Pawan Kalyan: తెలంగాణలో తనను అడుగు పెట్టనివ్వబోమని చాలా మంది చేస్తున్న కామెంట్స్‌పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఏ చిన్న వివాదం వచ్చినా సరే ఆంధ్రా, తెలంగాణ మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఉపాధి గురించి కానీ, ఉద్యమకారుల గురించి ఎవరూ మాట్లాడటం లేదని అన్నారు. ఇప్పుడు ఇలాంటి కామెంట్స్ చేస్తున్న వారంతా వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదని అన్నారు. ఈ సందర్భంగా గద్దర్‌తో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేశారు. బండినెక బండి కట్టి అంటూ జనచైతన్యం తీసుకొచ్చిన గద్దర్‌ కోసం ఇప్పుడు ఉన్న వారంతా ఏం చేశారని ప్రశ్నించారు. తనతో చాలా సమయం కూర్చొని మాట్లాడిన పాశం యాదగిరి కూడా తనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఇవి చాలా బాధ కలిగిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. 

Continues below advertisement

తెలంగాణ పోరాటాలు, గద్దర్ లాంటి వ్యక్తి స్ఫూర్తితో తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు పవన్. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత గద్దర్‌తో పరిచయం ఏర్పడిందని చాలా మంది అనుకుంటారని కానీ ఖుషీ సినిమా రిలీజ్ అయిన తర్వాత నుంచే గద్దర్‌తో స్నేహం ఏర్పడిందని తెలిపారు. తన సినిమా చూసిన తర్వాత తనను కలిశారని వివరించారు. తనను రా అని పిలిచే సన్నిహితుడని అన్నారు. అలాంటి వ్యక్తి తనకు సమస్య వస్తే తనకు ఫోన్ చేసే వాడని వివరించారు. 

Continues below advertisement

తన వెన్నులో బుల్లెట్స్ ఉన్నాయని అందుకే నడవలేకపోతున్నానని, బండి కొనివ్వాలని గద్దర్ రిక్వస్ట్ చేశారని పవన్ గుర్తు చేశారు. ఆయన రిక్వస్ట్ చేసిన మూడు నాలుగు రోజుల్లో కారు పంపించి వ్యక్తిని అని తెలిపారు. ప్రజలను చైతన్యం చేసిన వ్యక్తి గద్దర్ బతికి ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్న నాయకులు ఏం చేశారని ప్రశ్నించారు. ఎక్కడ దాక్కున్నారని నిలదీశారు. తనతో చాలా విషయాలపై చాలా సమయం మాట్లాడిన పాశం యాదగిరి లాంటి వ్యక్తులు కూడా ఇప్పుడు తనను తెలంగాణలోకి రానివ్వబోమని చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు.   

తెలంగాణలో ఏం జరిగినా ఆంధ్రావాళ్లనే తిడుతూ ఉంటే సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని పవన్ ప్రశ్నించారు. ఇంకా ఎంత కాలం కాలక్షేపం చేస్తుంటారని అన్నారు. ఇక్కడ వ్యాపారులు, కాంట్రాక్టర్లు బాగానే ఉంటున్నారని కానీ జనసేన లాంటి పార్టీలు, తన లాంటి వ్యక్తులను రానివ్వబోమని చెప్పడం ఏంటని నిలదీశారు. అసలు కాంగ్రెస్ జాతీయ భావాలు ఉన్న పార్టీనా లేకా ప్రాంతీయవాద పార్టీ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు వేర్వేరు ప్రాంతాల్లో పోటీ చేసి ఎలా గెలుస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఇలా రెండు ప్రాంతాల మధ్య విధ్వేషాలు పెంచుకుంటూ పోతే దేశానికే ప్రమాదమని అన్నారు. 

తెలంగాణపై తనకు ఉన్న ప్రేమ రాజకీయ ప్రయోజనాలతో ముడిపడి లేదని తనకు మొదటి నుంచి కూడా ప్రేమ ఉందన్నారు పవన్ కల్యాణ్. అందుకే తెలంగాణ ప్రజల నుంచి తనను ఎవరూ దూరం చేయలేరని స్పష్టం చేశారు.