(Source: Poll of Polls)
Rangareddy Accident Exgratia: చేవెళ్ల బస్సు ప్రమాద బాధితులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారం
PM Modi announces Rs 2 lakh exgratia | రంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ప్రమాదం బాధితులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపరిహారం ప్రకటించాయి.

Chevella Accidents Exgratia | చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని మీర్జాగూడ వద్ద కంకర లోడుతో వెళ్తున్న లారీ, ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో మృతిచెందిన వారితో పాటు గాయపడిన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలిచాయి. కేంద్రం మృతులకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50000 పరిహారం ప్రకటించగా.. తెలంగాణ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల మేర నష్టపరిహారం అందిస్తామని ప్రకటించింది.
మృతులను గుర్తిస్తున్నాం.. మంత్రి పొన్నం ప్రభాకర్..
చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఈ దుర్ఘటనలో 19 మంది చనిపోయినట్లు మంత్రి ధృవీకరించారు. మృతదేహాలకు సంబంధించిన పోస్టుమార్టం ప్రక్రియ చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతోందని ఆయన తెలిపారు. మరణించిన 19 మందిలో పది మంది మహిళలు, ఎనిమిది మంది పురుషులు, మరియు ఒక చిన్నారి ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. పోలీసులు ఇప్పటికే ఈ 19 మందిలో 13 మంది మృతులను గుర్తించి, వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
తెలంగాణ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా..
ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. అలాగే, ప్రమాదంలో గాయపడిన వారికి రూ. 2 లక్షల పరిహారం అందిస్తున్నామని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి హామీ ఇచ్చారు. పోస్టుమార్టం ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఒక్కో మృతదేహానికి ఒక్కో అధికారిని కేటాయించి వారి స్వస్థలాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు.
బాధితులకు పరిహారం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం..
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన దుర్ఘటనలో సంభవించిన ప్రాణనష్టం తనను తీవ్రంగా బాధించిందన్నారు ప్రధాని మోదీ. ఈ క్లిష్ట సమయంలో బాధితులు, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడ్ని ప్రార్థిస్తా అన్నారు. ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబానికి పీఎంఎన్ ఆర్ ఎఫ్ నుండి రూ.2 లక్షలు నష్ట పరిహారం అందిస్తామని తెలిపారు. గాయపడిన వారికి రూ.50,000 చొప్పున నష్ట పరిహారాన్ని అందిస్తాంమని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. 
రాష్ట్ర వైద్య , ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా గారు చేవెళ్ల రోడ్డు ప్రమాద ఘటన లో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన చికిత్స ను అందించాలని రాష్ట్ర వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. బాధితులకు మెరుగైన చికిత్స ను అందించేందుకు వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సంగీత , రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డా. నరేంద్ర కుమార్ , రాష్ట్ర వైద్యవిధాన పరిషత్ కమిషనర్ డా . అజయ్ కుమార్ లను ఆదేశించారు. మంత్రి అధికారులతో ఎప్పటికప్పుడు టెలిఫోన్ లో మాట్లాడి పరిస్థితి ని సమీక్షిస్తున్నారు .
ఘటన లో గాయపడిన వారికి మెరుగైన చికిత్స ను అందించేలా వైద్యుల కమిటీ ని నియమించాలని అధికారులతో టెలిఫోన్ లో ఆదేశించారు. ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలను త్వరగా వారి కుటుంబ సభ్యులకు అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు .






















