New Year Party Celebrations In Telangana : డిసెంబరు (December) 31 ఎప్పుడు వస్తుందా ? అని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కొత్త సంవత్సరానికి (New Year )స్వాగతం పలికి, పాత సంవత్సరానికి బై బై చెప్పేందుకు ప్రజలంతా వెయిట్ చేస్తున్నారు. నూతన సంవత్సర వేడుకలంటే...మాములుగా ఉండదు. విశ్వమంతా పార్టీ చేసుకుంటుంది. పబ్బు  (Pubs), క్లబ్బులు (Clubs), రెస్టారెంట్లు ఇలా ఒకటేమిటి...అన్ని జనంతో కిక్కిరిసిపోతాయి. న్యూ ఇయర్ పార్టీల కోసం పబ్బులు, క్లబ్బులు ప్రత్యేక ఆఫర్లతో ఆకర్షిస్తాయి. అన్ లిమిటెడ్ వైన్, ఫుడ్ అంటూ యువతను ఆకట్టుకున్నాయి. ఇప్పటికే కొన్ని పబ్బులు, క్లబ్బులు కొత్త సంవత్సరం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. గ్రూపులుగా వస్తే ఒక రకమైన చార్జీలు, ఇద్దరు ముగ్గురు కలిసి వస్తే ఇంకో రకమైన చార్జీలు వసూలు చేస్తున్నాయి. కొన్ని కళాశాలలకు చెందిన విద్యార్థులు..న్యూ ఇయర్ ను అంగరంగ వైభవంగా నిర్వహించుకునేలా ప్లాన్ చేసుకుంటున్నారు. పబ్బులు, క్లబ్బులను బుక్ చేసుకుంటున్నారు. 


కొత్త సంవత్సరాన్ని క్యాష్ చేసుకునేందుకు డ్రగ్ పెడ్లర్లు, డ్రగ్స్ ముఠాలు పని చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి భారీగా డ్రగ్స్ ను తెప్పించుకొని నిల్వ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. న్యూ ఇయర్ వేడుకల్లో మందుతో పాటు చాలా మంది మత్తు పదార్థాలను తీసుకుంటున్నారు. దీన్ని ఆసరాగా తీసుకునేందుకు డ్రగ్స్ మాఫియాలు పావులు కదుపుతున్నాయి. కొత్త సంవత్సరాన్ని మరపురాని విధంగా ఆస్వాదించేందుకు యువత ఎదురు చూస్తున్న యువతకు...ఆఫర్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని పబ్బులు, క్లబ్బులు డ్రగ్స్ కోసం కొన్ని సీక్రెట్ కోడ్స్ ను రెగ్యులర్ కస్టమర్లు పంపినట్లు సమాచారం. మరోవైపు తెలంగాణ పోలీసులు...కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో అలర్ట్ అయ్యారు. డ్రగ్స్ ముఠాలు హైదరాబాద్ వదిలిపోవాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్‌ కొత్త పోలీస్‌ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. డ్రగ్స్ ముఠాలపై ఉక్కుపాదం మోపుతామన్న ఆయన, పార్టీల పేరుతో డ్రగ్స్ వాడొద్దని వార్నింగ్ ఇచ్చారు. కొన్ని పబ్‌లలో డ్రగ్స్‌ వాడుతున్నారని, అది వెంటనే ఆపేయకపోతే కఠిన చర్యలు ఉంటాయన్నారు.  హైదరాబాద్‌ సిటీని డ్రగ్స్‌ ఫ్రీ సిటీగా చేయాలన్న లక్ష్యంతో  ప్రభుత్వం పని చేస్తోందన్నారు. 


హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ కావడం, తెలుగు సినీ ఇండస్ట్రీకి ఇదే హబ్ కావడం, జాతీయ, అంతర్జాతీయ రవాణా సౌకర్యాలు ఉండటంతో డ్రగ్స్ సరఫరా ఈజీగా జరుగుతోంది. దేశంలోనే తెలంగాణలో డ్రగ్స్ వినియోగం ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. నగరంలో జరిగే నేరాలకు డ్రగ్స్ వినియోగంతో ప్రత్యక్ష సంబంధాలున్నట్టు చాలా సార్లు బయటపడింది. పోలీసులు ఎంత నిఘా పెట్టినా రేవ్ పార్టీలను మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. ఇకపై తెలంగాణలో మత్తుమందు అనే పేరే వినపడకూడదని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. TS-NABలో ఖాళీల భర్తీకి కూడా సీఎం ఆమోదముద్ర వేశారు. మాదకద్రవ్యాల నేరగాళ్లు, అనుమానితులపై సాంకేతికంగా నిఘా పెట్టేందుకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మత్తుమందుల నియంత్రణకు అనుసరించాల్సిన విధానం, కావాల్సిన సదుపాయాలపై రెండ్రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. 


హైదరాబాద్ లో పాశ్చాత్య సంస్కృతి పెరుగుతుండటంతో డ్రగ్స్ కల్చర్ కూడా చాపకింద నీరులా విస్తరిస్తోంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మాదక ద్రవ్యాలతోపాటు, స్థానికంగా లభించే గంజాయి వంటివాటి వినియోగం కూడా పెరుగుతోంది. ఆన్ లైన్ లో కూడా గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యాపారాన్ని నడుపుతున్నారు. అరెస్ట్ లు సహజమే కానీ, దీన్ని పూర్తిగా అరికట్టడం మాత్రం సాధ్యం కావడంలేదు. కొత్త సంవత్సర వేడుకలు కూడా వస్తుండటంతో...ఒక వైపు డ్రగ్స్ పెడ్లర్లు, మరోవైపు పోలీసులు...ఎవరు ఎవరిపై పైచేయి సాధిస్తారో చూడాలి.