Tellam Venkata Rao Meets Revanth Reddy: బీఆర్ఎస్ కు చెందిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఇలా ఆయన సీఎంను కలవడం ఇది రెండోసారి. తాజాగా కుటుంబసభ్యులతో సహా వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. వారితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా ఉన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలంటూ ఓ వినతిపత్రాన్ని రేవంత్ రెడ్డికి తెల్లం వెంకట్రావు అందజేశారు.
గతంలో గులాబీ పార్టీలోనే ఉన్న తెల్లం వెంకట్రావు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రస్తుత రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డితో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. కానీ, కాంగ్రెస్‌లో ఆయనకు సీటు దక్కలేదు. అనంతరం బీఆర్ఎస్‌లో చేరి టికెట్ దక్కించుకొని గెలిచారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ నియోకవర్గాలు ఉండగా.. భద్రాచలంలో మాత్రమే బీఆర్‌ఎస్ విజయం సాధించింది.
కొంతకాలంగా ఈ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ లో చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని రెండోసారి కలవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. పార్లమెంటు ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీలోకి ఇప్పటికే ఇతర పార్టీల నుంచి చేరికలు ప్రారంభం అయ్యాయి. తాజాగా అందుకే తెల్లం వెంకట్రావు కూడా హైదరాబాద్‌లో సీఎంను కలిసి చర్చలు జరిపినట్లు భావిస్తున్నారు.