Asaduddin Owaisi: ఆపరేషన్ సిందూర్‌పై అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు, ఎక్స్ ఖాతాలో పోస్ట్ Viral
Operation Sindoor | పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత బలగాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ దాడులను ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ స్వాగతించారు. ఉగ్రవాదులకు ఇంకా బుద్ధి చెప్పాలన్నారు.

AIMIM chief Asaduddin Owaisi | పహల్గాంలో జరిగిన ఉగ్రదాడులకు భారత ప్రభుత్వం ఏం చేస్తుందా అని ఎదురుచూసిన వారికి సమాధానం దొరికింది. గతంలో పుల్వామా ఉగ్రదాడులకు ప్రతీకారంగా భారత ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. రాత్రికి రాత్రే వెళ్లి పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసి ఊహించని విధ్వంసాన్ని వారికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. ఏప్రిల్ 22న పహల్గాంలో మరో భారీ ఉగ్రదాడి జరగగా, అందుకు ప్రతీకారంగా భారత బలగాలు ఆపరేషన్ సిందూర్ ప్రారంభించాయి. 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి నామరూపాలు లేకుండా చేసి భారత బలగాలు విజయవంతంగా తిరిగొచ్చాయని రక్షణ శాఖ తెలిపింది. భారత బలగాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పై నేతలు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.
అసదుద్దీన్ ఒవైసీ ఏమన్నారంటే..
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా కేంద్రం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పై AIMIM చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత బలగాలు నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ ను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. మరో పహల్గాం లాంటి దాడులు జరగకుండా పాకిస్తాన్ ఉగ్రవాదులకు సరైన బదులిచ్చింది మన సైన్యం. మళ్లీ ఉగ్రదాడులు జరగకండా పాకిస్తాన్ కు కఠినమైన గుణపాఠం చెప్పాలి. పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలతో పాటు వారి మౌలిక సదుపాయాలను పూర్తిగా నాశనం చేయాలి. జై హింద్!" అని అసదుద్దీన్ ఒవైసీ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు.
मैं हमारी रक्षा सेनाओं द्वारा पाकिस्तान में आतंकवादी ठिकानों पर किए गए लक्षित हमलों का स्वागत करता हूँ। पाकिस्तानी डीप स्टेट को ऐसी सख्त सीख दी जानी चाहिए कि फिर कभी दूसरा पहलगाम न हो। पाकिस्तान के आतंक ढांचे को पूरी तरह नष्ट कर देना चाहिए। जय हिन्द! #OperationSindoor
— Asaduddin Owaisi (@asadowaisi) May 7, 2025
ఇటీవల పహల్గాం దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా తాము మద్దతిస్తాం అన్నారు. హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, నేతలు, ప్రజలతో కలిసి పహల్గాం ఉగ్రదాడిని నిరిసిస్తూ ఇటీవల నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు. చెప్పినట్లుగానే.. పాకిస్తాన్, పీఓకేలో భారత బలగాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ను ఆయన సమర్థించారు. మరోసారి మనవైపు కన్నెత్తి చూడకుండా పాక్ ఉగ్రవాదులకు బుద్ధి చెప్పాలన్నారు. భారత బలగాలు చేపట్టిన ఆపరేషన్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
నేడు దేశంలో పలు ప్రాంతాల్లో మాక్ డ్రిల్
నేడు దేశ వ్యాప్తంగా సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్ర హోం శాఖ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఏపీ, తెలంగాణలో విశాఖపట్నం, హైదరాబాద్ ప్రాంతాల్లో మాక్ డ్రిల్ బుధవారం సాయంత్రం నిర్వహించనున్నారు. అందుకుగానూ పౌరులకు సూచనలు జారీ చేశారు. కానీ సివిల్ మాక్ డ్రిల్ కు ముందుగానే భారత సైన్యం పాకిస్తాన్, పీఓకేలోకి వెళ్లి 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడంలో విజయం సాధించాయని రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.






















