New Ration Cards Telangana : తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త చెప్పింది. త్వరలోనే కొత్త రేషన్ కార్డుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి కొత్త కార్డులు జారీ చేస్తామని ప్రకటించారు. దీంతో ఆశావహుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. గత ప్రభుత్వ హయాం నుంచి కొత్త రేషన్ కార్డులు కోసం బిపిఎల్ కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాము అధికారంలోకి రాగానే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తరువాత లోక్ సభ ఎన్నికలు, ఇతర గ్యారెంటీల అమలుపై దృష్టి సారించిన రేవంత్ రెడ్డి సర్కారు రేషన్ కార్డుల జారీ ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేషన్ కార్డుల మంజూరు కు సంబంధించిన ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో ఆశావహుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. కొత్త కార్డుల మంజూరుపై మంత్రివర్గ సమావేశంలో చర్చించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో 55 లక్షల కార్డులు కేంద్ర ప్రభుత్వం జారీ చేసినవి కాగా, రాష్ట్ర ప్రభుత్వం 35 లక్షల కార్డులను జారీ చేసింది. కొత్త కార్డుల కోసం పోర్టల్ ఓపెన్ చేస్తే మరో 10 లక్షలు కుటుంబాల నుంచి దరఖాస్తులు వస్తాయని పౌర సరఫరాల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 


ప్రత్యేక కౌంటర్లు పెట్టి దరఖాస్తులు స్వీకరణ..


రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ఆరు గ్యారెంటీల అమలుకుగాను ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. అయితే, గ్యారెంటీల ప్రొఫార్మాలో కొత్త రేషన్ కార్డుల ప్రస్తావన చేయలేదు. కానీ ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. తెల్ల కాగితాలపై రాసి ఇచ్చిన దరఖాస్తులను తీసుకున్నారు.  మీ సేవలో పోర్టల్ మాత్రం ఓపెన్ చేయలేదు. ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత మీ సేవ పోర్టల్ ఓపెన్ చేసి కొత్తగా దరఖాస్తులు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే రేషన్ కార్డులో అదనపు కుటుంబ సభ్యులను చేర్చుకోవడానికి కూడా దరఖాస్తులు వస్తున్నాయి. అంటే ఒక కుటుంబంలో భార్య, భర్త, ఇద్దరు పిల్లలు ఉంటే.. భార్య, భర్త పేర్లు కార్డులో ఉండి పిల్లల పేర్లు లేకపోయినా, ఇద్దరు పిల్లల్లో ఒకరి పేరే ఉన్న మెంబర్ ఎడిషన్ ప్రొఫార్మాలో తీసుకుంటారు. అయితే, మీ సేవలో మెంబర్ ఎడిషన్ పోర్టల్ ఓపెన్ చేసి ఉంది. ఈ పోర్టల్ లో ఇప్పటి వరకు 11 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కొత్త కార్డులు ఇచ్చే సమయంలో మెంబర్ ఎడిషన్ పై కూడా నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఈ రెండు ప్రక్రియలు పూర్తి చేస్తే రేషన్ కార్డుల సమస్య దాదాపుగా కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాగా రాష్ట్రంలో బిపిఎల్ కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కోటాలో ఉన్న 35 లక్షల రేషన్ కార్డులు కూడా సెంట్రల్ కోటాలోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది. కానీ కేంద్రం నుంచి ఇంత వరకు ఎలాంటి స్పందన రాలేదు. దీనిపై ఏం చేయాలన్న దానిపైన కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది.