర్ ప్రాజెక్టులు పూర్తి చేశామని, కేంద్ర ప్రభుత్వం నగరంలోని రెండు ఫ్లైఓవర్లు కూడా కట్టలేకపోయిందని ఎద్దేవా చేశారు. కేంద్రం 2 ఫ్లైఓవర్లు కూడా కట్టలేకపోయిందని ఎద్దేవా చేశారు. గతంలో ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు వచ్చిన సందర్భంలో కూడా హైదరాబాద్ లో ఆయనకు వ్యతిరేకంగా పలు పోస్టర్లు వెలిశాయి.


ఉప్పల్, నారపల్లి ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి కాకపోవడంతో వాహనదారులు, స్థానికంగా ఉండే ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అయితే, ఈ పిల్లర్లపై ఈ పోస్టర్లు ఎవరు అంటించారు? ఎప్పుడు అంటించారు? ఎవరు చెబితే అంటించారనే చర్చ సాగుతోంది. దీనిపై బీజేపీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే బీజేపీని బద్నాం చేసేందుకే పోస్టర్లు అంటించారని ఆ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






భారత్ మాల ప్రాజెక్టు కింద ఫ్లైఓవర్ నిర్మాణం


Bharath Mala Project: భారత్‌ మాల ప్రాజెక్టు కింద ఉప్పల్ - నారపల్లి ఫ్లైఓవర్‌ను కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తుంది. అది నిర్మాణం మొదలు పెట్టి ఐదేళ్లు అయినా ఈ ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. ఇప్పటి వరకు 40 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. ఫ్లై ఓవర్‌ను వీలైనంత తొందరగా పూర్తి చేయాలని కేంద్రమంత్రి జి. కిషన్‌ రెడ్డికి విన్నవించుకున్నా ఫలితం లేదని అంటున్నారు. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం శరవేగంగా ఫ్లై ఓవర్ల నిర్మాణాలను పూర్తి చేస్తూ ఓపెనింగ్‌ చేస్తుందని, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇలా నాన్చుడు ధోరణి ప్రదర్శించడం ఏంటని, బీఆర్ఎస్ అభిమానులు ఈ పోస్టర్లను సోషల్ మీడియాలో తెగ షేర్లు చేస్తున్నారు.