హైదరాబాద్‌లో చార్మినార్‌ వంటి అరుదైన నిర్మాణాలకు దీటుగా బన్సీలాల్ పేట మెట్లబావి పర్యాటకేంద్రం కానుంది. 300 వందల సంవత్సరాల క్రితం నాటి బన్సిలాల్ పేట మెట్లబావిని పునరుద్దరించారు. తెలంగాణ రాష్ట్రప్రభుత్వం, GHMC, HMDA సంయుక్తంగా దీన్ని పునరుద్దరణ కార్యక్రమాలు చేపట్టారు. దాదాపు 8నెలలు అధికారులు, సిబ్బంది శ్రమించి ఈ బావికి పూర్వవైభవాన్ని తీసుకొచ్చారు. 


బన్సీలాల్ పేట మెట్లబావి కొత్త అందాలతో ముస్తాబైంది. ఈ బావిని నాగన్న కుంట బావి అని కూడా అంటారు. ఒకప్పుడు దీన్ని నీటి వినియోగానికి కూడా వాడేవారు. ఈ బావి 30.5 మీటర్ల పొడవు, 19.2 అడుగుల వెడల్పు, 53 అడుగుల లోతుతో 3శతాబ్దాల క్రితం దీన్ని నిర్మించారు. ఈ మెట్ల బావిని మున్సిపల్ శాఖామంత్రి కేటిఆర్ పున: ప్రారంభించనున్నారు. గతంలో ఒకసారి మన్ కీ బాత్ లో కూడా ప్రధానమంత్రి నరేంద్రమోడి కూడా ప్రస్తావించారు. 


సికింద్రాబాద్ , బన్సీలాల్  పేటలోని 17వ శతాబ్ద కాలంనాటి మెట్లబావి చారిత్రాత్మక కట్టడాల్లో ఓ వినూత్న నిర్మాణం. ఏకంగా 22లక్షల త్రాగునిటిని తనలో నింపుకున్న అరుదైన కట్టడం.. అంతటి ప్రసిద్ది చెందిన బన్సీలాల్ పేట మెట్ల బావి, దాదాపు నలభై ఏళ్లపాటు పాలకుల నిర్లక్ష్యానికి పాడుబడి, పూర్తిగా కనుమరుగైయ్యే దుస్థితికి చేరుకుంది. రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ అనే స్వచ్చంద సంస్థ రంగంలోకి దిగి, జిహెచ్ ఎంసీ , తెలంగాణ ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తూ సమిష్టిగా ఓ మహా అద్భుతానికి తుది మెరుగులు దిద్దింది. చరిత్రలో కనుమరుగైన బన్సీలాల్ పేట మెట్లబావికి తిరిగి పూర్వ వైభవం రానుంది. 


మెట్ల బావి నేపథ్యం ఇది...
ఒకప్పుడు ఈ మెట్లబావి ప్రాంతాన్ని నాగన్నకుంట అని కూడా అనేవారు. 2021లో పాడుబడిన స్థితిలో ఉన్న మెట్లబావి వద్ద పరిస్థితి చూసి, ఏం చేద్దాం..ఈ ప్రాంతాన్నిఎలా అభివృద్ది చేద్దామని ప్రయత్నిస్తే బావిని తిరిగి పునరుద్దరిద్దాం అనే దాని కంటే కమ్యూనిటీ హాల్,గోషాల ఇలా రకరకాల సలహలు ఇచ్చినవారే తప్ప గ్రౌండ్ వాటర్ ను రీస్టోర్ చేద్దాం, మెట్లబావికి తిరిగి ఊపిరిపోద్దాం.. భావితరాలకు భూగర్భజలాల లభ్యతకు లోటు లోకుండా చేద్దాం అనేలా ఆలోచించిన వారు తక్కువ మందే అని చెప్పవచ్చు.అయితే ఈ మెట్లబావికి తిరిగి పూర్వ వైభవం తెచ్చి అరుదైన పర్యాటక ప్రాంతంగా తీర్చదిద్దుదాం అనే దిశగా ముందుకు సాగారు హైదరాబాద్ జిహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ సంస్థ నిర్వాహకులు. 


నలభైఏళ్లపాటు పాడుబడిన మెట్లబావి నుంచి ఏకంగా రెండువేల టన్నుల చెత్తను బయటకు తీశారు. ఈ క్రమంలో వినాయకుడు, హనుమంతుడు వంటి పురాతన విగ్రహాలు పాడుబడిన బావి నుంచి బయటపడ్డాయి. అలా ఒక్కమాటలో చెప్పాలంటే మెట్లబావికి తిరిగి కొత్తరూపు తెచ్చేందుకు ఎనిమిది నెలలపాటు ఓ మహాయజ్హమే జరిగింది.


గతంలో బావి నిర్లక్ష్యానికి గురైన తరువాత క్షణికావేశంలో చుట్టుప్రక్కలవారు ఇదే బావిలో దూకి ప్రాణాలు కోల్పోయేవారు. కొన్నాళ్లు ఓ సూసైడ్ స్పాట్ గా మారింది. ఈసారి ఆ పరిస్దితి రాకుండా బావిలోకి ఎవరూ దూకి ఆత్మహత్యలు చేసుకునే అవకాశం లేకుండా చుట్టూ ఎతైన ఫెన్షింగ్ ఏర్పాటు చేసారు. బావికి ఓవైపున వ్యూవింగ్ గ్యాలరీ ఏర్పాటు చేసారు. ఇక్కడి నుంచి చూస్తే బావి చూట్టూ ఓ సుందర ఆహ్లాదరక వాతావారణం ఉండేలా గ్రీనరీతో, లైటింగ్, అండర్ వాటర్ లైటింగ్, నైట్ ఎఫెక్ట్స్, స్టీట్ లైటింగ్‌తో తీర్చి దిద్దారు. 


నగరానికి వచ్చే పర్యాటకులకు కచ్చితంగా ఓసారి చూడాలనిపించేలా అత్యంత సుందరంగా, అద్భతంగా మెట్లబావికి పర్యాటక సొగసులు జోడించారు. ఇక్కడకు వచ్చేవారు, స్కూల్ విద్యార్దులు మెట్లబావి చరిత్రను తెలసుకునేలా ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేశారు.ఇలా ఒకప్పుడు ఎవరూ పట్టించుకోకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిన ఈ చారితాత్మక కట్టడానికి తిరిగి పూర్వవైవం తేవడమే కాదు ,భవిష్యత్ లో బావి నిర్లక్ష్యానికి గురికాకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు.