తెలంగాణ కాంగ్రెస్‌ నూతన ఏఐసీసీ ఇన్‌ఛార్జ్‌ బీఎం సందీప్‌ కుమార్‌ ముందు సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు కావస్తున్న తరుణంలో పార్టీ బాధ్యతలు చేపట్టిన ఆయనకు సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వానికి, పార్టీ నాయకత్వానికి మధ్య సమన్వయం సాధించడం కీలకంగా మారింది. ఇప్పటికే పలువురు ఇన్‌ఛార్జ్‌లు మారినా పరిష్కారం కాని సమస్యలు ఇప్పుడు సందీప్‌ ముందుకు వచ్చాయి. మరి ఆయన ఈ సవాళ్లను ఎలా అధిగమిస్తారు? పార్టీని, ప్రభుత్వాన్ని కలుపుకుంటూ ఎలా ముందుకు తీసుకెళ్తారు?

Continues below advertisement

పదవుల కోసం ఎదురుచూపులు.. అసంతృప్తికి పరిష్కారం ఏంటి?

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా పార్టీలోని కొందరు నాయకులకు ఇంకా తగిన గుర్తింపు దక్కలేదనే అసంతృప్తి ఉంది. పీసీసీ కార్యవర్గంలో కీలక పదవులు, వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, వివిధ కమిటీల నియామకాలు, నామినేటెడ్‌ పోస్టుల భర్తీ కోసం చాలామంది నేతలు ఎదురుచూస్తున్నారు. మంత్రివర్గ విస్తరణపైనా ఆశావహులు గంపెడాశలు పెట్టుకున్నారు. గతంలో పలుమార్లు జాబితాలపై కసరత్తు జరిగినా నియామకాలు పూర్తిస్థాయిలో కొలిక్కి రాలేదు. ఇప్పుడు కొత్త ఇన్‌ఛార్జ్‌ రావడంతో మళ్లీ మొదటి నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుందా? లేక ఇప్పటికే సిద్ధమైన జాబితాలకు ఆమోదం లభిస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

Continues below advertisement

పార్టీ కోసం కష్టపడిన పాత నాయకులు, కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న డిమాండ్‌ కూడా బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పదవుల పంపిణీలో సామాజిక, ప్రాంతీయ సమీకరణాలతో పాటు పార్టీకి చేసిన సేవలను పరిగణనలోకి తీసుకోవడం సందీప్‌కు కీలక పరీక్ష కానుంది.

ఎమ్మెల్యేల అసంతృప్తికి చెక్‌ పెడతారా?

అధికార పార్టీలోనే కొందరు ఎమ్మెల్యేలు ప్రభుత్వ నిర్ణయాలపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడం కాంగ్రెస్‌ నాయకత్వానికి ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశమయ్యాయి.

తమ నియోజకవర్గాలకు అభివృద్ధి నిధుల కేటాయింపు, మంత్రుల నుంచి సహకారం, ప్రభుత్వంలో తమకు దక్కుతున్న ప్రాధాన్యతపై కొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మునుగోడు అభివృద్ధి పనులు, చౌటుప్పల్‌ ఆసుపత్రి, రహదారులు, సాగునీటి ప్రాజెక్టులు వంటి అంశాలను రాజగోపాల్‌ రెడ్డి ప్రస్తావించారు.

మరోవైపు పార్టీ అంతర్గత అంశాలపై అనిరుధ్‌ రెడ్డి కూడా తన అభిప్రాయాలను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. ఇలాంటి పరిస్థితుల్లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యేలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించడం సందీప్‌ ముందున్న తక్షణ బాధ్యత.

ప్రభుత్వం ఒక దారి.. పార్టీ మరో దారి కాకుండా చూస్తారా?

తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పటికీ పార్టీ సంస్థాగత వ్యవస్థ, ప్రభుత్వ యంత్రాంగం మధ్య సమన్వయం మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు ఉన్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉంది. అయితే క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదనే ఫిర్యాదులు కూడా వినిపిస్తున్నాయి.

జిల్లా స్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షుల మధ్య సమన్వయం కీలకంగా మారింది. కొందరు డీసీసీ అధ్యక్షులు జిల్లాల్లో మంత్రులు తమను పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడం లేదని, తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని కొత్త ఇన్‌ఛార్జ్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులకు తగిన భాగస్వామ్యం కల్పించడం, సంక్షేమ పథకాల అమలును క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేలా వ్యవస్థను బలోపేతం చేయడం అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రేవంత్‌ రెడ్డి, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌తో సమన్వయం ఎలా?

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని నడిపిస్తుండగా, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ఇద్దరు నాయకులతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, సీనియర్‌ నేతలను సమన్వయం చేసుకుంటూ సందీప్‌ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.

