(Source: ECI | ABP NEWS)
Telangana Latest News: తెలంగాణలో మంత్రి వర్సెస్ ఐఏఎస్- వీఆర్‌ఎస్ కోసం రిజ్వీ అప్లికేషన్- ఆమోదించొద్దని సీఎస్‌కు జూపల్లి లేఖ
Telangana News: తెలంగాణలో ఈ మధ్య కాలంలో ప్రభుత్వంలో చాలా వివాదాలు జరుగుతున్నాయి. మొన్నటి వరకు మంత్రుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇప్పుడు ఐఏఎస్ అధికారి రిజ్వి , మంత్రి జూపల్లి మధ్య పంచాయితీ మొదలైంది.

Telangana Latest News: తెలంగాణలో ఆబ్కారీ శాఖలో మంత్రి జూపల్లి కృష్ణారావుకు, ఉన్నతాధికారులకు అసలు పడటం లేదని ఆలస్యంగా వెలుగు చూసింది. వీఆర్‌ఎస్‌కు సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ దరఖాస్తు పెట్టుకోవడంతో మొత్తం వివాదం వెలుగులోకి వచ్చింది. మంత్రితో సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ, కమిషనర్ హరికిరణ్ మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోందని తేలింది. రిజ్వీ వీఆర్‌ఎస్‌ను ఆమోదించొద్దని మంత్రి లేఖ రాయడంతో పంచాయితీ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. రిజ్వీపై మంత్రి జూపల్లి సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఇదే తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారుతోంది.
అబ్కారీశాఖప్రధాన కార్యదర్శిగా ఉన్న సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వ్యక్తిగత కారణాలతోనే తప్పుకుంటున్నట్టు పేర్కొన్నారు. కానీ ఇప్పటికే పలు మార్లు బదిలీలు, పని చేయనీయడం లేదన్న అసంతప్తిని సన్నిహితుల వద్ద వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అవేమీ వీఆర్‌ఎస్‌లో పేర్కొనకుండా కేవలం వ్యక్తిగత కారణాలతో తప్పుకుంటున్నట్టు వివరించారు. దీనికి అనుమతి ఇవ్వాలని కూడా సీఎస్‌కు విజ్ఞప్తి చేశారు.
రిజ్వీ వీఆర్‌ఎస్‌పై మంత్రి జూపల్లి కృష్ణారావు సీఎస్‌కు సంచలన లేఖ రాశారు. రిజ్వీ వీఆర్‌ఎస్‌ను ఆమోదించవద్దని విజ్ఞప్తి చేశారు. ఆయన అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా అక్రమాలకు పాల్పడినట్టు కూడా లేఖలో పేర్కొన్నారు. విధుల్లో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారని కూడా లేఖలో పేర్కొన్నారు. మంత్రిగా తన విధులకు ఆటంకం కలిగించారని తెలిపారు. దీంతోపాటు శాఖలో ఆయన చేసిన కొన్ని పనులను మంత్రి సీఎస్ దృష్టికి తీసుకొచ్చారు. మద్యం బాటిళ్లపై హోలోగ్రామ్ వేసే కాంట్రాక్‌ను 11 ఏళ్లు ఒకే కంపెనీకి ఇస్తున్నారని గుర్తు చేశారు. ఇది మరింత భద్రతతో, లేబుల్స్ మార్చి టెండర్లు పిలవాలని చెప్పినా పట్టించుకోలేదన్నారు. పాతవారికే అవకాశాలు ఇస్తూ వస్తున్నారని లేఖలో తెలిపారు.
చిట్టీ సృజన్ కేసులో బకాయిలు,కాంపౌండింగ్ ఫీజు విషయంలో ఇచ్చిన సూచనలను రిజ్వి పెడచెవిన పెట్టారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాప్రికార్న్ బ్లెండర్స్ నుంచి కూడా 6.15 కోట్లు డిమరేజ్ ఛార్జీలను చట్టవిరుద్ధంగా వసూలుకు సంబంధించిన ఫైల్స్ ఇవ్వడానికి కూడా నిరాకరించినట్టు పేర్కొన్నారు. టీజీబీసీఎల్ ఎండీ అడిగిన వివరాలు ఇవ్వలేదు, ఏబీడీ లిమిటెడ్ కంపెనీ మద్యం ఉత్పత్తి, గరిష్ట అమ్మకం ధర విషయంలో కూడా జాప్యంతో ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం జరిగిందని తెలిపారు. ప్రతి ఫైల్‌ను సీఎంవోకు పంపుతున్నారని మరో ఫిర్యాదు చేశారు. ప్రతి పని కూడా మంత్రిమండలి ఆమోదం కావాలని చెప్పడం కూడా బాగా లేదన్నారు జూపల్లి. దీని వల్ల పనుల్లో జాప్యం జరుగుతోందని సీఎస్‌కు తెలిపారు. ఇలా ప్రతి పని కూడా సీఎంవోకు, మంత్రిమండలికి సిఫార్స్ చేసి అధిక భారం మోపుతున్నారని వివరించారు. రిజ్వీ చేసిన జాప్యం కారణంగా రాష్ట్ర ఖజానాకు చాలా నష్టం జరుగుతుందని తన లేఖలో వెల్లడించారు.
ఇలా ఐఏఎస్ అధికారి, మంత్రి మధ్య నెలకొన్న వివాదం ఇప్పుడు ప్రతిపక్షాలకు మరో ఆయుధం ఇచ్చినట్టు అవుతోంది. ఇప్పటి వరకు మంత్రుల మధ్య గిల్లికజ్జాలను పరిష్కరించలేక తలనొప్పి వస్తుంటే ఇప్పుడు శాఖల్లో ఇలా జరగడం ప్రభుత్వాన్ని కంగారు పెట్టిస్తోంది.




















