KTR Tweet on Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి ట్విట్టర్ లో విమర్శలు గుప్పించారు. వీలు చిక్కిన ప్రతి సందర్భంలోనూ కేటీఆర్ ప్రశ్నల వర్షాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కేటాయింపులు, పొరుగు రాష్ట్రాలకు మోదీ కేటాయింపులపై తరచూ తనదైన శైలిలో వ్యంగ్యంగా విమర్శలు చేసే కేటీఆర్.. మరోసారి ప్రధాని మోదీపై విమర్శలు చేశారు.






మోదీకి నోబెల్ బహుమతి ఎందుకు ఇవ్వకూడదు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆర్థిక, శాంతి, వైద్య, భౌతిక శాస్త్ర రంగాల్లో మోదీకి నోబెల్ బహుమతి ఎందుకు ఇవ్వకూడదని అంటూ కేటీఆర్ ప్రశ్నలు గుప్పించారు. కరోనా వ్యాక్సిన్ కొనుగోలు చేయడంలో వైద్య రంగంలో మోదీ నోబెల్ కు ఇవ్వకూడదా అంటూ ఎద్దేవా చేశారు. నోట్ల రద్దు, స్విస్ బ్యాంకు నుండి డబ్బులు దేశానికి తిరిగి తీసుకువచ్చినందుకు గాను ఆర్థిక శాస్త్రంలో నరేంద్ర మోదీకి  నోబెల్ ఇవ్వాల్సిందేనని అన్నారు. అలాగే ఉక్రెయిన్- రష్యా దేశాల మధ్య యుద్ధాన్ని 6 గంటల పాటు ఆపినందుకు మోదీకి శాంతి బహుమతి ఇవ్వాలన్నారు. రాడార్ సిద్ధాంతానికి గానూ భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకోవడానికి మోదీ అన్ని రకాలుగా అర్హుడని కేటీఆర్ ట్విట్టర్ లో ఎద్దేవా చేశారు.






రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రంపై పోరాటం
మోదీ ప్రభుత్వంపై కేటీఆర్ ట్విట్టర్ లో ప్రశ్నల వర్షం కొనసాగిస్తున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేటీఆర్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీపై, బీజేపీ నాయకులపై విమర్శలు చేస్తున్నారు. దేశానికి చెందిన వివిధ అంశాలపైనా కేటీఆర్ విమర్శలు చేస్తున్నారు. దేశ ఆర్థిక పరిస్థితిపై, రోజురోజుకూ పడిపోతున్న రూపాయి విలువపైనా విమర్శలు గుప్పిస్తున్నారు. దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగం, దాయాది దేశాలతో పోలిస్తే పడిపోతున్న భారత ర్యాంకు వంటి అంశాలపై విమర్శిస్తున్నారు.






అలాగే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పై కూడా మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు. మోదీ సర్కార్ గురించి ఉపన్యాసాలు చేస్తున్నారు కాబట్టి వాస్తవాలను గమనించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం దేశానికి అందించే ప్రతి రూపాయికి, కేంద్రం తిరిగి తెలంగాణకు కేవలం 46 పైసలు మాత్రమే ఇస్తోందని గణాంకాలతో సహా వివరించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలన్నీ తెలంగాణకు ధన్యవాదాలు చెప్పాలని కోరారు.