LB Nagar Police Constable Suicide: హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో ఒక కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర కలకలం సృష్టించింది. రాత్రి డ్యూటీలో ఉన్న జె. సాయి కుమార్ అనే కానిస్టేబుల్ తెల్లవారుజామున సుమారు 2:30 గంటల ప్రాంతంలో ఎల్బీనగర్‌ ఏసీపీ కార్యాలయంలోని రెస్ట్‌ రూమ్‌లో ఉరివేసుకుని కనిపించాడు. గమనించిన తోటి సిబ్బంది వెంటనే ఆయనను కామినేని ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే మృతి చెందినట్లు నిర్దారించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. 2024 బ్యాచ్‌కు చెందిన సాయికుమార్‌ను ప్రస్తుతం ఈ-కాప్స్ డ్యూటీ నిమిత్తం ఎల్బీనగర్‌ ఏసీపీ ఆఫీసుకు అటాచ్‌ చేశారు. ఆయన కర్మన్‌ఘాట్‌లో స్నేహితులతో కలిసి నివాసముంటుండగా ఈ ఘోరం జరిగింది.

Continues below advertisement

మరోవైపు ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఎల్బీనగర్‌ పోలీస్‌ స్టేషన్ ఎదుట భారీ ఆందోళనకు దిగారు. సాయికుమార్ ఆత్మహత్య చేసుకోలేదని, మృతదేహంపై, ఘటనా స్థలంలో రక్తపు మరకలు ఎలా వచ్చాయంటూ పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. వందల మంది ఆందోళనకారులు పీఎస్‌ వద్దకు చేరుకుని ధర్నా చేపట్టడమే కాకుండా, ఒక దశలో స్టేషన్‌లోకి దూసుకెళ్లి కంప్యూటర్లు, ప్రింటర్లను ధ్వంసం చేశారు. దీనితో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల అసలు కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

Continues below advertisement