Revanth Reddy to attend programme at OU on August 21 | హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి. కాశీంలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఆగస్ట్ 21న ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరవాలని ఈ సందర్భంగా ఆయనను ఆహ్వానించారు.
రూ.80 కోట్ల వ్యయంతో రెండు కొత్త హాస్టళ్లుఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి రెండు కొత్త హాస్టళ్లను ప్రారంభించనున్నారు. రూ.80 కోట్ల వ్యయంతో నిర్మితమైన ఈ హాస్టళ్లు 1200 మంది విద్యార్థులకు వసతి కల్పించగలవు. అలాగే, గిరిజన సంక్షేమ శాఖ సహకారంతో 300 మంది విద్యార్థులకు వసతి కల్పించే మరో రెండు హాస్టళ్ల నిర్మాణానికి శంకుస్థాపన కూడా జరుగనుంది. ప్రస్తుతం ఓయూలో 25 హాస్టళ్లలో సుమారు 7,223 మంది విద్యార్థులు నివసిస్తున్నారు. కొత్తగా ప్రారంభించనున్న హాస్టళ్లు అదనపు వసతిని అందించనున్నాయి. అదనంగా, దాదాపు రూ.10 కోట్ల వ్యయంతో డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూమ్ నిర్మాణానికి కూడా సీఎం భూమిపూజ చేయనున్నారు.
20 ఏళ్ల తర్వాత ఓయూలో తొలి సీఎంగాఅదే రోజు ఓయూలోని టాగూర్ ఆడిటోరియంలో 1000 మందికి పైగా ప్రొఫెసర్లు, విద్యార్థుల సమక్షంలో “తెలంగాణ విద్యా రంగంలో రావాల్సిన మార్పులు - ప్రభుత్వ ప్రణాళిక” అనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొననున్నారు. 20 ఏళ్ల తర్వాత ఓయూలో ముఖ్యమంత్రి హోదాలో ప్రసంగించనున్న తొలి సీఎం రేవంత్ రెడ్డి కావడం విశేషం. ఈ సందర్భంగా "సీఎం రీసెర్చ్ ఫెలోషిప్" మరియు విదేశీ విద్యార్థి పర్యటనలకు ఆర్థిక సహాయ పథకాలను కూడా ప్రారంభించనున్నారని వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం తెలిపారు.