తెలంగాణలో కేసీఆర్ సైన్యం ఉందని, చావడానికైనా చంపడానికైనా సిద్ధమని క్రీడలశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను జాతీయ స్థాయిలో ఎదగనివ్వకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఏపీలో చదువు రాని వాళ్లని కూడా ఆరోగ్యశాఖకు మినిస్టర్లను చేశారని ఎద్దేవా చేశారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ అన్ని అంశాల మీద పట్టు ఉన్న వారికి పదవులు ఇస్తున్నారని చెప్పారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ గా ఈడిగ ఆంజ‌నేయ గౌడ్ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. త్వరలోనే తెలంగాణలో క్రీడా పాలసీని తీసుకొస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.


బీజేపీ నేతలు ఆరోపిస్తున్నట్లుగా కాంగ్రెస్‌ పార్టీతో బీఆర్‌ఎస్‌ పొత్తు ప్రసక్తే లేదని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తేల్చి చెప్పారు. 2023లో అతి పెద్ద జోక్‌ ఇదేనని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఒంటిరిగానే పోటీ చేస్తుందని అన్నారు. తమకు ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పోలవరం విషయంలో సీఎం కేసీఆర్‌ విశాల దృక్పథంతో పని చేస్తారని చెప్పుకొచ్చారు. పీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మాణిక్కం ఠాకూర్‌ను తొలగించడం కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత వ్యవహారమని చెప్పారు. దానితో తమకు సంబంధం లేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు.


రాష్ట్రంలో సకలజనుల సంపద పెరిగి అందరూ ఆనందంగా ఉన్నారని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ ఈడిగ ఆంజనేయ గౌడ్ అన్నారు. సంపద పెరిగింది కాబట్టి గ్రామాలు ఆనంద నిలయలుగా మారాయని అన్నారు. వెయ్యికి పైగా గురుకుల పాఠశాల ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నారని గుర్తు చేశారు. ఈ 8 ఏళ్లలో కేంద్రం సహకరించకపోయినా కేసీఆర్ అన్ని అడ్డంకులను అధిగమించి దేశానికి ఆదర్శంగా తెలంగాణను తీర్చిదిద్దారని ఆంజనేయ గౌడ్ అన్నారు. క్రీడా రంగానికి కేసీఆర్ పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందిస్తున్నారని అన్నారు. అత్యంత వెనుకబడిన ప్రాంతం, బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తిగా తనకు ఈ అవకాశం కల్పించినందుకు కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ క్రీడా రంగాన్ని దేశానికే తల మానికంగా తీర్చిదిద్దే విధంగా పనిచేస్తానని ఆంజనేయ గౌడ్ అన్నారు.