గతంలో పార్టీ ఇన్‌ఛార్జ్‌ల మార్పులు జరిగినా ప్రభుత్వానికి, పార్టీ సంస్థాగత నాయకత్వానికి మధ్య కొన్ని అంశాల్లో సమన్వయ సమస్యలు కొనసాగాయనే చర్చ ఉంది. అందువల్ల సందీప్‌ వ్యక్తిగతంగా నేతలతో మాట్లాడటంతో పాటు క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించి సమస్యలు ముదరకముందే పరిష్కరించే విధానం అవలంబించాల్సి ఉంటుంది.

అదే సమయంలో పార్టీ వ్యవహారాల్లో అధిష్ఠానం పాత్ర, రాష్ట్ర నాయకత్వానికి ఉండాల్సిన స్వేచ్ఛ మధ్య సమతుల్యత పాటించడం కూడా ఆయనకు ముఖ్యమైన అంశం కానుంది.

వచ్చే ఎన్నికలే లక్ష్యంగా సంస్థాగత బలోపేతం

వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీని సిద్ధం చేయాలన్నది కాంగ్రెస్‌ నాయకత్వం ముందున్న లక్ష్యం. కేవలం అధికారంలో ఉండటం మాత్రమే కాకుండా, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో పార్టీ కమిటీలను క్రియాశీలం చేయడం, బూత్‌ స్థాయిలో కార్యకర్తల నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం, ప్రభుత్వ పథకాలపై ప్రజల అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కీలకం.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‌ ప్రకటించిన కోటి ఓట్ల లక్ష్యం, 90 అసెంబ్లీ స్థానాల లక్ష్యాన్ని సాధించాలంటే ఇప్పటి నుంచే పక్కా కార్యాచరణ అవసరం. పార్టీకి దూరమైన పాత నాయకులను తిరిగి దగ్గర చేసుకోవడం, యువతకు ప్రాధాన్యత ఇవ్వడం, క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహించడం వంటి అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.

సీనియర్లను కలుపుకొని.. కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహిస్తారా?

తెలంగాణ కాంగ్రెస్‌లో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సీనియర్‌ నాయకులతో పాటు కొత్తగా పార్టీలోకి వచ్చిన నాయకులు కూడా ఉన్నారు. వీరి మధ్య సమతుల్యత సాధించడం మరో సవాల్‌. పదవులు, ప్రాధాన్యత, నియోజకవర్గాల్లో ఆధిపత్యం వంటి అంశాలపై భిన్నాభిప్రాయాలు తలెత్తకుండా చూడాలి. సీనియర్ల అనుభవాన్ని వినియోగించుకుంటూనే యువ నాయకత్వానికి అవకాశాలు కల్పిస్తే పార్టీకి సంస్థాగతంగా ప్రయోజనం కలిగే అవకాశం ఉంది.

సవాళ్లను అవకాశాలుగా మార్చుకుంటారా?

తెలంగాణ కాంగ్రెస్‌ నూతన ఇన్‌ఛార్జ్‌గా బీఎం సందీప్‌ కుమార్‌ బాధ్యతలు చేపట్టిన తొలి పర్యటనలోనే పీఏసీ, పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీ, విస్తృత పీసీసీ సమావేశాలతో పాటు మంత్రులు, డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలతో విడివిడిగా చర్చలు నిర్వహించారు. పార్టీని రాబోయే రెండేళ్లలో మరింత బలోపేతం చేసి, వచ్చే ఎన్నికల్లో ప్రస్తుత స్థానాల కంటే ఎక్కువ సీట్లు సాధించడమే లక్ష్యమని ఆయన ప్రకటించారు.

అయితే ప్రకటనలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో సమస్యలకు పరిష్కారం చూపించడమే ఆయన పనితీరుకు అసలైన కొలమానం కానుంది. అసంతృప్త నేతలను బుజ్జగించడం, పదవుల భర్తీపై స్పష్టత ఇవ్వడం, పార్టీ–ప్రభుత్వ సమన్వయాన్ని మెరుగుపరచడం, కార్యకర్తలకు తగిన గుర్తింపు కల్పించడం వంటి అంశాల్లో ఆయన తీసుకునే నిర్ణయాలు తెలంగాణ కాంగ్రెస్‌ భవిష్యత్‌ రాజకీయ ప్రయాణాన్ని ప్రభావితం చేయనున్నాయి.

మొత్తంగా చూస్తే.. తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్‌ ముందున్నది కేవలం పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించే బాధ్యత మాత్రమే కాదు. అధికారంలో ఉన్న పార్టీని ఐక్యంగా ఉంచడం, ప్రభుత్వానికి రాజకీయ బలంగా నిలబెట్టడం, వచ్చే ఎన్నికల నాటికి బలమైన సంస్థాగత శక్తిగా తీర్చిదిద్దడం. ఈ మూడు లక్ష్యాలను ఆయన ఏ మేరకు సమన్వయం చేస్తారన్నదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ.