తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు అరెస్టుపై ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాకూర్ స్పందించారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టింగులు చేసినందుకు సునీల్ కార్యాలయంపై దాడులు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఆయన కార్యాలయంలో 50 కంప్యూటర్లను పోలీసులు ఎ్తతుకెళ్లారని ఆరోపించారు. ఇంకో ఐదుగురు తమ పార్టీ నేతలను కూడా అక్రమంగా అరెస్టు చేశారని, కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని అన్నారు. ఇప్పుడు తాను కూడా అవే పోస్టింగులు చేస్తున్నానని తనను కూడా అలాగే అరెస్టు చేయాలని ఛాలెంజ్ చేశారు. ఈ మేరకు మాణిక్కం ఠాకూర్ ట్వీట్ చేశారు.






కాంగ్రెస్​ పార్టీ రాజకీయ వ్యూహకర్త ​సునీల్ కార్యాలయం ఉన్న మాదాపూర్ ఇనార్బిట్ మాల్ సమీపంలో ఉండగా, అందులో సోదాలు జరిగాయి. సీఎం కేసీఆర్​ కు, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ లు పెడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ రైడ్స్​ జరిగినట్లుగా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. సోదాల సందర్భంగా సునీల్​ కార్యాలయంలోని సిబ్బంది సెల్ ఫోన్లను పోలీసులు స్విచ్చాఫ్​ చేయించారు. ఆఫీసులోని కంప్యూటర్లు, ల్యాప్​ టాప్​ లు స్వాధీనం చేసుకున్నారు. సునీల్​ కనుగోలు టీమ్​ గత కొంత కాలంగా కాంగ్రెస్ కోసం పని చేస్తూ ఉంది.


కానీ, పోలీసుల వాదన మరోలా ఉంది. సునీల్​ కనుగోలు కార్యాలయం నుంచి ఫేక్ సోషల్​ మీడియా ప్రొఫైల్స్​ తో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్​ మీడియా పోస్టులు పెడుతున్నారని పోలీసులు చెప్పారు. ​తమ దగ్గర ఐదారు ఎఫ్​ఐఆర్​ లు ఉన్నాయని.. వాటి ఆధారంగా సోదాలకు వచ్చామని అన్నారు. సోదాలకు వచ్చేటప్పుడు ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని పోలీసులు చెప్పారు.