హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీలో అత్యాచారానికి గురై చనిపోయిన ఆరేళ్ల పాప కుటుంబాన్ని పరామర్శించేందుకు పవన్ కల్యాణ్ వచ్చారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో తోపులాటలు చోటు చేసుకున్నాయి. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు పవన్ కల్యాణ్‌కు ఆటంకం ఏర్పడింది. బాధిత కుటుంబం వద్దకు పవన్ కల్యాణ్ వస్తున్నారని తెలుసుకున్న అభిమానులు ఆ కాలనీకి పోటెత్తారు. ఆ తర్వాత సింగరేణి కాలనీకి కారులో పవన్ కల్యాణ్ చేరుకోగానే, ఆయన్ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఒకర్నొకరు తోసుకోవడంతో అక్కడ గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. భద్రతా సిబ్బంది అదుపు చేసేందుకు యత్నించినా కుదరలేదు. దీంతో పవన్ కల్యాణ్ కనీసం కారు కూడా దిగే పరిస్థితి లేకుండా పోయింది. అభిమానుల తీరుతో పవన్​కల్యాణ్ ఒకింత అసహనానికి గురైనట్టుగా తెలుస్తోంది.


చివరికి ఎట్టకేలకు పవన్ కల్యాణ్ బాధిత కుటుంబాన్ని కలిశారు. చిన్నారిపై అఘాయిత్యం జరగడం తనను కలచి వేసిందని ఆవేదన చెందారు. బాధిత కుటుంబానికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.


సైదాబాద్‌లోని ఆరేళ్ల చిన్నారిపై రాజు అనే యువకుడు తన గదిలోనే అత్యాచారం చేసి పరుపులో చుట్టేసి చంపేసిన సంగతి తెలిసిందే. ఘటన జరిగిన రోజు నుంచి ఈ ఘటనపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. విపక్ష నేతలు పలువురు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. త్వరగా నిందితుణ్ని పట్టుకుంటామని, కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


మరోవైపు, నిందితుడు రాజు కోసం పోలీసులు విపరీతంగా గాలిస్తున్న సంగతి తెలిసిందే. ఘటన జరిగి వారం రోజులు కావస్తున్నా నిందితుడి ఆచూకీ మాత్రం లభించడం లేదు. దీంతో పోలీసులు నిందితుడి కోసం భారీ నజరానా ప్రకటించారు. అతణ్ని పట్టిస్తే ఏకంగా రూ.10 లక్షల రివార్డు ఇస్తామని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ప్రకటించారు. నిందితుడ్ని పట్టుకోవడం ఆలస్యం అవుతుండడంతో ప్రభుత్వంపై విమర్శలు కూడా పెరుగుతున్నాయి.


బాధిత కుటుంబానికి రాజకీయ నేతల మద్దతు పెరుగుతుండడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. విపక్ష నేతలంతా రాజకీయ లబ్ధి కోసమే ఈ పని చేస్తున్నారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. మరోవైపు, వైఎస్ షర్మిల సైతం బాధిత కుటుంబానికి మద్దతు ప్రకటించారు. ఆమె ఏకంగా సదరు కాలనీలో దీక్షకు దిగారు. సీఎం కేసీఆర్ స్పందించేవరకూ తాను దీక్ష విరమించబోనని ఆమె తేల్చి చెప్పారు.


Also Read: Sonu Sood: సోనూసూద్ ఇంటిపై ఐటీ దాడులు..


Also Read: Sharmila : రూ. 10 కోట్ల పరిహారం ఇవ్వాలి.. సీఎం స్పందించాలి ! చిన్నారికి న్యాయం చేయాలని సింగరేణి కాలనీలో షర్మిల దీక్ష !


Also Read: Revanth Reddy: కేసీఆర్ అవినీతిపై కేంద్రానికి ఫిర్యాదు చేశా.. కానీ నో రెస్పాన్స్..