Harish Rao On Musi Project: మూసీ ప్రక్షాళన కాదు.. ఇది రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దోపిడీ: హరీష్ రావు
Musi Riverfront Project | సీఎం రేవంత్ రెడ్డి ఏ అడుగువేసినా దాని వెనుక రియల్ ఎస్టేట్ దోపిడీ ఉంటుందని, మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లను కూల్చడం ఎంతవరకు కరెక్ట్ అని హరీష్ రావు ప్రశ్నించారు.

BRS vs Congress | హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ వ్యాపార ప్రయోజనాలే ఉంటున్నాయని, ఆయన ప్రతి అడుగులోనూ భూముల పంచాయతీలు, రియల్ ఎస్టేట్ దోపిడీ దాగి ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. గతంలో సెంట్రల్ యూనివర్సిటీ భూములను లాక్కోవాలని ప్రయత్నిస్తే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందని, అటు ఎల్టీపీఎస్ భూములను కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూశారని ఆరోపించారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పేరుతో ఇండ్లు కోల్పోతున్న హైదర్ షా కోట్ లోని మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్ బాధిత కుటుంబాలను మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు పరామర్శించారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి తీరు చేస్తున్నది మూసీ సుందరీకరణ కాదని, పేదల ఇళ్లను కూల్చి కార్పొరేట్ శక్తులకు భూములను కట్టబెట్టే రియల్ ఎస్టేట్ దోపిడీ అని ఆరోపించారు. ‘రేవంత్ రెడ్డి వేసే ప్రతి అడుగు వెనుకా భూముల కబ్జాలు, వ్యాపార ప్రయోజనాలే కనిపిస్తున్నాయని విమర్శించారు. గతంలో కేసీఆర్ ఫార్మాసిటీ కోసం 14,000 ఎకరాలు సేకరిస్తే, రేవంత్ రెడ్డి దాని పేరును 'ఫోర్త్ సిటీ'గా మార్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఇప్పుడు మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లు కూల్చి, భూములు లాక్కొని వాటిని అంబానీ, అదానీ లేదా మెగా కృష్ణారెడ్డి లాంటి బడా బాబులకు కట్టబెట్టాలని చూస్తున్నారు. మీ జేబులు నింపుకోవడానికి చేసే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అన్నారు.
కేసీఆర్ పాలన వర్సెస్ రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దోపిడీ..
కేసీఆర్ పాలనలో మంచినీళ్లు ఇచ్చి ప్రజల జీవితాలను నిలబెట్టారని, కానీ నేడు రేవంత్ రెడ్డి బుల్డోజర్లతో వారి జీవితాలను కూలగొడుతున్నారని హరీష్ రావు మండిపడ్డారు. మధు పార్క్ అపార్ట్‌మెంట్‌తో కేసీఆర్‌కు ఎంతో అనుబంధం ఉందని, గతంలో ఇక్కడ నీటి సమస్య ఉంటే ప్రత్యేక పైపులైన్ వేయించి పరిష్కరించారని గుర్తు చేశారు. కేసీఆర్ ఎప్పుడూ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాలని ఆలోచిస్తే, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం జేసీబీలతో భయాందోళనలు సృష్టిస్తోందని హరీష్ రావు దుయ్యబట్టారు. మూసీ శుద్ధికి తాము వ్యతిరేకం కాదని, కేసీఆర్ హయాంలోనే ఎస్టీపీల నిర్మాణం చేపట్టామని, కానీ ఒక్క ఇల్లు కూడా కూల్చాలనే ఆలోచన చేయలేదని విమర్శించారు.
పాలసీ లేని ప్రాజెక్టు.. ప్రజాధనం దుర్వినియోగం
ప్రాజెక్టుకు సంబంధించి కనీస డీపీఆర్ (DPR) లేదని, ఎఫ్‌టీఎల్ (FTL) ఖరారు కాలేదని, పర్యావరణ అనుమతులు కూడా లేకుండా నోటీసులు ఎలా ఇస్తారని హరీష్ రావు ప్రశ్నించారు. ‘చదువుకునే పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడానికి, రైతులకు రైతుబంధు ఇవ్వడానికి డబ్బుల్లేవని చెప్పే ముఖ్యమంత్రికి.. వందల కోట్లతో కొత్త క్యాంపు ఆఫీసులు కట్టుకోవడానికి, మెస్సీతో మ్యాచ్‌లకు పైసలెక్కడివి?’ అని ఆయన నిలదీశారు. బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తూ, పేదల ఇళ్లు కూల్చడం దారుణం అన్నారు.
బాధితుల పక్షాన బీఆర్ఎస్ న్యాయపోరాటం
తమ ఇండ్లు కూల్చే బదులు మా నీళ్ల ట్యాంకులో విషం కలిపి చంపండి అని ఇక్కడి తల్లులు ఆవేదన చెందుతున్నా రేవంత్ ప్రభుత్వానికి కనికరం లేకపోవడం దుర్మార్గమని హరీష్ రావు అన్నారు. మధు పార్క్ అపార్ట్‌మెంట్‌కు ఇచ్చిన నోటీసులను బేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాబోయే బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో బాధితుల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీస్తామని, కేసీఆర్ ఆదేశాల మేరకు చట్టపరంగా పూర్తి స్థాయి పోరాటం చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
సంక్షేమానికి లేని నిధులు.. విలాసాలకు ఎక్కడివి?
రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక హైదరాబాద్‌లో కొత్తగా కట్టిన ఇల్లు ఒక్కటి కూడా లేదు, కానీ కూల్చిన ఇళ్లు, చిధ్రం చేసిన బతుకులు మాత్రం ఎన్నో ఉన్నాయని హరీష్ రావు అన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వమన్నా, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు అడిగినా, రైతులకు రైతుబంధు ఇవ్వమన్నా ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవని చెబుతున్నారు. గురుకులాల్లో సరైన భోజనం లేక 162 మంది విద్యార్థులు చనిపోయినా పట్టించుకోకుండా, రాష్ట్రం దివాలా తీసింది నన్ను కోసుకు తింటారా అని సీఎం మాట్లాడుతున్నారు. మరి సంక్షేమానికి నిధులు లేనప్పుడు మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు, మిస్ వరల్డ్ పోటీలకు వందల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? జూబ్లీహిల్స్‌లో రూ. 100 కోట్లతో సీఎం క్యాంపు ఆఫీస్, రూ. 5 కోట్లతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మూడో క్యాంపు ఆఫీస్ కట్టుకోవడానికి పైసలెక్కడివి?’ అని హరీష్ రావు ప్రశ్నించారు.
మూసీ ప్రాజెక్టుతో ఎవరి జేబులు నింపుతారు..?
‘బడా కాంట్రాక్టర్లకు రూ. 20,000 కోట్ల బిల్లులు చెల్లించారు. ఇప్పుడు ఎవరి జేబులు నింపడానికి మూసీ ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నారు? పేదలకు ఇవ్వడానికి లేని డబ్బులు వీరికి ఇవ్వడానికి రేవంత్ రెడ్డి దగ్గర ఎక్కడి నుంచి వస్తున్నాయి?. మేం మూసీ నది శుద్ధికి వ్యతిరేకం కాదు. ఎస్టీపీలు (STP) కట్టి మురుగునీరు రాకుండా చేయండి, కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం పైపులైన్ల ద్వారా గోదావరి నీళ్లను తెచ్చి మూసీని ప్రక్షాళన చేయండి. కానీ మూసీ అభివృద్ధి పేరుతో పేదల ఇళ్లను కూల్చడాన్ని మాత్రం బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని’ హరీష్ రావు స్పష్టం చేశారు.
























